ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 17 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సీసీఐతోపాటు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.3,700 నుంచి రూ.4 వేలు నిర్ణయించింది. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో మద్దతు ధర కంటే పత్తి ధర అధికంగా పలుకుతోంది. ఈ నేపథ్యంలో సీసీఐ కూడా వ్యాపారులతో కలిసి వాణిజ్య కొనుగోలుకు ముందుకు వస్తుండటం గమనార్హం. మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలుకు ఎలక్ట్రానిక్ కాంటాలు, వేబ్రిడ్జిలు సర్వం సిద్ధం చేశారు. సదుపాయాల కల్పనపై కలెక్టర్ అహ్మద్‌బాబు ప్రత్యేక దృష్టి సారించారు.
50 లక్షల క్వింటాళ్లకు పైబడే..
జిల్లాలో 3.10 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో పత్తి దిగుబడిపై రైతుల ఆశలు సన్నగిల్లాయి. ఎకరానికి రెండు,మూడు క్వింటాళ్లు దిగుబడి తగ్గే అవకాశం ఉండడంతో రైతులు కనీస మద్దతు ధరపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్‌లో 50 లక్షల క్వింటాళ్ల పైబడి పత్తి కొనుగోలు జరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులు పేర్కొంటున్నారు. గతేడాది జిల్లాలో 64.58 లక్షల క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరిగాయి. ప్రైవేట్ వ్యాపారులు 30.80 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా, సీసీఐ 21.49 లక్షల క్వింటాళ్లు, నాఫెడ్ 12.28 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి సీసీఐ రంగంలో ఉంటుండగా నాఫెడ్ కొనుగోలుకు సిద్ధం కాలేదు. ఆదిలాబాద్, భైంసా, బోథ్, ఆసిఫాబాద్, నిర్మల్, ఇంద్రవెల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఖానాపూర్, చెన్నూర్, జైనూర్, ఇచ్చోడ, సారంగాపూర్, జైనథ్, లక్సెట్టిపేట, కుభీర్, బెల్లంపల్లి మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరగనున్నాయి. సీసీఐ కొనుగోలు చేయకపోతే వ్యాపారులు మద్దతు ధర తగ్గించి రైతుల నడ్డీ విరిచేవారని రైతులు పేర్కొంటున్నారు.
జీరో దందా జరగకుండా చర్యలు..
మార్కెట్ యార్డుల్లో తూకం జరగకుండానే నేరుగా పత్తి ప్రైవేట్ జిన్నింగ్‌లకు చేరుకునేది. తద్వారా మార్కెట్ యార్డులకు ఆదాయానికి గండి పడేది. వ్యాపారులు నేరుగా పత్తి కొనుగోలు చేయడం ద్వారా జీరో దందాకు పాల్పడేవారు. దీన్ని అరికట్టేందుకు కలెక్టర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ మేరకు ప్రతి మార్కెట్ యార్డు పరిధిలో విజిలెన్స్, రెగ్యులేషన్ కమిటీలను నియమించారు. అందులో తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ లు ఉంటారు.
ఈ బృందం పత్తి దిగుబడుల రాక, మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లపై దృష్టి సారించనున్నారు. మార్కెట్ యార్డుకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలి. రైతులు నిర్ణీత తేదీకి అనుగుణంగా మార్కెట్‌కు పత్తి తీసుకొస్తున్నారా? లేదా? అనేది పరిశీలిస్తారు. పత్తి నాణ్యతను పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన పత్రాన్ని ఈ కమిటీ సభ్యులు జారీ చేయాలి. రోజు బీట్ జరిగే సమయానికి ఉదయం 8.45 గంటలకు అందుబాటులో ఉండాలి. జిన్నింగ్‌లు, ప్రెస్సింగ్, చెక్‌పోస్టుల గుండా వచ్చే వాహనాలపై దృష్టి సారించాలి. ఇది నిరంతరంగా జరుగుతుందా లేదా అని పరిశీలన, తనిఖీలు చేసేందుకు డివిజనల్ స్థాయిలో స్పెషల్ ఆఫీసర్ల బృందం ఉంటుంది. ఇందులో ఆర్డీవో, డీఎఫ్‌వో, వాణిజ్యపన్నుల అధికారి, తహశీల్దార్, సీఐ, తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్, వ్యవసాయ శాఖ ఏడీ, మార్కెట్ కమిటీ కార్యదర్శులు ఉంటారు. భోరజ్, బేల్తా ఎక్స్‌రోడ్, వాంకిడి, లక్సెట్టిపేట, సోన్‌ల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఈ బృందం తనిఖీ చేస్తుండాలి.
పత్తి కొనుగోళ్లలో సమస్యలు, ఫిర్యాదులు ఉన్న పక్షంలో తెలియజేసేందుకు కలెక్టర్ టోల్‌ఫ్రీ నం. 18004253669కు ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖలోని ఏడీ దీనిని పర్యవేక్షిస్తారు.
వివిధ శాఖలకు కలెక్టర్ ఆదేశాలు
మార్కెట్‌యార్డు వారీగా యాక్షన్‌ప్లాన్‌ను వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఖరారు చేయాలి. మార్కెట్ యార్డుకు ఏఏ గ్రామం నుంచి ఎప్పుడెప్పుడు పత్తిని తీసుకొచ్చి విక్రయించాలనే తేదీలను నిర్ణయించారు. ఆర్డీవో, మండల వ్యవసాయ అధికారులు, తహశీల్దార్‌లను సంప్రదించి ఈ తేదీలను నిర్ణయించాలి.
ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుశాఖ మార్కెట్ యార్డుల పరిధిలో ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా మార్కెట్ సీజన్ పూర్తయ్యే వరకు అవసరమైన పోలీసు సిబ్బందిని నియమించాలి. పత్తి వాహనాలు, బండ్లు వచ్చేందుకు రూట్ మ్యాప్‌లను తయారు చేయాలి. వాహనాలకు టోకెన్ జారీ చేయాలి.
ఆర్డీవోల ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారులు, తహశీల్దార్లు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి కనీస మద్దతు ధర, పత్తి నాణ్యత తదితర విషయాలను రైతులకు వివరించాలి.
రోజు మార్కెట్ యార్డులో ఉదయం 8.30 గంటలకు పత్తి ధర నిర్ణయించి ఆ విషయం జాయింట్ కలెక్టర్‌కు తెలియజేసి మార్కెట్ యార్డుల్లో ధరను ప్రదర్శించే బాధ్యతను మార్కెట్‌యార్డు కార్యదర్శులు నిర్వర్తించాలి. ఒకసారి ధర నిర్ణయించిన తర్వాత ఆ రోజు ధర పడిపోకుండా చూడాల్సిన బాధ్యత వహించాలి. కార్యదర్శులు రోజు బీట్‌లో పాల్గొనాలి.రైతుల నుంచి అధిక కమీషన్, హమాలీ చార్జీలు, వేమెంట్ చార్జీలు తీసుకోరాదు. సీసీఐ అధికారులు కూడా బీట్‌లో ఉండాలి.
మార్కెటింగ్ శాఖ ఏడీ, సీసీఐ బీఎంలు, మార్కెట్‌యార్డు కార్యదర్శులు రైతులకు కంప్యూటరైజ్డ్ తక్ పట్టీలను జారీ చేయాలి. రైతులకు పంట అమ్మగా వచ్చే డబ్బులను వీలైనంత త్వరగా అందేలా చూడాలి.
రైతులు తీసుకొచ్చే పత్తిలో 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు పేర్కొంటున్నారు. 12 శాతం మించితే కొనుగోలు చేయమని స్పష్టం చేస్తున్నారు.
అదేవిధంగా పత్తి కుప్పలో పైన నాణ్యమైన పత్తి ఉంచి లోపల నీళ్లతో తడిపి తీసుకొచ్చే పత్తిని కొనుగోలు చేయమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు సహకరించాలని సీసీఐ అధికారులు కోరుతున్నారు.
మార్కెట్‌లు సిద్ధం
Published Tue, Oct 29 2013 6:15 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement