ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సంబరాలు రెండో రోజైన మంగళవారమూ అంబరాన్ని తాకాయి. బతుకమ్మ.. బతుకమ్మ.. మా తల్లి బతుకమ్మ అంటూ మహిళలు, చిన్నారులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఆడిపాడారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు కొనసాగాయి. ఇందులో భాగంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వివిధ సంఘాల మహిళలు సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి.. గౌరమ్మ, వివిధ రకాల పూలతో సద్దుల బతుకమ్మను అలంకరించి, గౌరమ్మపూజలు చేశారు.
తెలంగాణ అమరులను స్మరించుకున్నారు. కాగా.. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన మహిళా సంఘాలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆదిలాబాద్ పట్టణం కోలీపూరకు చెందిన శ్రీలక్ష్మి బృందం ప్రథమ బహుమతి, జైనథ్ మండలానికి చెందిన గణిత బృందం ద్వితీయ బహుమతి, ఆదిలాబాద్‌ద పట్టణానికి చెందిన భాగ్యలక్ష్మి బృందం తృతీయ బహుమతి గెలుచుకుంది. వారికి కలెక్టర్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ రాజ్, డీఎస్‌డీవో సుధాకర్‌రావు, మెప్మా పీడీ రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
బతుకమ్మ ఆడిన కలెక్టర్
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో భాగంగా కలెక్టర్ అహ్మద్‌బాబు కూడా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆనందంగా గడిపారు. తదుపరి ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేక రాష్ట్రంలో మరింత ఎక్కువగా పనిచేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. ఈ సంబరాలు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు శుభసూచకమని తెలిపారు.
అంబరాన్నంటిన సంబరాలు
Published Wed, Jun 4 2014 2:10 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement