ఫేస్బుక్లో చేసిన ఆ పోస్టే..
న్యూ ఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఏ విధంగా వల వేస్తున్నారనే విషయాన్ని తెలియజేసే ఉదంతం ఇది. ఉగ్రదాడులకు కుట్ర పన్ని అరెస్టైన 17 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి మహ్మద్ అక్లాక్ విచారణలో.. అతను ఉగ్రవాదులతో ఏ విధంగా సంబంధాలు మొదలెట్టాడనే విషయం వెల్లడైంది. ఫేస్బుక్లో అక్లాక్ చేసిన ఒకే ఒక పోస్టు అతన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు దగ్గర చేసిందని అధికారులు గుర్తించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన 22 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్లాక్ 2014 డిసెంబర్ 6న ఫేస్బుక్లో దీనిపై ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ చేశాడు. దానికి సోషల్ మీడియాలో వందలాది లైక్స్, హిట్స్ వచ్చాయి. అంతే కాదు ఆ పోస్టు అతన్ని ఐఎస్ ఉగ్రవాదులకు దగ్గర చేసి అతని జీవితాన్నే మార్చేసింది.
అక్లాక్ పోస్టు చేసిన మరుసటి రోజు ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన యూసుఫ్ అనే వ్యక్తి నుండి ఓ మెసేజ్ అందుకున్నాడు. ఆ మెసేజ్లో అక్లాక్ను తెలివైన, దైర్యసాహసాలు కలిగిన వాడిగా పొగడ్తలతో ముంచెత్తిన యూసుఫ్.. అతన్ని ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపేలా ప్రేరేపించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. యూసుఫ్ను ఇస్లామిక్ స్టేట్ కమాండర్గా అధికారులు అనుమానిస్తున్నారు.
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరపున ఖలీఫా రాజ్య స్థాపన కోసం పోరాడటానికి అక్లాక్ అంగీకరించినట్లు తేలింది. పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం అక్లాక్ను ఇస్లామక్ స్టేట్ ఉగ్రవాదులు అక్లాక్ను సంస్థలో చేర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలున్నట్లు గుర్తించిన మరో నలుగురు విద్యార్థులు కూడా ఇలా సోషల్ మీడియా ద్వారానే ఉగ్రవాదులతో సంబంధాలు మొదలెట్టారని అధికారుల విచారణలో తేలడంతో సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.