లెక్క తేలింది
సామాజిక పింఛన్ల విభజన
నిజామాబాద్‌కు 2,35,321 మంది లబ్ధిదారులు
కామారెడ్డికి 1,47,210 మంది..
ఆధార్ లేకుంటే నిలిపివేత
ఇందూరు : కొత్త జిల్లాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్‌లు, మండలాలతో అన్ని శాఖల్లో విభజన పూర్తయింది. సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలూ వేరు చేయబడ్డాయి. అయితే సం క్షేమ పథకాల్లో ముఖ్యమైన ఆసరా, వికలాంగ, బీడీ తదితర పింఛన్‌లు పొందే లబ్ధిదారుల వివరాలు గ్రామాల మార్పు లు, చేర్పులతో మొన్నటి వరకు విభజన జరగలేదు. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కలిసి ఒకే లాగిన్, కోడ్‌తో బడ్జెట్ రావడం, పంపి ణీ ఎప్పటిలాగే జరిగింది. ప్రస్తుతం పింఛన్‌దారులను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారీగా వేరు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లా కోడ్, లాగిన్‌లు, బడ్జెట్‌లను కేటాయించారు. ఏ జిల్లాకు ఎంత మంది ? పింఛన్‌దారుల లెక్కలను తేల్చారు. ఉమ్మడి జిల్లాలో 3,82,531 మంది పింఛన్‌దారులు ఉండగా, వీరికి నెలకు ప్రభుత్వం రూ. 39 కోట్ల 61లక్షల నిధులను ఖర్చు చేసేది. ప్రస్తుతం తేలిన లెక్కల ప్రకారం పింఛన్ లబ్ధిదారుల వివరాలు చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో మొత్తం పింఛన్‌లు 2,35,321 మంది ఉండగా వీరికి ప్రతి నెల రూ.24కోట్ల 21లక్షలు ఖర్చు అవుతాయి. కామారెడ్డి జిల్లాలో 1,47,210 మందికి గాను రూ.15కోట్ల 40 లక్షలు ఖర్చు అవుతున్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు.
జనవరి నుంచి..
సామాజిక భద్రతా పింఛన్ పథకం ‘ఆసరా’కు ఆధార్‌ను నూటికి నూరు శాతం అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేటాగిరీల వారీగా ఆధార్ లేకుండా పింఛన్‌లు పొందుతున్న వారి వివరాలను మరోసారి సేకరించాలని సెర్ప్ అధికారులు గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాలకు ఆదేశాలు వచ్చాయి. ఆధార్ లేని వారికి జనవరి నాటికి ఆధార్‌ను అసంధానం చేయాలని లబ్ధిదారులకు తెలియజేయాలని, లేదంటే పింఛన్‌ను నిలిపివేస్తామని స్పష్టం చేయాలని తెలిపినట్లు సమాచారం. జిల్లాలో ఆధార్ లేని వారు సుమారు 13 శాతం మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పక్రియతో పలు బోగస్ పింఛన్‌లు తొలిగిపోయే అవకాశం ఉంది.