'ఎంతకాలం మమ్మల్ని పాకిస్థాన్ పొమ్మంటారు'
లక్నో: బాబ్రీ మసీదు విధ్వంసం నుంచి ఇటీవల జరిగిన దాద్రి ఘటన వరకు భారత్లో జరుగుతున్న మార్పులకు ప్రపంచమే సాక్షిగా నిలుస్తున్నదని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ అన్నారు. బుధవారం ఓ అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 'గత ఆరు దశాబ్దాలుగా ముస్లింలు భారత్లోనే నివసిస్తున్నారు. వారు ఏ ఇస్లామిక్ దేశానికీ వెళ్లాలనుకోవడంలేదు. ఎందుకంటే భారత లౌకిక స్వభావంపై వారికి నమ్మకం ఉంది. అయినా ఎంతకాలం మమ్మల్ని పాకిస్థాన్ వెళ్లిపోమ్మని బెదిరిస్తారు' అని ఆయన అన్నారు.
యూపీలోని దాద్రిలో మహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి గోవుమంసాన్నితిని.. ఇంట్లో నిల్వ ఉంచాడన్న కారణంగా అతన్ని చంపేసిన ఘటన ఉద్రిక్తతలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆజంఖాన్ ఇటీవల లేఖ రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూస్థాన్ను హిందూదేశంగా మార్చాలన్న కొందరు హిందూత్వ శక్తుల ప్రయత్నానికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరముందని ఆజంఖాన్ అన్నారు.