అలా ఐదుగురి మొండాలను వేలాడదీశారు....
రియాద్: సౌదీ అరేబియాలో ఇస్లాం చట్టాలను ఉల్లంఘించినా, చిన్నపాటి నేరాలకు పాల్పడినా అమానుష శిక్షలను అమలు చేస్తారు. టెర్రరిస్టులకన్నా భయానకంగా రాళ్లతో కొట్టి చంపుతారు. కరవాలంతో ఒక్క వేటున కుత్తుకను తెగ నరికి చంపేస్తారు. సౌదీ రాజధాని రియాద్‌లో ఇటీవల జరిగిన ఇలాంటి అమానుష హత్యలను ఓ మీడియా బృందం ప్రాణాలకు తెగించి డాక్యుమెంటరీగా చిత్రీకరించింది. విదేశీయులనే కాకుండా దేశీయులెవరూ కూడా ఇలాంటి శిక్షలను కళ్లతో ప్రత్యక్షంగా చూడాల్సిందే తప్ప, ఫొటోలు తీయనీయరు, వీడియోల్లో చిత్రీకరించనీయరు. ఎవరైనా అలా చేసేందుకు ప్రయత్నిస్తే వారి ప్రాణాలను కూడా ఇలాగే తీస్తారు.
దొంగతనానికి పాల్పడిన ఓ ఐదుగురు వ్యక్తులను సౌదీ పోలీసులు ఇటీవల ‘చాప్ చాప్’ (తలలు నరికే చోటు) సెంటర్‌కు ఈడ్చుకొచ్చారు. కత్తితో మెడ వరకు వారి తలలను నరికేశారు. అనంతరం ఆ ఐదుగురి మొండాలను రెండు క్రేన్ల మధ్య ఓ వెదురు బొంగుకు గాలిలో వేలాడదీశారు. వారం రోజులపాటు జనం వీక్షణం కోసం వాటిని అలాగే ఉంచారు. ఆ తర్వాత మరో రోజు సవతి కూతురును హత్య చేశారనే ఆరోపణలపై నల్లటి వస్త్రాలు ధరించిన ఓ మహిళను దారుణంగా తల నరికి చంపేశారు. ‘నేనే పాపం చేయలేదు’ అంటూ ఆ మహిళ హృదయవిదారకంగా అరవడం మీడియా తీసిన డాక్యుమెంట్‌లో స్పష్టంగా వినిపిస్తోంది.
హత్యలు, అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, సాయుధ దోపిడీలు, తాంత్రిక పూజలు లాంటి నేరాలకు సౌదీలో ఇంత దారుణంగా మరణ శిక్షలు విధిస్తారు. మత్తపదార్థాలు సేవిస్తూ పలుసార్లు పట్టుబడినా రాళ్లతో కొట్టి చంపుతారు. సౌదీ ప్రభుత్వాన్ని లేదా ఇస్లాం మతాన్ని దూషిస్తే వెయ్యి కొరడా దెబ్బలతోపాటు పదేళ్ల నుంచి యావజ్జీవ కారాగారం వరకు శిక్షలు విధిస్తారు. కొన్ని సందర్భాల్లో నిందితులు కొరడా దెబ్బలకే ప్రాణాలు విడిచిన సంఘటనలు ఉన్నాయి. సున్నీలు మినహా అన్య మతస్థులందరిని సౌదీ ప్రభుత్వం ద్వేషిస్తుంది. క్రైస్తవులను, యూదులను, షియాలను కూడా చంపేయాలంటూ పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తారు. ఈ విషయాలు కూడా మీడియా డాక్యుమెంటరీలో ఉన్నాయి.
మధ్యప్రాచ్యంలో ఇస్లాం పేరిట సౌదీ అరేబియా ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నా బ్రిటన్ మాత్రం సౌదీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఇరు దేశాల రాజ కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రిన్స్ చార్లెస్ ఎన్నోసార్లు సౌదీలో పర్యటించారు. సౌదీ నుంచి బ్రిటన్ పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తూ, అందుకు ప్రతిగా ఆయుధాలను విక్రయిస్తోంది. అల్ ఖాయిదానే కాకుండా ప్రపంచంలో ఏ టైర్రరిస్టు సంస్థతో తమకు సంబంధాలు లేవని చెప్పుకునే సౌదీకి అల్ ఖాయిదాతో సంబంధాలున్న విషయాన్ని మీడియా డాక్యుమెంటరీ వెల్లడిస్తోంది. టెర్రరిస్టులకు సౌదీ ప్రధానంగా బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్న ఆయధాలను విక్రయిస్తోంది. ఈ మీడియా డాక్యుమెంటరీని అమెరికా బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ సహకారంతో ఐటీవీ మంగళవారం రాత్రి ప్రసారం చేస్తోంది.