సాక్షి, కరీంనగర్ : ఒక్క ఓటు.. అభ్యర్ధుల గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఆ ఒక్క ఓటే వారి రాజకీయ భవిష్యత్తునూ మలుపు తిప్పవచ్చు. అందుకే అభ్యర్థులు ఈ సారి ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పోలింగ్‌ముందు ప్రతి అంశాన్ని గుర్తించి మరీ తమకు అనుకూలంగా మలుచుకున్న అభ్యర్థులు.. ఇప్పుడు చివరి అవకాశంగా మారిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై దృష్టి పెట్టారు. ఈ నెల 15న పోస్టల్ బ్యాలెట్ల సమర్పణకు చివరి తేదీ కావడం.. ఇంకా 9,589 మంది ఉద్యోగులు ఓటును వినియోగించుకోకపోవడంతో వారిని మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.
కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నవారు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారు. కొన్ని ఓట్లయితే విజయం సాధిస్తామని నమ్మకమున్నవారు కొందరు.. ఇప్పటికే ఎంతో ఖర్చు చేశాం.. పోస్టల్ బ్యాలెట్ల కోసమూ కొంత ఖర్చు చేద్దామని ఇంకొందరు పోటీపడుతున్నారు. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించిన 13,279 మంది పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు అందరికీ జిల్లా అధికారులు పోస్టు ద్వారా వారి ఇళ్లకు పోస్టల్ బ్యాలెట్లు పంపించారు. ఇప్పటివరకు 3,690 మంది మాత్రమే బ్యాలెట్లు సమర్పించారు.
కాసుల వర్షం..!
సాధారణ ఎన్నికల్లో ఓట్ల కోసం మహిళలు.. యువత.. కుల, స్వచ్చంద సంస్థలకు గాలం వేసిన అభ్యర్థులు కోట్లు కుమ్మరించారు. తాజాగా పోస్టల్ బ్యాలెట్లకూ అదే స్థాయిలో ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బంది వివరాలు సేకరించి నేరుగా వారి ఇళ్లకు చేరుకుంటున్నారు. వారిని ప్రలోభపెడుతూబ్యాలెట్‌కు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారు. ఇంకొందరు శాఖల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఉన్న ఉద్యోగుల వివరాలు తెలుసుకుని సంబంధిత అధికారులు, ఉద్యోగ సంఘాలను ఆశ్రయిస్తున్నారు. గుంపగుత్తగా ఓట్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోస్టల్ బ్యాలెట్లు ఉన్న కొందరు ఉద్యోగులు అభ్యర్థుల నుంచి భారీ నజరానాలు ఆశిస్తున్నారు. ఏదేమైనా.. పోస్టల్ బ్యాలెట్ల సమర్పణకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలింది. ఆ లోగా ఎంతమంది వారి హక్కును వినియోగించుకుంటారో...? ఏ నాయకుడి ఎన్నికకు కారణమవుతారో వేచి చూడాలి.
‘పోస్టల్’ బేరసారాలు
Published Sun, May 11 2014 2:15 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement