Babri
-
ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాం!
'మేం తిరిగి వస్తున్నాం. బాబ్రి మసీదు విషయంలో, కశ్మీర్, గుజరాత్, ముజఫర్‌నగర్‌లలో ముస్లిలంను చంపిన విషయంలో చేతుల్లో కత్తులు పట్టుకొని ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తున్నాం'.. అంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తాజాగా ఓ వీడియోను ఆన్లైన్లో పోస్టుచేసింది. 22 నిమిషాల నిడివితో అరబిక్ భాషలో ఉన్న ఈ డాంక్యుమెంటరీలో భారత్‌కు చెందిన వ్యక్తులుగా భావిస్తున్న ఉగ్రవాదులు తమ సంస్థలో ఏయే హోదాలో ఉన్నారో వెల్లడించింది. 2014 నుంచి ఇరాక్, సిరియాలో ఫైటర్లుగా కొనసాగుతున్న ఐదుగురు జిహాదిస్టుల ఇంటర్వ్యూలను ఇందులో పొందుపర్చింది. శుక్రవారం ఉదయం ఆన్లైన్లో ఈ వీడియో దర్శనమిచ్చింది. భారత్, దక్షిణాసియాపై ప్రధాన దృష్టితో ఐఎస్ఐఎస్ విడుదల చేసిన తొలి వీడియో ఇది కావడం గమనార్హం. ఇందులోని పేర్కొన్న భారతీయ వ్యక్తుల్లో ఒక్కడిని మాత్రమే ఇప్పటివరకు గుర్తించారు. 2014లో సిరియా చేరుకున్న థానెకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఫహద్ తన్వీర్ షైక్ ఇంటర్వ్యూలో ఈ వీడియోలో ఉండటం గమనార్హం. అతడు మరో ఇద్దరితో కలిసి ఐఎస్ఐఎస్లో చేరేందుకు సిరియా వెళ్లాడు. షైక్ అబూ అమర్ ఆల్ హిందీ మారుపేరుతో ఈ వీడియోలో మాట్లాడాడు. బాబీ మసీదు విధ్వంసం, కశ్మీర్, గుజరాత్, ముజఫర్ నగర్లో ముస్లింల హత్యలకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ వస్తున్నామని అతడు హెచ్చరించాడు. అతనితోపాటు సిరియా వెళ్లి గత ఏడాది రఖ్ఖాలో జరిగిన బాంబు దాడిలో చనిపోయినట్టుగా భావిస్తున్న తన స్నేహితుడు, థానెకు చెందిన షమిమ్ టాంకికి షైక్ నివాళులర్పించాడు. సిరియాకు వెళ్లిన అతని మరో స్నేహితుడు అరీబ్ మజిద్ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధీనంలో ఉన్నాడు. -
ఫేస్బుక్లో చేసిన ఆ పోస్టే..
న్యూ ఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఏ విధంగా వల వేస్తున్నారనే విషయాన్ని తెలియజేసే ఉదంతం ఇది. ఉగ్రదాడులకు కుట్ర పన్ని అరెస్టైన 17 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి మహ్మద్ అక్లాక్ విచారణలో.. అతను ఉగ్రవాదులతో ఏ విధంగా సంబంధాలు మొదలెట్టాడనే విషయం వెల్లడైంది. ఫేస్బుక్లో అక్లాక్ చేసిన ఒకే ఒక పోస్టు అతన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు దగ్గర చేసిందని అధికారులు గుర్తించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన 22 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్లాక్ 2014 డిసెంబర్ 6న ఫేస్బుక్లో దీనిపై ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ చేశాడు. దానికి సోషల్ మీడియాలో వందలాది లైక్స్, హిట్స్ వచ్చాయి. అంతే కాదు ఆ పోస్టు అతన్ని ఐఎస్ ఉగ్రవాదులకు దగ్గర చేసి అతని జీవితాన్నే మార్చేసింది. అక్లాక్ పోస్టు చేసిన మరుసటి రోజు ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన యూసుఫ్ అనే వ్యక్తి నుండి ఓ మెసేజ్ అందుకున్నాడు. ఆ మెసేజ్‌లో అక్లాక్‌ను తెలివైన, దైర్యసాహసాలు కలిగిన వాడిగా పొగడ్తలతో ముంచెత్తిన యూసుఫ్.. అతన్ని ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపేలా ప్రేరేపించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. యూసుఫ్‌ను ఇస్లామిక్ స్టేట్ కమాండర్‌గా అధికారులు అనుమానిస్తున్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరపున ఖలీఫా రాజ్య స్థాపన కోసం పోరాడటానికి అక్లాక్ అంగీకరించినట్లు తేలింది. పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం అక్లాక్‌ను ఇస్లామక్ స్టేట్ ఉగ్రవాదులు అక్లాక్‌ను సంస్థలో చేర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నట్లు గుర్తించిన మరో నలుగురు విద్యార్థులు కూడా ఇలా సోషల్ మీడియా ద్వారానే ఉగ్రవాదులతో సంబంధాలు మొదలెట్టారని అధికారుల విచారణలో తేలడంతో సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
'ఎంతకాలం మమ్మల్ని పాకిస్థాన్ పొమ్మంటారు'
లక్నో: బాబ్రీ మసీదు విధ్వంసం నుంచి ఇటీవల జరిగిన దాద్రి ఘటన వరకు భారత్‌లో జరుగుతున్న మార్పులకు ప్రపంచమే సాక్షిగా నిలుస్తున్నదని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ అన్నారు. బుధవారం ఓ అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 'గత ఆరు దశాబ్దాలుగా ముస్లింలు భారత్‌లోనే నివసిస్తున్నారు. వారు ఏ ఇస్లామిక్ దేశానికీ వెళ్లాలనుకోవడంలేదు. ఎందుకంటే భారత లౌకిక స్వభావంపై వారికి నమ్మకం ఉంది. అయినా ఎంతకాలం మమ్మల్ని పాకిస్థాన్ వెళ్లిపోమ్మని బెదిరిస్తారు' అని ఆయన అన్నారు. యూపీలోని దాద్రిలో మహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి గోవుమంసాన్నితిని.. ఇంట్లో నిల్వ ఉంచాడన్న కారణంగా అతన్ని చంపేసిన ఘటన ఉద్రిక్తతలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆజంఖాన్ ఇటీవల లేఖ రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూస్థాన్‌ను హిందూదేశంగా మార్చాలన్న కొందరు హిందూత్వ శక్తుల ప్రయత్నానికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరముందని ఆజంఖాన్ అన్నారు.