ఎ . బాబు, కృష్ణాజిల్లా కలెక్టర్
విజయవాడ : కలెక్టర్ బాబు.ఎ వింత పోకడలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ దుయ్యబట్టారు. గురువారం ఆయన ఆంధ్రరత్న భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఈ-పోస్ విఫలమవడంతో సకాలంలో రేషన్ అందక లబ్ధిదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్డుల ఏరివేత కోసమే ఇన్ని కుతంత్రాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి దగ్గరలో ఉందన్న సాకుతో స్వరాజ్య మైదానంలోని రైతుబజార్‌ను తరలించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
సాంబమూర్తి రోడ్డులోని రైవస్ కాల్వ ఒడ్డుకు మార్చడంపై ప్రజలు, రాజకీయపక్షాలు వ్యతిరేకిస్తున్నా కలెక్టర్ చెవికెక్కకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవలే కోటిన్నర ఖర్చు చేసి స్టాల్స్ నిర్మాణం చేశారని, ఇప్పుడు అదంతా వృథా అవుతోందన్నారు. కలెక్టర్ ధోరణి వల్ల వ్యవసాయ పారిశ్రామిక ఎగ్జిబిషన్ దూరమైందని, పుస్తక ప్రదర్శనపై గందరగోళం నెలకొందన్నారు. జాతీయ రహదారి విస్తరణలో కృష్ణలంక ఫీడర్ రోడ్డు కుంచించుకుపోతున్నా కలెక్టర్ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని కొలనుకొండ తెలిపారు. తాగునీటి ఎద్దడితో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారన్నారని పేర్కొన్నారు.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టు శాఖల్లో పెరుగుతున్న అవినీతి కలెక్టర్ పని తీరును ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు.
రానున్న ఆగస్టులో కృష్ణా పుష్కరాల నిర్వహణ విషయంలో కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పని తీరు మార్చుకోకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఖాయమని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు.