సాక్షి, కరీంనగర్ : చెప్పేందుకే శ్రీరంగనీతులు అన్న చందంగా తయారైంది జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల తీరు. ‘ఓటు మీ ఆయుధం.. మీ ఐదేళ్ల భవిష్యత్తు పోలింగ్ కేంద్రంలో మీరు ఎంచుకునే ప్రజాప్రతినిధిపైనే ఆధారపడి ఉంటుంది. అందరూ ఓటేయండి.. ప్రతి ఒక్కరితోనూ ఓటేయించండి..’ అంటూ జిల్లా ఓటర్ల చెవుల్లో జోరీగలా హోరు పెట్టిన అధికార యంత్రాంగమే ఓటుహక్కు వినియోగించుకోవడం లేదు.
ఒక్క ఓటు.. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తుంది. అదే వేలాది ఓట్లు..? అభ్యర్ధుల మెజారిటీనే కాదు పోలింగ్ శాతాన్ని పెంచుతాయి. ఈ విషయం తెలిసి కూడా సిబ్బంది ఓటు వినియోగంలో నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. అందరికీ ఓటేయమని చెప్పిన ఉద్యోగులే అమలులో వెనకబడ్డారు. ఎన్నికల సిబ్బందికి ప్రభుత్వం కల్పించే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోలేదు. 13,279 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు కేవలం 3 వేల మంది మాత్రమే వినియోగించుకోవడం గమనార్హం.
గత నెల 30న జరిగిన సాధారణ ఎన్నికల్లో.. జిల్లావ్యాప్తంగా 3,419 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన యంత్రాం గం 34,569 మంది ఎన్నికల సిబ్బంది సేవలను వినియోగించుకుంది. వీరిలో 4 వేల మంది పోలింగ్ అధికారులు, 4 వేల అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 15,048 మంది ఇతర పోలింగ్ అధికారులు, 865 మంది మైక్రో అబ్జర్వర్లు, 639 మంది వీడియోగ్రాఫర్లు, 9,330 మంది పోలీసులు ఉన్నారు. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు, ఉద్యోగులు 5 వేల మందిని మినహాయిస్తే.. 29,569 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది.
కానీ, పోస్టల్ బ్యాలెట్ల కోసం నిర్ణీత సమయంలో 13,279 మంది మాత్రమే ఆయా మండలాల్లో తహశీల్దార్లకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అధికారులు 12,440 మందికి పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. పోలింగ్ జరిగి ఎనిమిది రోజులు పూర్తయినా ఇంత వరకు కేవలం 3,125 మంది ఉద్యోగులే పోస్టల్‌బ్యాలెట్లు ఉపయోగించుకున్నారు.
దరఖాస్తు చేసున్న వారిలో 10,154 మంది నేటికీ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్లు సమర్పించడానికి ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈలోపు ఇంకెంత మంది దాఖలు చేస్తారో తెలియని పరిస్థితి. అధికారులు మాత్రం.. ఈ నెల 15లోగా అందరూ పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
వీరికేదీ అవకాశం?
జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తాం.. అందరూ ఓటు హక్కు ఉపయోగించుకోవాలన్న జిల్లా యంత్రాంగం ఎన్నికల విధులు నిర్వర్తించిన వారినే విస్మరించిందనే విమర్శలొస్తున్నాయి.
ఇప్పటికే వేలాది మంది సిబ్బంది కనీసం పోస్టల్ బ్యాలెట్లు కూడా వినియోగించుకోకపోవడం ఓ ఉదాహరణ అయితే.. ఎన్నికల్లో కీలకపాత్ర పోషించిన 1,100 మంది వెబ్‌కాస్టింగ్ విద్యార్థులు, 3,420 మంది ఎన్‌సీసీ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లనూ ఓటుకు దూరం చేశారు. పోలింగ్ రోజు వీరికి ఎన్నికల విధులు వేయడం.. పోస్టల్ బ్యాలెట్లకు అనర్హులు కావడంతో వీరు ఓటేయలేదు. ఈ విషయమై.. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో అందరితోపాటు వీరికి కూడా ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు.
గెలుపు కోసం ఒక్క ఓటు!
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా యంత్రాంగం.. ప్రతీ ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేశారు. వరుసగా జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీ సీ, సాధారణ ఎన్నికల్లో ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పార్టీ అభ్యర్ధులందరూ ఓటు హక్కు వినియోగంపై విృస్తత ప్రచారం చేశారు. ఎన్నికల సంఘమైతే.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలతోపాటు ఫ్లెక్సీ లు.. కరపత్రాలతో విసృ్తత ప్రచారం కల్పించింది. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్న యువత సుమారు లక్ష మంది ఈసారి ఓటేశారు.
జిల్లాలోని పదమూడు నియోజకవర్గాలకు ఎనిమిది నియోజకవర్గాల్లో మహిళలు పురుషులకు మించి ఓటేశారు. జిల్లాలో 72.21 శాతం పోలింగ్ జరిగింది. జిల్లావ్యాప్తంగా 28,25,939 మంది ఓటర్లుండగా.. 20,40,562 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే 2009 సాధారణ ఎన్నికల్లో 67.05 శాతం పోలింగ్ జరిగింది. ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బంది అందరికీ ఓటు అవకాశం కల్పిస్తే.. పోలింగ్ శాతం పెరగడంతోపాటు అభ్యర్థుల గెలుపోటములపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
చైతన్యమెక్కడ?
Published Thu, May 8 2014 3:56 AM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM
Advertisement
Advertisement