కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ ఓట్లూ కీలకంగా మారనున్నాయి. ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగం, ఎన్నికల విధులపై ఉద్యోగులకు ఈ నెల 25 నుంచి 29వరకు శిక్షణ ఇవ్వనున్నారు. మూడు రోజులపాటు సాగే శిక్షణలోనే ఉద్యోగులు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. శిక్షణ కేంద్రంలో రెండు డ్రాఫ్ట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నారు.
ఆ బాక్సుల్లో ఉద్యోగులు ఓటు వేయొచ్చని సంబంధిత ఎన్నికల అధికారులు చెబుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై గుర్తులు ఉండవు.. పోటీ చేసే అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. కాగా, జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధుల నిర్వహణకు 17,500 మంది ఉద్యోగులు అవసరమని అధికారులు అంచనాకు వచ్చారు. వీరిలో 3,443 మంది పోలీసు అధికారులు, 40 మంది బ్యాంకు అధికారులు, 3,500 మంది రెవెన్యూ, జిల్లా స్థాయి అధికారులు, 10,517 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరే కాకుండా ఓటరు జాబితాలో రెండు శాతం ఓట్లు ఉద్యోగులవే కావడం గమనార్హం.
పోస్టల్ బ్యాలెట్ కోసం..
ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు సహాయ కేంద్రం ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పొందే సౌకర్యం కల్పించారు.
ఇప్పటికే కొంతమంది పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పొందారు. శిక్షణ కార్యక్రమంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కొంతమంది కిందిస్థాయి సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్‌పై అవగాహన లేకపోవడంతో తీసుకోవడం లేదు. అవగాహన కల్పించాల్సిన అధికారులూ మిన్నకుండిపోతున్నారు. దీంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
పోస్టల్ బ్యాలెట్ పత్రంలో సదరు ఉద్యోగి ఫొటో ఓటరు గుర్తింపు కార్డు నంబరు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది. లేదంటే పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పొం్దడం కష్టమవుతుంది. కొంతమంది ఉద్యోగులకు ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు లేనట్లు తెలుస్తోంది.
పోస్టల్ ఓట్లూ కీలకమే..
Published Thu, Apr 24 2014 1:57 AM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM
Advertisement