క్షణ క్షణం.. భయం భయం | Krishna District Officials On Alert To Tackle Floods | Sakshi
Sakshi News home page

క్షణ క్షణం.. భయం భయం

Published Fri, Aug 16 2019 9:26 AM | Last Updated on Fri, Aug 16 2019 9:26 AM

Krishna District Officials On Alert To Tackle Floods - Sakshi

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణవేణి(ఇన్‌సెట్‌)

సాక్షి, విజయవాడ: కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. దశాబ్దకాలం తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో వరద పోటెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే వరద ధాటికి పలు గ్రామాలు నీట మునిగాయి. జగ్గయ్యపేటలోని రావిరాల, నందిగామలోని చందర్లపాడుతోపాటు పలు గ్రామాల్లో వరద నీరు  ముంచెత్తింది. అలాగే ప్రకాశం బ్యారేజ్‌కు దిగువున ఉన్న లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం ఉదయానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 

దశాబ్దకాలం తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. పైనుంచి వస్తున్న వరద నీరు వల్ల ప్రకాశం బ్యారేజ్‌ నిండుకుండలా దర్శనం ఇస్తోంది. బ్యారేజ్‌ 70 గేట్లను ఎత్తివేసి వరద నీటిని కిందకు వదిలివేస్తున్నారు. గురువారం ఉదయం 4లక్షలతో ప్రారంభమైన వరద ప్రవాహం అంచలంచెలుగా పెరిగి అర్ధరాత్రికి 6 లక్షల క్యూసెక్కులకు చేరింది.

రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక..
గురువారం రాత్రి వరద ఐదు లక్షల క్యూసెక్కులు దాటడంతో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వాస్తవానికి 5,66,000 క్యూసెక్కుల వరద నీరు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. శుక్రవారం ఉదయం లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కుంటాయని గుర్తించిన అధికారులు గురువారం రాత్రి నుంచే గ్రామాల్లో వారిని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే ఆయా గ్రామాల్లోని ప్రజలు స్వతహాగా తమ ఇళ్లు, పశువులను వదిలి పెట్టి రావడానికి ఇష్టపడటం లేదు. అధికారులు  నచ్చచెప్పి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 

కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ 
గురువారం వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కలెక్టర్‌  ఇంతియాజ్‌ పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షితం ప్రాంతాలకు తరలించాలని, నది కట్టలకు గండి పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.  

15 పునరావాస కేంద్రాలు..
కృష్ణాజిల్లాలో 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణలంక, రాణిగారితోట, భాస్కరరావుపేట, తదితర ప్రాంతాల్లో నగరంలోనూ మండలాల్లోనూ ఏర్పాటు చేశారు. శుక్రవారం పునరావాసకేంద్రాల సంఖ్య పెంచుతామని కలెక్టర్‌ తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీస్‌ రిజర్వుడ్, రెవెన్యూ, ఇరిగేషన్, మత్య, శాఖ«ల సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించారు. 

73 టీఎంసీలు కడలిపాలు..
గురువారం నాటికి 73 టీఎంసీల వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌ గుండా సముద్రంలో కలిశాయి. ఈ వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలి వచ్చిన వారు తిరిగి తాము చెప్పే వరకు ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పునరావాస కేంద్రాల వద్దనే వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

పడకేసిన పర్యాటకం..
కృష్ణానదికి వరద ఉధృతి రావడంతో పర్యాటకం పడకేసింది. భవానీ ద్వీపంలోని టూరిస్టులను 12వ తేదీనే ఖాళీ చేయించి తీసుకువచ్చేశారు. గత నాలుగు రోజులుగా బోట్లు తీయలేదని అధికారులు చెబుతున్నారు. అయితే నాగార్జున సాగర్‌ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటం.. పదేళ్లలో తొలిసారిగా సాగర్‌ అన్ని గేట్లు తెరవడంతో అక్కడ మాత్రం పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని డివిజనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 

ఉధృతి పెరుగుతోంది..
సాక్షి, విజయవాడ: కృష్ణానదికి భారీ వరద వస్తోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు కృష్ణానదికి వరద కేవలం 5లక్షల క్యూసెక్కులు వరద నీరు మాత్రమే వచ్చిందని, గురువారం సాయంత్రం 7 గంటలకు పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆరు లక్షల క్యూసెక్కులు నీటిని ఇరిగేషన్‌ అధికారులు విడుదల చేశారని ఆయన తెలిపారు. అందువల్ల నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 17 మండలాలలోనే లోతట్టు ప్రాంతాలు వెంటనే తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. విజయవాడ నగరంలో ఆరు పునరావావస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇప్పటికే 1,350 మంది అక్కడకు తరలించామన్నారు. గ్రామీణ మండలాల్లో 10 పునరావాస కేంద్రాలలో ఆరువేల మంది వరద బాధితులకు భోజన వసతి కల్పిస్తున్నామని చెప్పారు. 

ముంపు ముప్పు..
ఇబ్రహీంపట్నం మండలంలోని జూపాడు, మూలపాడు, పాములూరు, చినలంక గ్రామాల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉందని కలెక్టర్‌ హెచ్చరించారు. జగ్గయ్యపేట మండలంలోని రావిరాల, వడ్డెర, ముక్త్యాల గ్రామాల్లోకి కూడా నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. వేదాద్రి గ్రామంలో ఇప్పటికే రహదారిపై వరద నీరు ప్రవహిస్తుందన్నారు. 

గ్రామాల్లో ప్రచారం..
అనంతరం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ గురువారం రాత్రి ఒంటి గంట తర్వాత పులిచింతల నుంచి 8లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారని చెప్పారు. అందుకే అధికారులు ఈ రాత్రి ఈ గ్రామాల్లో తిరుగాలన్నారు. గ్రామాల్లో టాంటాం వేయించాలన్నారు.  లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

నేడు పాఠశాలలకు సెలవు
వరద బాధిత ప్రాంతాలలోని పాఠశాలలకు కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ ఒక రోజు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ మాధవీలత, నగర మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్, సబ్‌కలెక్టర్‌ మిషాసింగ్, ఎస్‌సీ ఇరిగేషన్‌ చౌదరి  తదిరులు పాల్గొన్నారు.

791 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం
కృష్ణానది వరద ఉధృతికి నదీ తీర ప్రాంతాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఉద్యానవన పంటలు నీట మునిగిపోయి కుళ్లిపోతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జిల్లాలో 791 హెక్టార్లలో సుమారు రూ.1.365 కోట్లు విలువైన అరటి, పసుపు, మిర్చి, బోప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని ఉద్యానవనశాఖాధికారులు చెబుతున్నారు. తోట్లవల్లూరు, చల్లపల్లి, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. అయితే వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూ ఉండటంతో పంట నష్టం పెరిగే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement