కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల లెక్కింపు 240 టేబుళ్లలో నిర్వహిస్తామని కలెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు. మరో 14 టేబుళ్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సారి ఓట్ల లెక్కింపులో ప్రతీ టేబుల్‌కు ఒక ప్రింటింగ్ కమ్ యాక్సిలరీ డిస్‌ప్లే యూనిట్‌ను (పాడు) ఏర్పాటు చేశామన్నారు.
ఈ విధానం గురించి కలెక్టర్ రాజకీయ ప్రతినిధులకు తెలియజేశారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవ ర్గాల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 20 కౌంటింగ్ హాళ్లలో జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి 11,228, పది అసెంబ్లీ స్థానాలకు 15,028 వినియోగించుకున్నారని తెలిపారు. జిల్లాలో జరిగే ఓట్ల లెక్కింపును ఎనిమిది మంది పరిశీలకులు పర్యవేక్షిస్తారన్నారు. జిల్లాకు కొత్తగా కౌంటింగ్ పరిశీలకులు శివ్‌కాన్ ద్వివేది, ప్రమోద్‌కుమార్, ఓంప్రకాష్ పాటస్కర్, రాకేశ్‌కుమార్ వచ్చారని తెలిపారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఉంటారని వివరించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపర్‌ను లెక్కించేం దుకు కూడా ముగ్గురు అధికారుల చొప్పున నియమించామన్నారు. సరిపడా కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు.
ఇప్పటి వరకు కొంత మంది ఏజెంట్లను నియమించుకున్నారని తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ముథోల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో (బాలుర)లో జరుగుతుందన్నారు. బోథ్, నిర్మల్, ఖానాపూర్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలికల)లో జరుగుతుందన్నారు.
240 టేబుళ్లలో ‘సార్వత్రిక’ లెక్కింపు
Published Thu, May 15 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM
Advertisement
Advertisement