ఏపీ సీఎంను కలసిన గూడూరు ఎమ్మెల్యే రూ. 10 కోట్లు అడ్వాన్సు
రూ. 20 నుంచి 30 కోట్లకు బేరం
ఏపీ మంత్రి నారాయణ మధ్యవర్తిత్వం
ప్రలోభాల వల విసిరే పనిలో బిజీగా మంత్రులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. విలువలకు పాతరేస్తూ వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దిగజారుడు రాజకీయాలను ఏపీ అధికారపార్టీ కొనసాగిస్తూనే ఉంది. అవినీతి వ్యవహారాలలో ఆర్జించిన కోట్లాది రూపాయలతో పాటు పదవులను, నామినేషన్ పనులను, కాంట్రాక్టులను, నియోజకవర్గ నిధులను ఎరచూపుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే పనిలో మంత్రులు తలమునకలై ఉన్నారు. దీనికి స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నాయకత్వం వహిస్తూ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండడం గమనార్హం. తాజాగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఏపీ ముఖ్యమంత్రిని కలిశారు.
అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి మంగళవారంనాడు మంత్రి నారాయణ స్వయంగా ఎమ్మెల్యేని వెంటబెట్టుకుని వచ్చారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం నారాయణతో కలసి సునీల్‌కుమార్ తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యమంత్రి నివాసానికి మరో ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న మీడియా అక్కడకు పెద్ద ఎత్తున చేరుకుంది. అయితే మీడియా ప్రతినిధులు మాట్లాడడానికి ప్రయత్నించినా వారు కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. సునీల్ కుమార్ వెంట తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహనరావు కూడా ఉన్నారు.
రూ. 30 కోట్లకు బేరం..
ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌కు అధికారపార్టీ పెద్దలు రూ. 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు బేరం పెట్టినట్లు వినిపిస్తోంది. అందులో 10 కోట్ల రూపాయల వరకు మంగళవారమే అడ్వాన్సుగా చెల్లించారని కూడా అంటున్నారు. వీటితో పాటు నియోజకవర్గంలో నామినేషన్ పనులకు సంబంధించిన అనేక ప్రతిపాదనలపై కూడా సుదీర్ఘంగా చర్చించారని, పలు రకాల హామీలపై సంతృప్తి చెందిన తర్వాతే బేరం సెటిల్ అయ్యిందని మీడియాలో చర్చ జరుగుతోంది.
సునీల్ కుమార్‌ను పార్టీలోకి తీసుకురావడానికి మంత్రి నారాయణ మధ్యవర్తిత్వం వహించారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే సునీల్ కుమార్‌ను స్వయంగా నారాయణే వెంట బెట్టుకుని రావడం ఈ విషయాన్ని రూఢిపరుస్తోంది. కేవలం నారాయణ ఒక్కరే కాదు.. మంత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్లు విధించడం, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పురమాయించడం తెలిసిన విషయాలే.