ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న సర్వీసు ఓటర్లు
తప్పుల తడకగా ఓటర్ల జాబితా
మృతి చెందిన ఆర్మీ ఉద్యోగులకూ ఓటు
రిటైర్డ్ అయినవారికీ పోస్టల్ బ్యాలెట్టే
సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటూ నమోదు కాలేదు
చిరునామాలు తప్పని తిరుగు టపా
ఓటు వేయలేని పరిస్థితిలో జిల్లాలోని 7039 మంది
సర్వీస్ ఓటర్లు
బేస్తవారిపేట, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సర్వీస్ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోంది. జిల్లాలో 7039 మంది సర్వీస్ ఓటర్లున్నారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపాల్సి ఉంది. అస్సాం, జమ్ము కాశ్మీర్, నీలగిరి,బెంగళూరు, నాసిక్ వంటి సుదూర ప్రాంతాల్లో సైనిక ఓటర్లున్నారు. ఈనెల 24న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒంగోలులో బ్యాలెట్లు ముద్రించి తీసుకురావాల్సి ఉంది. ఎన్నికల అధికారులు ఎంపీటీసీల సెగ్మెంట్ల వారీగా పోస్టల్ బ్యాలెట్‌లను తయారు చేయాలి. పోస్ట్‌ద్వారా పంపడానికి కనీసం మరో మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది.
బేస్తవారిపేట మండలంలో 602 మంది సర్వీస్ ఓటర్లందరూ సైనికులే. ఓటర్ల జాబితాలో రెజిమెంట్ మాత్రమే నమోదు చేసి ఉండటంతో అక్కడి నుంచి పనిచేసే స్థానానికి పంపడానికి మరికొన్ని రోజులు పడుతుంది. వచ్చే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వచ్చేస్తాయి. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైనా అధికారులు సకాలంలో ఓటర్లకు బ్యాలెట్‌ను పంపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో మండల అధికారులకు నిధులు విడుదల చేయకపోవడం ఓ కారణం. జమ్ము, కాశ్మీర్ వంటి దూర ప్రాంతాలకు బ్యాలెట్‌లను స్పీడ్ పోస్ట్‌లో పంపాలంటే ఒక్కో దానికి * 50 ఖర్చవుతుంది. బేస్తవారిపేట మండలంలోని 602 మందికి పోస్టల్ బ్యాలెట్లు పంపడానికి * 30 వేలు ఖర్చవుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చును నేటికీ అధికారులకు అందజేయలేదు. మళ్లీ పోస్టల్ ఖర్చు తడిసిమోపడవుతుందని సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సక్రమంగా లేని జాబితా:
ఏడు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంపిన సర్వీస్ ఓటర్ల జాబితానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పంపారు. చనిపోయిన, విశ్రాంత ఉద్యోగులకు ఓట్లు వచ్చాయి. రిటైర్డ్ అయినవారికి బ్యాలెట్‌లను గతంలో పనిచేసిన ప్రాంతాలకు పంపుతుండటంతో ఓటు హక్కు కోల్పోవాల్సి వ స్తోంది. ఆర్మీ ఉద్యోగులకు మొదట పనిచేసిన చిరునామాలను నెట్‌లో ఉంచడంతో వారుకూడా ఓటు వినియోగించుకునే పరిస్థితి లేదు. జిల్లాలోనే అత్యధికంగా సర్వీస్ ఓట్లున్న గిద్దలూరు నియోజకర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో పంపిన బ్యాలెట్లు ఓటు వేయకుండానే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కుప్పలుగా అడ్రస్‌లు తప్పుగా ఉన్నాయని వెనక్కువచ్చాయి.
ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు సకాలంలో ఓటర్లకు బ్యాలెట్లు అందేలా, మారిన చిరునామాలను సవరించేలా చర్యలు తీసుకోవాలని సర్వీస్ ఓటర్లు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ రామకృష్ణరాజును వివరణ కోరగా సర్వీస్ ఓటర్ల జాబితాను రెండు రోజుల క్రితం అందజేశారని, మండలంలోని 19 పంచాయతీల్లో ఉన్నవారి జాబితాను సిద్ధం చేసి పోస్టల్ బ్యాలెట్లు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పంపిన 602 పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ముగిసిన పది రోజుల తరువాత వెనక్కువచ్చాయని, ఒక్క ఓటుకూడా నమోదు కాలేదని చెప్పారు.