ఇచ్చుకో.. పుచ్చుకో..
ఇచ్చుకో.. పుచ్చుకో..
Published Fri, Nov 4 2016 4:42 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
* రైతులకు ఎన్‌వోసీ కష్టాలు
* పిండుకుంటున్న అధికారులు
* రాజధాని గ్రామాల్లో వసూళ్ల దందా
* ఆందోళనలో అన్నదాతలు
శాఖమూరుకు చెందిన ఓ రైతు కుమార్తె ఆపరేషన్‌కు రూ.5 లక్షలు అవసరమైంది. అప్పు పుట్టకపోవడంతో తనకున్న ఎకరంలో కొంత విక్రయించాలని నిర్ణయించారు. కొనేందుకు రియల్టర్లు సిద్ధంగా ఉన్నా.. భూమి రిజిస్ట్రేషన్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి అన్నారు. ఆ రైతు సీఆర్‌డీఏ అధికారులను కలవగా రూ.65 వేలు డిమాండ్ చేశారు. చేసేది లేక రూ.10 వడ్డీతో రూ.65 వేలు తెచ్చి ముట్టజెప్పారు.
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంతంలో అవినీతికి హద్దే లేకుండా పోతోంది. నీకు పని చేసిపెడితే నాకేంటి లాభం అన్నట్లుంది వ్యవహారం. కొంతమంది అధికారులు రైతులకు ఏ పని చేసిపెట్టాలన్నా వేలు, లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే ఆ రైతు మెడకు మరిన్ని సమస్యలను చుడుతున్నారు. ముఖ్యంగా నిరభ్యంతర పత్రాలకు (ఎన్‌వోసీ) డిమాండ్ ఏర్పడింది. తమ భూములను అవసరాలకు విక్రయించాలన్నా అధికారుల అనుమతిని తప్పనిసరి చేస్తూ టీడీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో రైతుకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్‌వోసీ కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ముట్టజెపితే గానీ అధికారులు సంతకం పెట్టడం లేదు. తప్పని పరిస్థితుల్లో వారడిగింది సమర్పించుకు ఎన్‌వోసీ తీసుకుంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు లాక్కున్న విషయం తెలిసిందే. భూములిచ్చేందుకు ఇష్టం లేని రైతులు వ్యతిరేకించి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. రైతులు తమ భూములు సొంతంగా అమ్ముకుంటే ప్రభుత్వ పెద్దలకు ఉపయోగం ఉండదని భావించి రాజధాని ప్రాంతంలో ఏకంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయించారు. ఒకవేళ రైతులు తమ భూములు అమ్ముకోవాలంటే సీఆర్‌డీఏ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలని నిబంధన పెట్టింది. ప్రభుత్వం విధించిన ఈ నిబంధన రైతుల పాలిట శాపంలా మారింది. అధికారులు, ప్రభుత్వ పెద్దల బినామీలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
దోచుకున్నోడికి దోచుకున్నంత..
ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను లాక్కోవడం మొదలుపెట్టాక పంటల సాగును బలవంతంగా నిలిపివేసి అందులో నుంచి రైతులను గెంటివేసినంత పనిచేశారు. చేసిన అప్పులు, కుటుంబ అవసరాలు, అనారోగ్య సమస్య నుంచి గట్టెక్కేందుకు రైతుకు ఆదాయ మార్గాలు దూరమయ్యాయి.lఉన్న భూమిని విక్రయిస్తే తప్ప అవసరాలు తీరే పరిస్థితులు కనిపించలేదు. దీంతో భూములను విక్రయించేందుకు సిద్ధమెన రైతులు ఎన్‌వోసీల కోసం సీఆర్‌డీఏ అధికారులను కలిశారు. వారిలో కొందరు డబ్బులు డిమాండ్ చేశారు. రైతు అవసరాలను గుర్తించిన అధికారులు దందాను మరింత విస్తృతం చేశారు. వసూళ్లకు కొంతమంది దళారులను కూడా నియమించారు. దళారుల ద్వారా వస్తే కానీ సీఆర్‌డీఏ అధికారులు ఎన్‌వోసీ ఇవ్వడం లేదు. మొదట్లో రూ.వెయ్యి, రెండువేలు తీసుకునే అధికారులు ఇప్పుడు ఏకంగా రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement