గెలవగలమనే నమ్మకంతో ఉన్నాం: గంభీర్
గెలవగలమనే నమ్మకంతో ఉన్నాం: గంభీర్
Published Sun, Apr 2 2017 9:19 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM
కొల్‌కత: ప్రపంచ కప్ గెలుచుకొని నేటికి ఆరేళ్లు పూర్తయిన సంధర్భంగా ఆ జట్టులోని సభ్యులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెహ్వాగ్ ట్వీటర్‌లో ఆనందం వ్యక్తం చేయగా ఐపీఎల్ కొల్‌కత నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన గౌతమ్ గంభీర్, పీయూష్ చావ్లా, యూసఫ్ పఠాన్‌లు నైట్‌రైడర్స్ అధికారిక వెబ్‌సైట్‌లో వారి ఆనందాన్ని పంచుకున్నారు.
ఆ సమయంలో బ్యాటింగ్‌కు సిద్దంగా లేను: గంభీర్
ఫైనల్ మ్యాచ్‌లో సెహ్వాగ్ రెండో బంతికే డక్ ఔట్ అవ్వడం అయోమయానికి గురి చేసిందని నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ తెలిపాడు. ఆ సమయంలో బ్యాటింగ్ రావడానికి సిద్దంగా లేనని,ప్యాడ్‌లు కట్టుకుంటున్నానని గంభీర్ గుర్తు చేసుకున్నాడు. అంపైర్ రిఫరల్ తీసుకోవడంతో కాస్త సమయం దొరికందన్నాడు. క్రీజులోకి వెళ్లె ముందు మెదడులో ఇది ప్రపంచకప్ ఫైనల్, 275 పరుగుల లక్ష్యం అని చాలా ఆలోచనలు మొదలయ్యాయన్నాడు. వచ్చిన వెంటనే మలింగా విసిరిన తొలి బంతిని బౌండరీకి తరలించడంతో కొంత ఒత్తిడి తగ్గిందని చెప్పాడు. 275 పరుగుల లక్ష్యం స్వదేశంలో పెద్ద లక్ష్యం కాదని కానీ ఆసమయంలో కొంత ఒత్తిడికి లోనయ్యానన్నాడు. కానీ డ్రెస్సింగ్ రూంలో ఉన్న ప్రతి ఒక్కరం మ్యాచ్‌గెలుస్తామనే నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదని భావించి ఆడానన్నాడు. ఈ మ్యాచ్‌లో గంభీర్, నాటి కెప్టెన్ ధోనితో కలసి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుకు బాటలు వేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గంభీర్ 122 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ రాత్రి జెర్సీ విప్పలేదు: పీయూష్ చావ్లా
ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన లెగ్‌స్పిన్నర్ పీయూష్ చావ్లా అయితే మ్యాచ్‌గెలిచిన రాత్రి భారత్ జెర్సీ, మెడల్ తీసేయకుండా అలానే పడుకున్నానని గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్‌అనంతరం చాంపెన్ బాటిల్ ఓపెన్ చేసి సందడి చేశానని, కానీ తాగలేదని, ఇప్పటికీ తాగిన అనుభూతే కలుగుతుందన్నాడు ఈ లెగ్ స్పిన్నర్. టీషర్టుపై ప్రతి ఒక్క ఆటగాడి సంతకం తీసుకున్నానని, మెడల్ టీషర్టుతో అలానే పడుకున్నాని చావ్లా తెలిపాడు. ఆ వేడుకలతో తన జీవితంలో ఒక అద్భుతమైన రాత్రిగా నిలిచిందన్నాడు.
ఫుల్ టాస్‌ను సింగిల్ తీశాను: యూసఫ్ పఠాన్
ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో తన బ్యాట్‌ను మెరిపించిన యూసఫ్‌పఠాన్ తన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యూసఫ్ 30 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోశించాడు. ఇదే మ్యాచ్ 5 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన యువరాజ్, యూసఫ్‌లు జట్టును గెలిపించారు. యూవీ 50 కోసం ఫుల్‌టాస్ బాల్‌ను సింగిల్ తీశానని యూసఫ్ తెలిపాడు. ఆ సమయంలో భారత్ విజయానికి 8 పరుగులు దూరంలో ఉందని, యూవీ హాఫ్ సెంచరీకి 5 పరుగులు కావాలని, అయితే సింగిల్ తీయడంతో యూవీ ఫోర్, సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడని యూసఫ్ తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. దీంతో యూవీ వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు సాధించి 50 పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో 6 వికెట్లతో భారత్ గెలుపొందడం 1983 వరల్డ్‌కప్ తర్వాత ఇది రెండోసారి.
Advertisement