నవంబర్ ఒకటో తేదీ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఆధార్ర్‌తో బయోమెట్రిక్ విధానం ద్వారా చెల్లిస్తామని కలెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నవంబర్ ఒకటో తేదీ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఆధార్ నంబర్‌తో బయోమెట్రిక్ విధానం ద్వారా చెల్లిస్తామని కలెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు. శనివారం సాయంత్రం టీటీడీసీలో మెప్మా ఆధ్వర్యంలో 56 మంది సీఎస్పీలకు మైక్రో ఏటీఎం యంత్రాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు ఎలా తీసుకోవాలి, ఆధార్ నంబర్ ఎలా నమోదు చేయాలి అనే దానిపై అవగాహన కల్పించారు. పింఛన్లలో అవకతవకలు జరగకుండా ఈ విధానం తోడ్పడుతుందన్నారు. సీఎస్పీలు బాగా పనిచేస్తే ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆధార్ ద్వారా చెల్లింపులు చేసేలా అప్పగిస్తుందన్నారు. ఆన్‌లైన్ చెల్లింపులు లాగిన్, పాస్‌వర్డ్‌లను ఆర్డీవోలకు, సబ్ కలెక్టర్లకు ఇవ్వాలని మెప్మా పీడీ రాజేశ్వర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవోలు అరుణశ్రీ, చక్రధర్, మెప్మా సిబ్బంది సుభాష్, సీఎస్పీలు పాల్గొన్నారు.