Yousuf
-
శ్రీ కృష్ణుడికి డబ్బింగ్ చెప్పాను!
పొద్దున్నే ఖురాన్ తెలుగులో చదవడం...సాయంత్రం శ్రీకృష్ణుడిపాత్రకు గాత్రం ఇవ్వడం...సినిమాలు, సీరియల్స్, ప్రకటనలు, డాక్యుమెంటరీలు... అన్ని విభాగాలలోను తన గొంతుతో సుపరిచితులయ్యారు యూసఫ్. సుమారు 500 కు పైగా చిత్రాలకు, సీరియల్స్‌కు డబ్బింగ్ చెప్పిన యూసఫ్ ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు.తన డబ్బింగ్ ప్రయాణంగురించి ఫోన్ ద్వారా సాక్షితో సంభాషించారు.. మాది ఖమ్మం జిల్లా ఇష్టాపురం. నాన్నది టైలర్ వృత్తి. అమ్మ గృహిణి. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంకామ్ చదివాను. ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చాను. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. కొత్త స్నేహాలు కలిశాయి. మిత్రులందరితో తరచూ ఫోన్లో సంభాషించేవాడిని. నా గొంతు విన్నవారంతా ‘నీ గొంతు బాగుంది, చక్కగా వాడుకోవచ్చు కదా’ అని తరచుగా అనేవారు. వారి ప్రోత్సాహంతో కొన్ని వ్యాపార ప్రకటనలను స్వయంగా రచించి, నేనే నటించి, నా గాత్రంతో వినిపించాను. కొన్ని ఆడియో క్యాసెట్లకు కూడా గొంతు ఇచ్చాను. ఆ తరవాత మిత్రుల సహకారంతో సినిమాలో డబ్బింగ్ చాన్స్ కోసం ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘జెండా’ చిత్రంలో డబ్బింగ్ చెప్పడానికి అవకాశం వచ్చింది. ఆ సినిమా కొత్తవారితో తీస్తున్నారని తెలిసి నేను కూడా ఒక ప్రయత్నం చేద్దామని, సెలక్షన్స్ కోసం రామానాయుడు స్టూడియోకి వెళ్లాను. ఎన్నో పరీక్షల తరవాత నన్ను ఎంపిక చేశారు. అక్కడే డబ్బింగ్ ఎలా చెప్పాలనే విషయంలో మంచి శిక్షణ పొందాను. ‘రెండు మూడు రోజుల తరవాత ప్రారంభిద్దాం’ అనడంతో వెళ్లిపోయాను. సినీ రంగ ప్రవేశం మళ్లీ పిలుస్తాను అనడం, పిలుపు రాకపోవడం మామూలే. ఎంత కాలం గడిచినా నాకు పిలుపు రాలేదు. డబ్బింగ్ యూనియన్‌లో మెంబర్షిప్ లేకపోవడం వల్ల అవకాశం చేజారిపోయిందని తరవాత తెలిసింది. ‘జెండా’ సినీ నిర్మాత ప్రోత్సాహంతో డబ్బింగ్ యూనియన్‌లో మెంబర్షిప్ తీసుకున్నాను. ఆ సినిమాకి డబ్బంగ్ ఇన్చార్జ్గా ఉన్న మిఠాయి చిట్టిగారు ‘ధైర్యం కోల్పోవద్దు’ అని నన్ను ప్రోత్సహించారు. ఆ తరవాత జరిగిన ఆడిషన్స్‌లో నేను సెలక్ట్ అయ్యాక, మంచి మంచి అవకాశాలు వచ్చాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యులైన గోగినేని ప్రసాద్, కాంచనబాబు, మరికొందరు అవకాశాలు ఇవ్వడంతో నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను. అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ఒకేరోజు పాతిక సీరియల్స్ సినిమాలలో చెబుతుండగానే, ‘చక్రవాకం’ సీరియల్‌తో బుల్లితెర అవకాశాలు వచ్చాయి. ఆ తరవాత వరుసగా సీరియల్స్‌కి డబ్బింగ్ ఇవ్వడం ప్రారంభించాను. సినిమాలు, టీవీ సీరియల్స్‌తో బాగా బిజీ అయిపోయాను. ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేసినా, కొన్ని సీరియల్స్ వదులుకోవలసి వచ్చింది. సినిమా అవకాశాలు మాత్రం వదులుకోలేదు. ఒకేరోజు టెలికాస్ట్ అయ్యే సీరియల్స్‌లో సుమారు పాతిక సీరియల్స్‌లో నా గొంతు ఉండేది. గొంతుకు గుర్తింపు సినిమాలు, సీరియల్స్‌తో పాటు ఎన్జిసి, డిస్కవరీ చానల్స్‌లో కూడా వాయిస్ ఓవర్ ఇస్తుండేవాడిని. ఆకాశవాణి నాటకాలలో, ఆడియో క్యాసెట్లు ... ఒక్కమాటలో చెప్పాలంలో 2004 నుంచి టీవీ చూసేవారందరికీ తప్పనిసరిగా నేను చిరపరిచితుడిని. నన్ను వ్యక్తిగతంగా గుర్తుపట్టరు కాని, నా గొంతును గుర్తుపడతారు. అలా డబ్బింగ్లో స్థిరపడిపోయాను. నా డబ్బింగ్ ప్రయాణంలో పెద్ద ఇబ్బందులేవీ ఎదుర్కోలేదు. వచ్చిన అవకాశాలన్నీ జాగ్రత్తగా ఉపయోగించుకున్నాను. ముందస్తు డబ్బింగ్ రెండుమూడు రోజులు ఊరు వెళ్లవలసి వస్తే, ముందుగానే డబ్బింగ్ చెప్పి వెళ్లేవాడిని. పనులన్నిటినీ జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవలసి వచ్చేది. నాకు శ్రావణితో వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు, ఆర్యన్, రయాన్. నా వివాహ సమయంలో సెలవు పెట్టవలసి వచ్చింది. వేరే వారితో డబ్బింగ్ చెప్పిస్తే, సీరియల్స్ దెబ్బ తింటాయని చెప్పడంతో, ముందుగానే డబ్బింగ్ పని పూర్తిచేసుకున్నాను. 2017 వరకు దాదాపుగా 500 పైగా సీరియల్స్, చిత్రాలకు డబ్బింగ్ చెప్పాను. ఇందిరా ప్రొడక్షన్స్, గోపీకృష్ణ మూవీస్, శ్రీకాంత్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ... వంటి అనేక మంచి మంచి సంస్థలలో డబ్బింగ్ చెప్పాను. 2013లో జరిగిన మహాకుంభమేళాకు సంబంధించి అరవై నిమిషాల నిడివితో ఒక కార్యక్రమం రూపొందించారు. అందులో నా గాత్రం ఉపయోగించుకున్నారు. శ్రీకృష్ణుడికి గాత్రం ఎన్ని సినిమాలు, సీరియల్స్‌కి చెప్పినా నాకు బాగా గర్వంగా, తృప్తిగా అనిపించింది మాత్రం శ్రీకృష్ణుడి పాత్రధారికి చెప్పిన డబ్బింగ్. టీవీలో వస్తున్న మహాభారతం సీరియల్లో శ్రీకృష్ణుడి పాత్రకు నాలుగైదు సార్లు అంటే నాలుగైదు సీరియల్స్‌లో డబ్బింగ్ చెప్పాను. బి.ఆర్చోప్రా రూపొందించిన మహాభారత్‌ను తెలుగులోకి డబ్ చేసినప్పుడు, అందులో శ్రీకృష్ణుడిగా వేసిన ‘నితీష్ భరద్వాజ్’కి తెలుగులో డబ్బింగ్ చెప్పాను. నా కోసమే ఆగారేమో అన్నట్లుగా ఎంతోకాలం తరవాత ఆ సీరియల్‌ని తెలుగులో డబ్ చేశారు. నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. ‘జై హనుమాన్’ చిత్రంలో శ్రీరాముడు పాత్రకు, ఆ తర్వాత శ్రీకృçష్ణుడి పాత్రకు నాలుగైదు సార్లు డబ్బింగ్ చెప్పాను. ‘హరహరమహాదేవ’ సీరియల్లో విష్ణుమూర్తి ప్రాతకు కూడా డబ్బింగ్ చెప్పాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కోయిలమ్మ, కుంకుమభాగ్య, శ్రీఆంజనేయం సీరియల్స్‌లో ప్రముఖంగాడబ్బింగ్ చెప్పాను. ‘ఆడదే ఆధారం’ సీరియల్లో మొదటిసారిగా విక్రమ్‌భాయ్ అనే విలన్ పాత్రకి డబ్బింగ్ చెప్పడం నాకొక టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి విలన్‌కి చెప్పే అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా అన్ని విలక్షణ పాత్రలకు చెప్పాను. పౌరాణికాలంటే ఇష్టం ఉదయం ‘తెలుగు ఖురాన్’ రికార్డు చేసి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడి పాత్రకు డబ్బింగ్ చెప్పాను. నాకు చిన్నప్పటి నుంచి పౌరాణికాలంటే ఇష్టం. శ్రీకృష్ణుడు నా డ్రీమ్ క్యారెక్టర్. మహాభారతం ద్వారా నా కల నెరవేరడం నా అదృష్టం. శ్రీకృష్ణుడి పాత్రకు గట్టి పోటీనే ఎదురైంది. 50 మంది గొంతుకలలో నా గొంతును ఎంపిక చేశారు. ‘నేను ఎవరు’ అనేది పట్టించుకోకుండా, నిష్పక్షపాతంగా ఆలోచించి, నాకు ఆ అవకాశం వచ్చేలా చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి... ఇలా నా డ్రీమ్ క్యారెక్టర్స్‌కి అనేకమార్లు డబ్బింగ్ చెప్పడం నా పూర్వజన్మ సుకృతంగా భావించాను. ఎంతోమంది కలలు కన్నా దక్కని అదృష్టం, నాకు రావడం నిజంగా నా పూర్వజన్మ పుణ్యమే. ప్రకటనలకు... ∙శ్రీరామావారి కాలమానం (థియేటర్లలో ప్రదర్శించారు), నివేదిత గ్రామర్ స్కూల్, జ్ఞానభారతి, కేర్ మినరల్ సోడా, డంకన్స్ నంబర్ వన్ టీ (నటన కూడా. దక్షిణభారతదేశంలో అన్ని భాషలలోను వచ్చింది) ∙కొందరు రాజకీయనాయకులకు పాటలు, డైలాగులు కూడా రాశాను. చిత్రాలు ∙ప్రిన్స్ ఆఫ్ పర్షా్య (తెలుగులోకి అనువాదమైన హాలీవుడ్ చిత్రం) ∙దాసరి గారి ‘యంగ్ ఇండియా’ లో మహానటి సావిత్రి మనవడు అభినయ్‌కి డబ్బింగ్ చెప్పాను ∙50 పర్సెంట్ లవ్, అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ (రణ్‌బీర్ కపూర్), జబ్ వి మెట్ (షాహిద్ కపూర్) ∙20కి పైగా చిన్న సినిమాలలో హీరోలకు చెప్పాను ∙ ఆదిత్య ఓం (మా అన్నయ్య బంగారం) ఇలా అనేక చిత్రాలలో నా గొంతు ప్రముఖంగా వినిపిస్తుంది. నాకు బాగా నచ్చిన చిత్రం ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ). హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8, కెప్టెన్ వీరరాజారెడ్డి వీధి... కాశ్మీర్లో టెర్రరిస్టుల అటాక్‌లో 26 సంవత్సరాల వయసులో మరణించిన వీరరాజారెడ్డి పేరు పెట్టారు ఆ వీధికి. ఆయన మరణించిన సంవత్సరం తరువాత వచ్చిన గణేశ్ నవరాత్రుల సమయంలో అంటే 2003లో ఆయనకు సంబంధించిన వివరాలు డ్రామాగా రూపొందించి ‘సౌండ్ అండ్ లైట్’æ షోగా ప్రదర్శించాను. అందులో కాశ్మీరు సెట్ వేసి, తొమ్మిదిరోజులూ ప్రదర్శించాం. నేను స్క్రిప్ట్ రాసి, వాయిస్ ఓవర్ చెప్పాను. ఆయన పాత్ర కూడా నేనే పోషించాను. హిమాలయాలతో కూడిన, కాశ్మీర్ సెట్, ఆయనకు బుల్లెట్స్ తగలడం అంతా లైవ్‌గా చేశాం. అది నా జీవితంలో ముఖ్యమైన ఘట్టం. – సంభాషణ: వైజయంతి -
మిషన్ భగీరథలో సాంకేతికత భేష్: ఆసిఫ్
సాక్షి, హైదరాబాద్: నూతన సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా మిషన్ భగీరథ పనులను సమర్థవంతంగా చేస్తున్నారని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయ కార్యదర్శి ఆసిఫ్ కె.యూసుఫ్ అన్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌డబ్ల్యూయస్ కార్యాలయంలో ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డితో గురువారం ఆయన సమావేశమయ్యారు. మిషన్ భగీరథ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా పనుల పర్యవేక్షణను ఆసిఫ్ పరిశీలించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో తాగునీటి çసరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న స్వజల్ స్కీం పథకానికి మిషన్ భగీరథ తరహా పర్యవేక్షణ విధానాన్ని కేంద్రం అనుసరించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథలో ఉపయోగిస్తున్న సాంకేతికతను తెలుసుకునేందుకు ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పనుల పురోగతిని ఫొటోల రూపంలో అధి కారులు చూపించారు. డ్యాష్ బోర్డ్ సహాయంతో పనులను ఎలా పర్యవేక్షిస్తున్నది అధికారులను ఆసిఫ్ అడిగి తెలుసుకున్నారు. యాప్‌తో పైప్ లైన్ పనుల పురోగతిని తెలుసుకునే పద్ధతిని వివరించారు. -
హిజ్బుల్ చీఫ్ సలాహుద్దీన్ కుమారుడి అరెస్టు
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు షాహిద్ యుసుఫ్ (42)ను ఉగ్ర నిధుల కేసులో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్న యుసుఫ్‌ను మంగళవారం ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నామని ఎన్ఏఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. బుధవారం అతనిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరుస్తామని ఆయన చెప్పారు. ఉగ్ర నిధుల కేసులో మరో నిందితుడైన ఐజాజ్ అహ్మద్ భట్ నుంచి అమెరికాకు చెందిన కంపెనీ ద్వారా యుసుఫ్‌కు నిధులు అందాయనేది ఎన్ఐఏ ప్రధాన ఆరోపణ. మొత్తం రూ. 4.5 లక్షల నిధులు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది. -
గెలవగలమనే నమ్మకంతో ఉన్నాం: గంభీర్
కొల్‌కత: ప్రపంచ కప్ గెలుచుకొని నేటికి ఆరేళ్లు పూర్తయిన సంధర్భంగా ఆ జట్టులోని సభ్యులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెహ్వాగ్ ట్వీటర్లో ఆనందం వ్యక్తం చేయగా ఐపీఎల్ కొల్‌కత నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన గౌతమ్ గంభీర్, పీయూష్ చావ్లా, యూసఫ్ పఠాన్లు నైట్‌రైడర్స్ అధికారిక వెబ్సైట్లో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో బ్యాటింగ్‌కు సిద్దంగా లేను: గంభీర్ ఫైనల్ మ్యాచ్‌లో సెహ్వాగ్ రెండో బంతికే డక్ ఔట్ అవ్వడం అయోమయానికి గురి చేసిందని నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ తెలిపాడు. ఆ సమయంలో బ్యాటింగ్ రావడానికి సిద్దంగా లేనని,ప్యాడ్లు కట్టుకుంటున్నానని గంభీర్ గుర్తు చేసుకున్నాడు. అంపైర్ రిఫరల్ తీసుకోవడంతో కాస్త సమయం దొరికందన్నాడు. క్రీజులోకి వెళ్లె ముందు మెదడులో ఇది ప్రపంచకప్ ఫైనల్, 275 పరుగుల లక్ష్యం అని చాలా ఆలోచనలు మొదలయ్యాయన్నాడు. వచ్చిన వెంటనే మలింగా విసిరిన తొలి బంతిని బౌండరీకి తరలించడంతో కొంత ఒత్తిడి తగ్గిందని చెప్పాడు. 275 పరుగుల లక్ష్యం స్వదేశంలో పెద్ద లక్ష్యం కాదని కానీ ఆసమయంలో కొంత ఒత్తిడికి లోనయ్యానన్నాడు. కానీ డ్రెస్సింగ్ రూంలో ఉన్న ప్రతి ఒక్కరం మ్యాచ్గెలుస్తామనే నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదని భావించి ఆడానన్నాడు. ఈ మ్యాచ్‌లో గంభీర్, నాటి కెప్టెన్ ధోనితో కలసి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుకు బాటలు వేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గంభీర్ 122 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ రాత్రి జెర్సీ విప్పలేదు: పీయూష్ చావ్లా ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన లెగ్‌స్పిన్నర్ పీయూష్ చావ్లా అయితే మ్యాచ్‌గెలిచిన రాత్రి భారత్ జెర్సీ, మెడల్ తీసేయకుండా అలానే పడుకున్నానని గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్అనంతరం చాంపెన్ బాటిల్ ఓపెన్ చేసి సందడి చేశానని, కానీ తాగలేదని, ఇప్పటికీ తాగిన అనుభూతే కలుగుతుందన్నాడు ఈ లెగ్ స్పిన్నర్. టీషర్టుపై ప్రతి ఒక్క ఆటగాడి సంతకం తీసుకున్నానని, మెడల్ టీషర్టుతో అలానే పడుకున్నాని చావ్లా తెలిపాడు. ఆ వేడుకలతో తన జీవితంలో ఒక అద్భుతమైన రాత్రిగా నిలిచిందన్నాడు. ఫుల్ టాస్‌ను సింగిల్ తీశాను: యూసఫ్ పఠాన్ ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో తన బ్యాట్‌ను మెరిపించిన యూసఫ్‌పఠాన్ తన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యూసఫ్ 30 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోశించాడు. ఇదే మ్యాచ్ 5 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన యువరాజ్, యూసఫ్‌లు జట్టును గెలిపించారు. యూవీ 50 కోసం ఫుల్‌టాస్ బాల్‌ను సింగిల్ తీశానని యూసఫ్ తెలిపాడు. ఆ సమయంలో భారత్ విజయానికి 8 పరుగులు దూరంలో ఉందని, యూవీ హాఫ్ సెంచరీకి 5 పరుగులు కావాలని, అయితే సింగిల్ తీయడంతో యూవీ ఫోర్, సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడని యూసఫ్ తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. దీంతో యూవీ వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు సాధించి 50 పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో 6 వికెట్లతో భారత్ గెలుపొందడం 1983 వరల్డ్‌కప్ తర్వాత ఇది రెండోసారి. -
90 లీటర్ల కల్తీ నెయ్యి సీజ్
గోషామహల్ ప్రాంతంలో పామోయిల్తో కల్తీ చేసిన 90 లీటర్ల నెయ్యిని హైదరాబాద్ టాస్క్ పోలీసులు పట్టుకున్నారు. కల్తీ నెయ్యిని విక్రయిస్తున్న దినేష్ పాండియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 90 లీటర్ల నెయ్యిని సీజ్ చేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు. నగరంలోని ముర్గీచౌక్ నుంచి హసన్‌నగర్‌కు చెందిన మహ్మాద్ నిజాముద్ధీన్, మహ్మాద్ యూసుఫ్‌తో కలిసి చికెన్ వెస్టేజ్తో తయారు చేసిన 555 లీటర్ల అయిల్ను తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చే శారు. ఈ దాడి నుంచి మహ్మాద్ యూసుఫ్ తప్పించుకున్నారు. దోరికిన మహ్మాద్ నిజాముద్ధీన్ నుంచి స్వాధీనం చేసుకున్న 555 లీటర్ల అయిల్ను సీజ్ చేసి , ఆయనను ఆరెస్టు చేసి ,స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్బుక్లో చేసిన ఆ పోస్టే..
న్యూ ఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఏ విధంగా వల వేస్తున్నారనే విషయాన్ని తెలియజేసే ఉదంతం ఇది. ఉగ్రదాడులకు కుట్ర పన్ని అరెస్టైన 17 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి మహ్మద్ అక్లాక్ విచారణలో.. అతను ఉగ్రవాదులతో ఏ విధంగా సంబంధాలు మొదలెట్టాడనే విషయం వెల్లడైంది. ఫేస్బుక్లో అక్లాక్ చేసిన ఒకే ఒక పోస్టు అతన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు దగ్గర చేసిందని అధికారులు గుర్తించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన 22 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్లాక్ 2014 డిసెంబర్ 6న ఫేస్బుక్లో దీనిపై ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ చేశాడు. దానికి సోషల్ మీడియాలో వందలాది లైక్స్, హిట్స్ వచ్చాయి. అంతే కాదు ఆ పోస్టు అతన్ని ఐఎస్ ఉగ్రవాదులకు దగ్గర చేసి అతని జీవితాన్నే మార్చేసింది. అక్లాక్ పోస్టు చేసిన మరుసటి రోజు ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన యూసుఫ్ అనే వ్యక్తి నుండి ఓ మెసేజ్ అందుకున్నాడు. ఆ మెసేజ్‌లో అక్లాక్‌ను తెలివైన, దైర్యసాహసాలు కలిగిన వాడిగా పొగడ్తలతో ముంచెత్తిన యూసుఫ్.. అతన్ని ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపేలా ప్రేరేపించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. యూసుఫ్‌ను ఇస్లామిక్ స్టేట్ కమాండర్‌గా అధికారులు అనుమానిస్తున్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరపున ఖలీఫా రాజ్య స్థాపన కోసం పోరాడటానికి అక్లాక్ అంగీకరించినట్లు తేలింది. పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం అక్లాక్‌ను ఇస్లామక్ స్టేట్ ఉగ్రవాదులు అక్లాక్‌ను సంస్థలో చేర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నట్లు గుర్తించిన మరో నలుగురు విద్యార్థులు కూడా ఇలా సోషల్ మీడియా ద్వారానే ఉగ్రవాదులతో సంబంధాలు మొదలెట్టారని అధికారుల విచారణలో తేలడంతో సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.