సాక్షి, అమరావతి బ్యూరో: రెవెన్యూ శాఖలో ఆయనో విశ్రాంత అధికారి. రాజధాని పరిధిలోని ఓ మండలంలో చాలాకాలం పనిచేశారు. ఆ మండలం ఆయనకు కొట్టినపిండి. ఆయనకు తెలియకుండా గజం స్థలం కూడా ఎవరూ కొనుగోలు చేయలేని పరిస్థితి. భూముల క్రయవిక్రయాల్లో ఆయన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే అవేమీ ఉచితం కాదు. నీ పనిచేస్తే నా కేంటి? అని మొహమాటపడకుండా.. చేసే పనిని బట్టి కమీషన్ ఎంతో నిర్ణయించి, ముక్కుపిండి మరీ వసూలు చేయడం ఆయన నైజం.
రాజధాని ప్రకటనతో..
నూతన రాజధాని ప్రకటనతో ఆ మండలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ అవకాశాన్ని ఆ విశ్రాంత అధికారి రెండుచేతులా అందిపుచ్చుకున్నారు. భూముల విక్రయాలు, కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించి రూ.కోట్లు వెనకేశారు. అధికారి పార్టీలో ఓ ‘ముఖ్య’నేత అండ పుష్కలంగా లభించడంతో చెలరేగిపోతున్నారు. రెవెన్యూ శాఖలో ఆయన మాటే శిలాశాసనం అన్న చందంగా పనులు జరిగిపోతున్నాయి. మొత్తం మీద నెల కిందట ఉద్యోగ విరమణ చేసినప్పటికీ మోనార్క్‌లా వ్యవహరిస్తూ పనులన్నీ చక్కదిద్దుతున్నారు.
ఉద్యోగ విరమణ పొందినా.. విశ్రాంతి లేకుండా..!
ఈ ఏడాది ఆగస్టులో ఆ అధికారి ఉద్యోగ విరమణ పొందాడు. అయితే ఆయన స్థానంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. ఇదే ఆయనకు కలిసొచ్చింది. భూముల లావదేవీల వ్యవహారంలో వ్యాపారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి వారికి లబ్ధిచేకూర్చే పనులతో నిత్యం బిజీబిజీగా ఉంటున్నారు. చేసే పనిని బట్టి కమీషన్ వసూలు చేయడం ఆయన ప్రత్యేకత. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటి నుంచి ఆ అధికారి అందరి తలలో నాలుకగా మారిపోయారు. ఎవరికి ఏ పని కావాలన్నా.. రెవెన్యూ రికార్డులు సరిచేయాలన్నా ఆయనే పెద్ద దిక్కు. అధికారపార్టీకి చెందిన ఓ ‘ముఖ్య’నేత అండతో ఆ మండలంలో చక్రం తిప్పారు. స్వామి కార్యం.. స్వకార్యం అన్న చందంగా.. అధికార పార్టీ నేతలతోపాటు తాను కూడా ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని.. వాటిని విక్రయించి రూ.కోట్లు సంపాదించారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment