పోలీసుల కర్కశత్వం
సమస్యలు పరిష్కరించమంటూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ర్యాలీకి అనుమతి లేదన్న పేరుతో తమ కర్కశత్వాన్ని లాఠీలతో విద్యార్థులపై చూపించారు. అమ్మాయిలని కూడా చూడకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను మెరుగు పరచాలని, నాణ్యమైన ఆహారం అందివ్వాని, మెస్ చార్జీలు తగ్గించవద్దని కోరుతూ నగరంలోని వివిధ హాస్టళ్ల విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయల్దేరారు.
ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక విద్యార్థులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకె ళ్లాలని వేరే మార్గంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రెచ్చిపోయిన పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పి దొరికిన వాళ్లను దొరికినట్టు చావబాదారు.
ఆడబిడ్డలని కూడా చూడకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు. పోలీసుల దౌర్జన్యకాండపై విద్యార్థిలోకం తీవ్రంగా మండిపడుతోంది. సమస్యలు పరిష్కరించమని కొరినందుకే లాఠీచార్జ్ చేస్తారా అంటూ మండిపడుతోంది. లాఠీచార్జ్‌కి నిరసనగా బుధవారం విశాఖలోని విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
- సాక్షి, విశాఖపట్నం