ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పోస్టల్ బ్యాలెట్ చాలా ధర పలుకుతోంది. సర్వీస్ ఓటర్లకు కూడా దాదాపుగా అంతే డిమాండ్ వచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా పరువు నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రెండు కేటగిరీలకు చెందిన వారికి గాలం వేసేందుకు ప్రయత్నిస్తోంది. వారిని తమవైపు తిప్పుకొని ఓట్లు వేయించుకునేందుకు పడరానిపాట్లు పడుతోంది. ఇందుకోసం ధర కూడా నిర్ణయించినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఒక్కో పోస్టల్ బ్యాలెట్‌కు 3 వేల రూపాయల చొప్పున ధర నిర్ణయించడంతోపాటు తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులను ఇందుకు పురమాయించింది. సర్వీస్ ఓటర్ల విషయంలో మాజీ సైనికుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో ఎలాగైనా ఈ రెండు కేటగిరీలకు చెందిన వారిలో మెజార్టీ ఓట్లు తమ అభ్యర్థులకు పడేవిధంగా కుస్తీలు పడుతోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ఫ్యాన్’గాలి బలంగా వీచినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గట్టిపోటీ ఉన్నచోట అయినా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓటర్లతో గట్టెక్కేందుకు తీవ్ర అగచాట్లు పడుతోంది. ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం 19,244 పోస్టల్ బ్యాలెట్లు, 7,637 సర్వీస్ ఓట్లు జారీ చేసింది. రెండు కేటగిరీలకు కలిపి 26,881 మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 8,064 మంది మాత్రమే వాటిని వినియోగించుకున్నారు. ఇంకా 18,817 మంది ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలో వారిలో ఎక్కువ శాతం తమవైపు తిప్పుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
రంగంలోకి దిగిన తెలుగు దళం :
పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకునే ప్రభుత్వ ఓటర్లను, సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే సైనికులను ఆకర్షించేందుకు తెలుగు దళం రంగంలోకి దిగింది. కొన్ని రోజుల నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద కాపు కాస్తోంది. తెలుగుదేశం సానుభూతిదారులైన రిటైర్డు ఉద్యోగులతోపాటు కొంతమంది ఉపాధ్యాయులు కూడా కార్యాలయ ఆవరణలోనే మకాం వేశారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకునేవారి జాబితాలను సంబంధిత కార్యాలయాల వద్ద అంటించారు. ఆ జాబితాలను దగ్గర పెట్టుకొని చిరునామాలను సేకరించి నేరుగా వారితో రాయబేరాలు సాగిస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబునాయుడు సీమాంధ్రను సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చేస్తారని, ప్రభుత్వ ఉద్యోగులను గతంలో మాదిరిగా ఇబ్బంది పెట్టరంటూ పదేపదే చెప్పడంతోపాటు నోటు ఆశను చూపిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయం ముందు పడిగాపులు కాస్తూ పోస్టల్ బ్యాలెట్లకు వచ్చేపోయేవారిని కలుస్తూ అనేక రకాలుగా మభ్యపెడుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పోటీ ఇచ్చామని లెక్కలు వేసుకుంటున్న నియోజకవర్గాల్లో పచ్చనోట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల వైఖరిని అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులు ఖండిస్తున్నారు. మరీ ఇంతగా దిగజారిపోయారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్లు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లు కలిగిన సైనికులు తెలుగుదేశం అభ్యర్థులను గట్టెక్కిస్తారని కొండంత ఆశ పెట్టుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ చాలా ‘రేట్ ’ గురూ
Published Sun, May 11 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement