- గోశాలలో ఆంజనేయస్వామి గుడి తొలగింపు
- జలభవన్ కూల్చకుండా నిలిపివేత
విజయవాడ
దేవాలయాలు కూల్చివేయడం ఒకవైపు సంచలనం కలిగిస్తుంటే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా దేవాలయం కూల్చివేయలేదనే ఆగ్రహంతో కృష్ణాజిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు సూచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుర్గగుడి తాత్కాలిక ఈవో చంద్రశేఖర్ ఆజాద్‌ను బదిలీ చేశారనే సమాచారం నగరంలో హల్‌చల్ చేస్తోంది. అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో ఆజాద్‌ను బదిలీచేస్తే వివాదం అవుతుందని భావించిన ముఖ్యమంత్రి సమయస్ఫూర్తితో దుర్గగుడికి ఐఏఎస్ అధికారిని నియమించి ఆజాద్‌ను తాత్కాలిక బాధ్యతల నుంచి తప్పించారు.
వివరాల్లోకి వెళితే... వారం రోజులుగా నగరంలో దేవాలయాలను అడ్డగోలుగా కూల్చివేశారు. ఇందులో భాగంగానే దుర్గగుడికి వెళ్లే అర్జున వీధిలోని గోశాలనులోని షెడ్లను, కృష్ణుడు మందిరాన్ని తొలగించారు. తొలుత అరవై అడుగులు మాత్రమే విస్తరించాలని ముఖ్యమంత్రి వద్ద గోశాల నిర్వాహకులు, మంత్రులకు మధ్య ఒప్పందం జరిగింది. అయితే దాన్ని తుంగలో తొక్కించి అర్జున వీధిని 100 అడుగులకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆదేశాలను దుర్గగుడి ఈవో ఆజాద్‌తోపాటు కలెక్టర్ అహ్మద్‌బాబులు అమలుచేశారు. 106 అడుగుల దూరంలో ఆంజనేయస్వామి గుడి ఉంది. పనిలో పనిగా ఈ గుడిని కూడా పగలగొట్టించమంటూ కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది కొంతభాగం కూల్చిన తరువాత ఆజాద్ అంగీకరించలేదు.
అది 106 అడుగులు ఉన్నందున, నిబంధనలకు విరుద్ధంగా తాను కూల్చబోనని చెప్పారు. ఇది తన ఆదేశమని, తక్షణం కూల్చించాలంటూ ఒత్తిడి చేశారు. ఇదేమీ ఆజాద్ పట్టించుకోకుండా మీరు రెవెన్యూ, నేను దేవాదాయ శాఖ ఉద్యోగినని, అంతగా కూల్చాలంటే తమ కమిషనర్‌తో చెప్పించాలంటూ తెగేసి చెప్పారట. ఆగ్రహించిన కలెక్టర్ అహ్మద్‌బాబు ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన వేయడంతో 24 గంటలు గడిచేలోగా అజాద్‌కు బదులుగా ఐఏఎస్ అధికారికి దేవస్థానం బాధ్యతలు అప్పగించారు. కేవలం మాట వినలేదని ఆజాద్‌ను తొలగించడంపై ఇంద్రకీలాద్రి వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నా మౌనంగా ఉన్నారు. రానున్నరోజుల్లోనైనా ఆంజనేయస్వామి గుడిని, గోశాలను పూర్తిగా తొలగిస్తారనే ప్రచారం నగరంలో జోరుగా సాగుతోంది.
పురావస్తు శాఖకు చెందిన స్థలం స్వాధీనం...
అర్జున వీధిలోని పురావస్తు శాఖకు చెందిన స్థలాన్ని ఆ శాఖ అధికారులు అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి ఆక్రమించుకున్నారు. అక్కన్నమాదన్న గుహలుగా పేరుపొందిన గుహలకు ముందున్న ప్రహరీని పగులగొట్టారు. లోపల ఉన్న లాన్‌ను ధ్వంసం చేశారు. తమ ప్రమేయం లేకుండా తమ స్థలాన్ని తీసుకున్నారంటూ కేంద్ర ప్రభుత్వం, పురావస్తుశాఖాధికారులు జిల్లా అధికార యంత్రాంగానికి నోటీసులు ఇచ్చారు.
జలభవన్ కూల్చివేతకు బ్రేక్
అర్జున వీధి విస్తరణలో భాగంగా కేంద్ర జలభవన్‌ను గత వారంలో అధికారులు కూల్చివేయబోయారు. అందులో పనిచేసే ఒక ఉద్యోగి భవనాన్ని కూల్చివేస్తున్న విషయాన్ని తమ ఉన్నతాధికారులకు చెప్పేవరకు ఆగాలని కోరినా వినకుండా కొట్టివేయబోయారు. చివరకు రికార్డులు తీసుకోవాలని చెప్పడంతో తొలగించకుండా ఆపారు. ఈ విషయం తెలుసుకున్న జలవనరుల శాఖాధికారులు తమ అనుమతి లేకుండా జలభవన్‌ను కొట్టివేస్తున్నారంటూ హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో భవనం కూల్చవద్దంటూ స్టే ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ భవనం కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు.