krishna collector
-
ప్రకాశం బ్యారేజ్‌కి మళ్లీ వరద; కలెక్టర్ ఆదేశాలు
సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజ్‌కి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులో ఇప్పటికే గరిష్ట స్థాయి నీటి మట్టం ఉండగా ఇన్‌ఫ్లో 76 వేల క్యూసెక్కులుగా ఉంది. అధికారులు 70 గేట్లను ఎత్తి 65 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఇలాగే కొనసాగితే రేపటికి నాలుగ లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ నదీ పరివాహక ప్రాంత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కన్నబాబు
సాక్షి, కృష్ణా : జిల్లాలోని వరద పరిస్థితిపై వ్యవసాయశాఖ మంత్రి కురుసాల కన్నబాబు.. కలెక్టర్ ఇంతియాజ్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రికి ప్రకాశం బ్యారేజీ నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ మంత్రికి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు సూచించారు. రాత్రి వేళల్లో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. సాగునీటి కాల్వల ద్వారా రైతుల చివరి ఆయకట్ట వరకు నీరు అందేలా చూడాలని అన్నారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాల్లోని కాల్వలకు నీటిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. రైతులకు నీటి విడుదల పూర్తయ్యే వరకు ఇరిగేషన్ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు అధికారులు వెనుకాడొద్దని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. -
క్షణ క్షణం.. భయం భయం
సాక్షి, విజయవాడ: కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. దశాబ్దకాలం తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో వరద పోటెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే వరద ధాటికి పలు గ్రామాలు నీట మునిగాయి. జగ్గయ్యపేటలోని రావిరాల, నందిగామలోని చందర్లపాడుతోపాటు పలు గ్రామాల్లో వరద నీరు ముంచెత్తింది. అలాగే ప్రకాశం బ్యారేజ్‌కు దిగువున ఉన్న లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం ఉదయానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దశాబ్దకాలం తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. పైనుంచి వస్తున్న వరద నీరు వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా దర్శనం ఇస్తోంది. బ్యారేజ్ 70 గేట్లను ఎత్తివేసి వరద నీటిని కిందకు వదిలివేస్తున్నారు. గురువారం ఉదయం 4లక్షలతో ప్రారంభమైన వరద ప్రవాహం అంచలంచెలుగా పెరిగి అర్ధరాత్రికి 6 లక్షల క్యూసెక్కులకు చేరింది. రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక.. గురువారం రాత్రి వరద ఐదు లక్షల క్యూసెక్కులు దాటడంతో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వాస్తవానికి 5,66,000 క్యూసెక్కుల వరద నీరు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. శుక్రవారం ఉదయం లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కుంటాయని గుర్తించిన అధికారులు గురువారం రాత్రి నుంచే గ్రామాల్లో వారిని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే ఆయా గ్రామాల్లోని ప్రజలు స్వతహాగా తమ ఇళ్లు, పశువులను వదిలి పెట్టి రావడానికి ఇష్టపడటం లేదు. అధికారులు నచ్చచెప్పి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ గురువారం వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కలెక్టర్ ఇంతియాజ్ పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షితం ప్రాంతాలకు తరలించాలని, నది కట్టలకు గండి పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. 15 పునరావాస కేంద్రాలు.. కృష్ణాజిల్లాలో 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణలంక, రాణిగారితోట, భాస్కరరావుపేట, తదితర ప్రాంతాల్లో నగరంలోనూ మండలాల్లోనూ ఏర్పాటు చేశారు. శుక్రవారం పునరావాసకేంద్రాల సంఖ్య పెంచుతామని కలెక్టర్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ రిజర్వుడ్, రెవెన్యూ, ఇరిగేషన్, మత్య, శాఖ«ల సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించారు. 73 టీఎంసీలు కడలిపాలు.. గురువారం నాటికి 73 టీఎంసీల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ గుండా సముద్రంలో కలిశాయి. ఈ వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలి వచ్చిన వారు తిరిగి తాము చెప్పే వరకు ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పునరావాస కేంద్రాల వద్దనే వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. పడకేసిన పర్యాటకం.. కృష్ణానదికి వరద ఉధృతి రావడంతో పర్యాటకం పడకేసింది. భవానీ ద్వీపంలోని టూరిస్టులను 12వ తేదీనే ఖాళీ చేయించి తీసుకువచ్చేశారు. గత నాలుగు రోజులుగా బోట్లు తీయలేదని అధికారులు చెబుతున్నారు. అయితే నాగార్జున సాగర్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటం.. పదేళ్లలో తొలిసారిగా సాగర్ అన్ని గేట్లు తెరవడంతో అక్కడ మాత్రం పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని డివిజనల్ మేనేజర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉధృతి పెరుగుతోంది.. సాక్షి, విజయవాడ: కృష్ణానదికి భారీ వరద వస్తోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు కృష్ణానదికి వరద కేవలం 5లక్షల క్యూసెక్కులు వరద నీరు మాత్రమే వచ్చిందని, గురువారం సాయంత్రం 7 గంటలకు పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆరు లక్షల క్యూసెక్కులు నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారని ఆయన తెలిపారు. అందువల్ల నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 17 మండలాలలోనే లోతట్టు ప్రాంతాలు వెంటనే తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. విజయవాడ నగరంలో ఆరు పునరావావస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇప్పటికే 1,350 మంది అక్కడకు తరలించామన్నారు. గ్రామీణ మండలాల్లో 10 పునరావాస కేంద్రాలలో ఆరువేల మంది వరద బాధితులకు భోజన వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ముంపు ముప్పు.. ఇబ్రహీంపట్నం మండలంలోని జూపాడు, మూలపాడు, పాములూరు, చినలంక గ్రామాల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. జగ్గయ్యపేట మండలంలోని రావిరాల, వడ్డెర, ముక్త్యాల గ్రామాల్లోకి కూడా నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. వేదాద్రి గ్రామంలో ఇప్పటికే రహదారిపై వరద నీరు ప్రవహిస్తుందన్నారు. గ్రామాల్లో ప్రచారం.. అనంతరం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ గురువారం రాత్రి ఒంటి గంట తర్వాత పులిచింతల నుంచి 8లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారని చెప్పారు. అందుకే అధికారులు ఈ రాత్రి ఈ గ్రామాల్లో తిరుగాలన్నారు. గ్రామాల్లో టాంటాం వేయించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నేడు పాఠశాలలకు సెలవు వరద బాధిత ప్రాంతాలలోని పాఠశాలలకు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఒక రోజు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ మాధవీలత, నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సబ్‌కలెక్టర్ మిషాసింగ్, ఎస్సీ ఇరిగేషన్ చౌదరి తదిరులు పాల్గొన్నారు. 791 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం కృష్ణానది వరద ఉధృతికి నదీ తీర ప్రాంతాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఉద్యానవన పంటలు నీట మునిగిపోయి కుళ్లిపోతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో 791 హెక్టార్లలో సుమారు రూ.1.365 కోట్లు విలువైన అరటి, పసుపు, మిర్చి, బోప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని ఉద్యానవనశాఖాధికారులు చెబుతున్నారు. తోట్లవల్లూరు, చల్లపల్లి, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. అయితే వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూ ఉండటంతో పంట నష్టం పెరిగే అవకాశం ఉంది. -
ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ నిషేధం: కలెక్టర్
సాక్షి, విజయవాడ : ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ వాడకాన్ని నియత్రించవచ్చన్నారు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. కళ్యాణ మండపాలు, రెస్టారెంట్లు, దుకాణాల వద్ద ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉందని వచ్చే వారంలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడానికి ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లు వివరించారు. వచ్చే మంగళవారం, బుధవారం, శుక్రవారం ప్రజలతో సమావేశాలు ఏర్పాలు చేసి ప్లాస్టిక్ వాడకం వలన కలిగే దుష్పరిణాలమాలను వివరిస్తామని అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్ క్లాత్ బ్యాగ్స్, పేపర్ గ్లాస్లు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కార్పోరేషన్, పోలీస్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ల సహాకారంతో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, ప్లాస్టిక్‌ను నగరంలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా వీటిపై ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో సైకిల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలతో ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయిస్తామన్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలతో కాటన్ బ్యాగ్‌ల తయారీ చేపడతామన్నారు. -
సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో నూతన ఇసుక పాలసీ
సాక్షి, విజయవాడ : సెప్టెంబర్ 5 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఇసుక పాలసీ రానుందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇసుక కొరతపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, వసంత కృష్ణా ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇల్లు నిర్మించుకునే వారికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇసుకను స్టాక్ పాయింట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఎవరికైనా ఇసుక కావాలంటే సంబంధిత తహసీల్ధార్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 19 నుంచి కొత్త పాలసీ వచ్చే వరకు ఇదే విధానం అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో తోట్ల వల్లూరు ఇసుక రిచ్ మాత్రమే తెరిచి ఉంటుందని తెలిపారు. -
భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధం
కలెక్టర్ బాబు.ఎ విజయవాడ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబునాయుడుకు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం చంద్రబాబు గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వివిధ ప్రాంతాల్లో 6 నుంచి 14 సెంటీ మీటర్ల వరకు వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ వర్షాల వల్ల జిల్లాలో వ్యవసాయరంగానికి మేలు చేకూరిం దన్నారు. మచిలీపట్నంలో నాట్లు పడని 38 వేల హెక్టార్లకు ఈ వర్షాలు ప్రయోజనం చేకూర్చాయన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు అత్యధికంగా వరద నీరు చేరుతుండటం వల్ల సుమారు 1.50 లక్షల క్యూసెక్కులు దిగువకు నీరు వదులుతున్న దృష్ట్యా లోతట్టు ప్రాం తాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. గురువారం మధ్యహ్నం నుంచే సుమారు 20 వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్న దృష్ట్యా ప్రజలందరిని, క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. జిల్లాలో గురువారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కలెక్టర్ పేర్కొన్నారు. అత్యధికంగా విజయవాడ రూరల్ మండలంలో 2.2 మిల్లీమీటర్లు, విజయవాడ అర్బన్‌లో 2.1 మిల్లీమీటర్లు, నూజివీడు మండలంలో 1.4 మిల్లీమీటర్లు, మైలవరం మండలంలో 1.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని వివరించారు. మిగిలిన మండలాల్లో మధ్యహ్నం వరకు వర్షం కురవలేదని కలెక్టర్ తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లా వ్యాప్తంగా రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బాబు.ఎ సూచించారు. అల్పపీడనం కారణంగా జిల్లాలో కురిసిన భారీవర్షాలకు పులి చింతల ప్రాజెక్టు నుంచి 50 వేల నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరకు నీరు దిగువకు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గురువారం ఉదయం 10 గంటలకు 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారని తెలిపారు. కృష్ణా పరివాహక లోతట్టు మండలాలు, గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బం దులు ఉన్నా, వర్షం నీరు గ్రామాల్లో ప్రవేశిం చినా సంబంధిత అధికారులకు సమాచారం తెలపాలని కోరారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కంట్రోల్‌రూమ్ ఫోన్ నంబర్ 08672-252572, టోల్‌ఫ్రీ నంబర్ 1077 ఫోన్‌కు సమాచారం తెలపాలని సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని మండలాలు, గ్రామాల ప్రత్యేకాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. -
'తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
విజయవాడ: తుఫాను నేపథ్యంలో జిల్లాలోని తీరప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబు బుధవారం విజయవాడలో విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తీర ప్రాంత గ్రామాల వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు గ్రామాల్లోనే ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించినట్లు వివరించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికి తుఫానుగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కలెక్టర్ బాబు హెచ్చరించారు. -
కలెక్టర్ వింత పోకడలు మానుకోవాలి
విజయవాడ : కలెక్టర్ బాబు.ఎ వింత పోకడలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ దుయ్యబట్టారు. గురువారం ఆయన ఆంధ్రరత్న భవన్లో విలేకర్లతో మాట్లాడారు. ఈ-పోస్ విఫలమవడంతో సకాలంలో రేషన్ అందక లబ్ధిదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్డుల ఏరివేత కోసమే ఇన్ని కుతంత్రాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి దగ్గరలో ఉందన్న సాకుతో స్వరాజ్య మైదానంలోని రైతుబజార్‌ను తరలించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. సాంబమూర్తి రోడ్డులోని రైవస్ కాల్వ ఒడ్డుకు మార్చడంపై ప్రజలు, రాజకీయపక్షాలు వ్యతిరేకిస్తున్నా కలెక్టర్ చెవికెక్కకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవలే కోటిన్నర ఖర్చు చేసి స్టాల్స్ నిర్మాణం చేశారని, ఇప్పుడు అదంతా వృథా అవుతోందన్నారు. కలెక్టర్ ధోరణి వల్ల వ్యవసాయ పారిశ్రామిక ఎగ్జిబిషన్ దూరమైందని, పుస్తక ప్రదర్శనపై గందరగోళం నెలకొందన్నారు. జాతీయ రహదారి విస్తరణలో కృష్ణలంక ఫీడర్ రోడ్డు కుంచించుకుపోతున్నా కలెక్టర్ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని కొలనుకొండ తెలిపారు. తాగునీటి ఎద్దడితో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారన్నారని పేర్కొన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టు శాఖల్లో పెరుగుతున్న అవినీతి కలెక్టర్ పని తీరును ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. రానున్న ఆగస్టులో కృష్ణా పుష్కరాల నిర్వహణ విషయంలో కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పని తీరు మార్చుకోకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఖాయమని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు.