Service voters
-
భారీగా పెరిగిన సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో సర్వీస్, పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు భారీగా పోలైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్లతో పోలిస్తే సర్వీస్ ఓట్లు గణనీయంగా తగ్గాయి. రేపు ఉదయం ఏడులోగా కౌంటింగ్ సెంటర్‌కు చేరే సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని అధికారులు తెలిపారు. కాగా రేపే కౌటింగ్ నేపథ్యంలో ఇప్పటివరకు పోలైన సర్వీస్ ఓట్ల వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. మే 20 నాటికి జిల్లాల వారీగా పోలైన సర్వీసు ఓట్ల వివరాలు.. శ్రీకాకుళం 8121 విజయనగరం 2564 విశాఖపట్నం 3333 తూర్పు గోదావరి 923 కృష్ణా 457 గుంటూరు 3036 ప్రకాశం 3765 నెల్లూరు 362 కడప 1175 కర్నూలు 1935 అనంతపురం 1676 చిత్తూరు 2185 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పోలైన సర్వీస్ ఓట్లు 28, 662175 అసెంబ్లీలకు పోలైన మొత్తం సర్వీస్ ఓట్లు 29,53225. పార్లమెంటు నియోజక వర్గాల్లో వచ్చిన ఫారం 12 దరఖాస్తులు 3,17,291 లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో జారీ చేసిన ఓట్లు 3,00,957 ఇప్పటి వరకు లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఆర్వోలకు అందిన పోస్టల్ బ్యాలెట్లు 2,14,937 13 జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నది 3,18,530 మంజూరు చేసింది 3,05,040 మే 20 నాటికి ఆర్వోలకు చేరిన పోస్టల్ బ్యాలెట్లు 2,11,623 -
భారత్‌లో ఎన్నికలు; పాకిస్తాన్ నుంచి ఓట్లు!
న్యూఢిల్లీ: మన దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్ నుంచి కొంత మంది ఓటు వేశారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి దాదాపు వందమందిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు. ఓటు వేసిన వారందరూ భారతీయులే. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారంతా ఈ-పోస్టల్ బ్యాలెట్(ఈటీపీబీఎస్)తో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎలక్ట్రానిక్ పోస్టల్ ఓటర్ విధానంతో భారత సార్వత్రిక ఎన్నికల్లో తమ గళాన్ని వినిపించే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటికే ఐదు విడతల ఎన్నికలు ముగిశాయి. మరో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగాల్సివుంది. ఈనెల 19 నాటికి ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. 23న ఓట్లు లెక్కిస్తారు. ఈటీపీబీఎస్ అంటే... ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీపీబీఎస్)ను సర్వీసు ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగులను సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారు. సీ-డాక్ రూపొందించిన ఈటీపీబీఎస్ అత్యంత సురక్షితమైందని, రెండంచల్లో భద్రత ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఓటీపీ, పిన్ ద్వారా గోప్యత పాటిస్తారు. స్పష్టమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది కనుక రెండుసార్లు ఓటు పడే అవకాశం(డూప్లికేషన్) ఉండదు. సర్వీసు ఓటర్లతో పాటు ఉంటున్న భాగస్వాములు(భార్య/భర్త), విదేశాల్లో ఉంటున్న రక్షణ శాఖ ఉద్యోగులు దీని ద్వారా ఓటు వేయొచ్చు. తమ నియోజకవర్గానికి వెలుపల ఉన్న సర్వీసు ఓటర్లు ఈటీపీబీఎస్ ద్వారా ఎక్కడినుంచైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి ఈటీపీబీఎస్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓటీపీ కావాలి. ఈ ఫైల్‌ను ఆన్లైన్లో పంపించేందుకు పిన్ తప్పనిసరి. ఎన్నికలకు 16 రోజుల ముందు ఈ-బ్యాలెట్ పంపించాలి. సర్వీసు ఓటరుగా ముందుగా నమోదు చేయించుకుంటేనే దీన్ని వాడగలరు. సర్వీసు ఓటర్లు పంపించిన ఈ-బ్యాలెట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఈఆర్ఓ)కి మాత్రమే కనబడుతోంది. దాన్ని ఆమోదించే, తిరస్కరించే అధికారం ఈఆర్ఓకు మాత్రమే ఉంటుంది. ఈటీపీబీఎస్‌లో ఓటు వేసేదిలా... -
ఓటు.. ఐదు రకాలు
సాక్షి, అచ్చంపేట : ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతీ పౌరుడికీ రాజ్యాంగం ఓటుహక్కు కల్పించింది. ఓటు ద్వారానే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. అయితే ఓటును ఐదు రకాలుగా విభజించారు. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. టెండర్ ఓటు, సాధారణ ఓటు, సర్వీస్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఓటర్లే. ఎన్నికల సమయంలో వీరు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. వీరు కూడా ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు బ్యాలెట్ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను తపాలా శాఖ ద్వారా పంపించి ఓటు హక్కును వినియోగించుకుంటారు. మరికొందరు పోలింగ్ ముందు రోజే ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం పోస్టల్ పోలింగ్‌ను ఏర్పాటు చేసి ఓటు వేయిస్తారు. ఓట్ల లెక్కింపు అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో సందర్భంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే అభ్యర్థుల గెలుపులో కీలకంగా మారుతాయి. టెండరు ఓటు.. ఓటరు జాబితాలో ఓటుహక్కు ఉన్న వ్యక్తి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసేటప్పుటికే ఆ వ్యక్తి ఓటును మరొకరు వేసినా.. సదరు వ్యక్తి ఓటు వేయవచ్చు. ఇందుకోసం రిటర్నింగ్ అధికారి వద్ద తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని నిరూపించాలి. పోలింగ్ అధికారి హామీతో ఓటును వినియోగించుకోవచ్చు. దీన్నే టెండరు ఓటు అంటారు. సాధారణ ఓటు.. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు అన్ని రకాల ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కలిగి ఉండాలి. ఇదే సాధారణ ఓటు. 18 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ ఓటు హక్కును పొందేందుకు అర్హులు. ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఆధారాలు చూపిస్తే ఓటుహక్కు కల్పిస్తారు. సర్వీస్ ఓటు.. సైనికుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వీసు ఓటు వేసే అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సైన్యంలో విధులు నిర్వహించే సైనిక ఉద్యోగులు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉంటారు. సైన్యంలోని ప్రధాన అధికారి ద్వారా/ తపాలా శాఖ ద్వారా ఓటు పంపించవచ్చు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫరబుల్ ద్వారా కూడా పంపవచ్చు. ప్రవాస భారతీయులకూ.. ఈసారి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆన్లైన్లో ఫారం–6ఏ ద్వారా దరఖాస్తు చేసుకుని తగిన ఆధారాలు చూపించి ఓటు హక్కును పొందవచ్చు. ఓటు హక్కును పొందిన ప్రవాస భారతీయుల ఆసక్తి మేరకు విదేశాల నుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. -
పోస్టల్ బ్యాలెట్ చాలా ‘రేట్ ’ గురూ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పోస్టల్ బ్యాలెట్ చాలా ధర పలుకుతోంది. సర్వీస్ ఓటర్లకు కూడా దాదాపుగా అంతే డిమాండ్ వచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా పరువు నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రెండు కేటగిరీలకు చెందిన వారికి గాలం వేసేందుకు ప్రయత్నిస్తోంది. వారిని తమవైపు తిప్పుకొని ఓట్లు వేయించుకునేందుకు పడరానిపాట్లు పడుతోంది. ఇందుకోసం ధర కూడా నిర్ణయించినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఒక్కో పోస్టల్ బ్యాలెట్‌కు 3 వేల రూపాయల చొప్పున ధర నిర్ణయించడంతోపాటు తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులను ఇందుకు పురమాయించింది. సర్వీస్ ఓటర్ల విషయంలో మాజీ సైనికుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో ఎలాగైనా ఈ రెండు కేటగిరీలకు చెందిన వారిలో మెజార్టీ ఓట్లు తమ అభ్యర్థులకు పడేవిధంగా కుస్తీలు పడుతోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ఫ్యాన్’గాలి బలంగా వీచినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గట్టిపోటీ ఉన్నచోట అయినా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓటర్లతో గట్టెక్కేందుకు తీవ్ర అగచాట్లు పడుతోంది. ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం 19,244 పోస్టల్ బ్యాలెట్లు, 7,637 సర్వీస్ ఓట్లు జారీ చేసింది. రెండు కేటగిరీలకు కలిపి 26,881 మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 8,064 మంది మాత్రమే వాటిని వినియోగించుకున్నారు. ఇంకా 18,817 మంది ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలో వారిలో ఎక్కువ శాతం తమవైపు తిప్పుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. రంగంలోకి దిగిన తెలుగు దళం : పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకునే ప్రభుత్వ ఓటర్లను, సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే సైనికులను ఆకర్షించేందుకు తెలుగు దళం రంగంలోకి దిగింది. కొన్ని రోజుల నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద కాపు కాస్తోంది. తెలుగుదేశం సానుభూతిదారులైన రిటైర్డు ఉద్యోగులతోపాటు కొంతమంది ఉపాధ్యాయులు కూడా కార్యాలయ ఆవరణలోనే మకాం వేశారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకునేవారి జాబితాలను సంబంధిత కార్యాలయాల వద్ద అంటించారు. ఆ జాబితాలను దగ్గర పెట్టుకొని చిరునామాలను సేకరించి నేరుగా వారితో రాయబేరాలు సాగిస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబునాయుడు సీమాంధ్రను సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చేస్తారని, ప్రభుత్వ ఉద్యోగులను గతంలో మాదిరిగా ఇబ్బంది పెట్టరంటూ పదేపదే చెప్పడంతోపాటు నోటు ఆశను చూపిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయం ముందు పడిగాపులు కాస్తూ పోస్టల్ బ్యాలెట్లకు వచ్చేపోయేవారిని కలుస్తూ అనేక రకాలుగా మభ్యపెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పోటీ ఇచ్చామని లెక్కలు వేసుకుంటున్న నియోజకవర్గాల్లో పచ్చనోట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల వైఖరిని అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులు ఖండిస్తున్నారు. మరీ ఇంతగా దిగజారిపోయారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్లు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లు కలిగిన సైనికులు తెలుగుదేశం అభ్యర్థులను గట్టెక్కిస్తారని కొండంత ఆశ పెట్టుకున్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల ఎన్నికలకు ఈ నెల 30వ తేదీ పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. మొత్తం 142 వార్డులకు 592 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, 2 లక్షల 12 వేల 179 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు 219 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. 268 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) ఏర్పాటుచేసి 1,313 మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు వివరించారు. 303 మంది సర్వీస్ ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ చెప్పారు. స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, చీమకుర్తి, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీల ఎన్నికలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ముందుగా వార్డుల వారీగా ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత చైర్మన్లను ఎన్నుకుంటారని తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. రీ పోలింగ్ అవసరమైతే ఏప్రిల్ 1వ తేదీ నిర్వహిస్తామన్నారు. 2వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లోనే కౌంటింగ్ జరుగుతుందన్నారు. చీమకుర్తి, అద్దంకి ప్రాంతాల్లో 8 టేబుల్స్ చొప్పున, మిగిలిన ప్రాంతాల్లో 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటుచేసి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 87 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మున్సిపల్ ఎన్నికల్లో 87 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు వీడియోగ్రఫీ నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక సెక్యూరిటీ పర్సన్‌ను నియమించామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 1+2 పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 5గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసిందని, ఒక్కో అభ్యర్థికి ఒక వాహనానికి మాత్రమే అనుమతిచ్చామని తెలిపారు. చిన్నచిన్న వార్డులుంటే వాటి పరిధిలోనే ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల అనంతరం కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. క్రిమినల్ రికార్డు ఉన్నవారిని ఏజెంట్లుగా నియమిస్తే అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి ఏజెంట్‌కు ఫొటో గుర్తింపు కార్డు ఇచ్చి కౌంటింగ్ కేంద్రంలోకి పంపిస్తామని తెలిపారు. పూర్తిగా పోలీసులకే వదిలిపెట్టలేదు... ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు నిరంతర నిఘా పెట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆ విషయాన్ని పూర్తిగా పోలీసులకే వదిలి పెట్టకుండా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పవర్స్ కలిగిన వారిని ఫ్లయింగ్ స్క్వాడ్స్ కింద నియమించినట్లు చెప్పారు. వారు జాయింట్ టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుల వాహనాలతో పాటు ఎలక్షన్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వాహనాలను కూడా తనిఖీ చేస్తామన్నారు. టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతూనే ఉంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 3 కోట్ల 65 లక్షల రూపాయలను పట్టుకున్నామని, ఆ నగదుకు సంబంధించిన రికార్డులు చూపించడంతో వదిలేశామని, ఆ మేరకు జిల్లా ఎస్పీ నుంచి వివరణ తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. అవికాకుండా ఇప్పటివరకు 6 లక్షల 80 వేల రూపాయలను పట్టుకున్నట్లు చెప్పారు. ఓటుహక్కు కోసం 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు... ఓటుహక్కు కోసం ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం గడువిచ్చిందని కలెక్టర్ తెలిపారు. కొన్నిచోట్ల ఓట్లను తొలగించారన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ నెల 9, 16 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టగా ఓటు హక్కు కోసం జిల్లాలో 94 వేల 560 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 60 వేల దరఖాస్తులను విచారించామని చెప్పారు. మిగిలిన వాటిని కూడా రెండుమూడు రోజుల్లో విచారిస్తామన్నారు. గతంలో ఓటు హక్కు ఉండి జాబితాలో పేర్లులేనివారు సక్రమంగా వివరాలు అందించకుంటే తిరస్కరిస్తామన్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఒక్క ఓటు కూడా తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. సుమోటాగా ఓట్లను తొలగించే అధికారం కూడా లేదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. విలేకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు పాల్గొన్నారు. -
సర్వీసు ఓటు వృథానే..!
ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న సర్వీసు ఓటర్లు తప్పుల తడకగా ఓటర్ల జాబితా మృతి చెందిన ఆర్మీ ఉద్యోగులకూ ఓటు రిటైర్డ్ అయినవారికీ పోస్టల్ బ్యాలెట్టే సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటూ నమోదు కాలేదు చిరునామాలు తప్పని తిరుగు టపా ఓటు వేయలేని పరిస్థితిలో జిల్లాలోని 7039 మంది సర్వీస్ ఓటర్లు బేస్తవారిపేట, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సర్వీస్ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోంది. జిల్లాలో 7039 మంది సర్వీస్ ఓటర్లున్నారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపాల్సి ఉంది. అస్సాం, జమ్ము కాశ్మీర్, నీలగిరి,బెంగళూరు, నాసిక్ వంటి సుదూర ప్రాంతాల్లో సైనిక ఓటర్లున్నారు. ఈనెల 24న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒంగోలులో బ్యాలెట్లు ముద్రించి తీసుకురావాల్సి ఉంది. ఎన్నికల అధికారులు ఎంపీటీసీల సెగ్మెంట్ల వారీగా పోస్టల్ బ్యాలెట్లను తయారు చేయాలి. పోస్ట్‌ద్వారా పంపడానికి కనీసం మరో మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది. బేస్తవారిపేట మండలంలో 602 మంది సర్వీస్ ఓటర్లందరూ సైనికులే. ఓటర్ల జాబితాలో రెజిమెంట్ మాత్రమే నమోదు చేసి ఉండటంతో అక్కడి నుంచి పనిచేసే స్థానానికి పంపడానికి మరికొన్ని రోజులు పడుతుంది. వచ్చే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వచ్చేస్తాయి. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైనా అధికారులు సకాలంలో ఓటర్లకు బ్యాలెట్‌ను పంపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో మండల అధికారులకు నిధులు విడుదల చేయకపోవడం ఓ కారణం. జమ్ము, కాశ్మీర్ వంటి దూర ప్రాంతాలకు బ్యాలెట్లను స్పీడ్ పోస్ట్‌లో పంపాలంటే ఒక్కో దానికి * 50 ఖర్చవుతుంది. బేస్తవారిపేట మండలంలోని 602 మందికి పోస్టల్ బ్యాలెట్లు పంపడానికి * 30 వేలు ఖర్చవుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చును నేటికీ అధికారులకు అందజేయలేదు. మళ్లీ పోస్టల్ ఖర్చు తడిసిమోపడవుతుందని సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సక్రమంగా లేని జాబితా: ఏడు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంపిన సర్వీస్ ఓటర్ల జాబితానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పంపారు. చనిపోయిన, విశ్రాంత ఉద్యోగులకు ఓట్లు వచ్చాయి. రిటైర్డ్ అయినవారికి బ్యాలెట్లను గతంలో పనిచేసిన ప్రాంతాలకు పంపుతుండటంతో ఓటు హక్కు కోల్పోవాల్సి వ స్తోంది. ఆర్మీ ఉద్యోగులకు మొదట పనిచేసిన చిరునామాలను నెట్లో ఉంచడంతో వారుకూడా ఓటు వినియోగించుకునే పరిస్థితి లేదు. జిల్లాలోనే అత్యధికంగా సర్వీస్ ఓట్లున్న గిద్దలూరు నియోజకర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో పంపిన బ్యాలెట్లు ఓటు వేయకుండానే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కుప్పలుగా అడ్రస్‌లు తప్పుగా ఉన్నాయని వెనక్కువచ్చాయి. ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు సకాలంలో ఓటర్లకు బ్యాలెట్లు అందేలా, మారిన చిరునామాలను సవరించేలా చర్యలు తీసుకోవాలని సర్వీస్ ఓటర్లు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ రామకృష్ణరాజును వివరణ కోరగా సర్వీస్ ఓటర్ల జాబితాను రెండు రోజుల క్రితం అందజేశారని, మండలంలోని 19 పంచాయతీల్లో ఉన్నవారి జాబితాను సిద్ధం చేసి పోస్టల్ బ్యాలెట్లు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పంపిన 602 పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ముగిసిన పది రోజుల తరువాత వెనక్కువచ్చాయని, ఒక్క ఓటుకూడా నమోదు కాలేదని చెప్పారు.