లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ అల్లర్ల అంశం యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే.. ఈ దాడులకు సంబంధించి షాకింగ్‌కు గురి చేసే విషయం ఒకటి ఫోరెన్సిక్ దర్యాప్తులో వెలుగు చూసింది. హింసకు ఉపయోగించిన ఆయుధాలపై మేడ్ ఇన్ పాక్ గుర్తులు బయటపడడంతో.. వీటి వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ హింసాకాండలో పాకిస్తాన్‌కు చెందిన క్యాట్రిడ్జ్‌లు గుర్తించింది దర్యాప్తు బృందం(సిట్). నవంబర్ 24వ తేదీన కోట్ గర్వీ అల్లర్లు జరిగిన చోట.. ఐదు ఖాళీ షెల్స్, రెండు క్యాట్రిడ్జ్‌లను(మిస్ ఫైర్ అయినవే) ఫోరెన్సిక్స్ టీం సేకరించింది. అవి పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తయారైనవేనని నిర్ధారణ అయ్యిందని ఏఎస్పీ శ్రీష్ చంద్ర తెలిపారు. మరోవైపు.. పాక్‌కు చెందిన ఆయుధాల జాడ కనిపించడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోందని సంభల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ అంటున్నారు. అదే టైంలో.. ఈ హింసాకాండలో భాగమైన వాళ్ల కోసం గాలింపు ఉధృతం చేశామని వెల్లడించారాయన.
ఘటనా స్థలంలో.. సుమారు 90 నిమిషాల పాటు ఫోరెన్సిక్ తనిఖీలు కొనసాగాయి. పాక్‌తో పాటు అమెరికాకు చెందిన క్యాట్రిడ్జ్‌లు లభ్యమయ్యాయి. అలాగే అల్లర్లకు ఉపయోగించిన మందు సామగ్రి పాకిస్తాన్‌లో తయారైనట్లు తేలింది. దీంతో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు 12 బోర్ షెల్స్, రెండు 32 బోర్ షెల్స్ ఉన్నాయి. మరింత పరిశీలనకు.. మున్సిపల్ శాఖకు ఆ ప్రాంతంలో శుభ్రం చేయొద్దని సిట్ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు ముమ్మరం ద్వారానే పాక్ ప్రమేయంపై ఒక స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు.
పొలిటికల్ హీట్
ఘర్షణల దృష్ట్యా యూపీ సర్కార్ డిసెంబర్ 10వ తేదీ వరకు సంభాల్‌లో నిషేదాజ్ఞలు అమలు చేస్తోంది. అయితే ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాకం గాంధీలు సంభాల్ పర్యటనకు వెళ్తుండగా.. ఘాజీపూర్ దగ్గర కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని ఇద్దరూ యూపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. వారు ఢిల్లీ వెళ్లకుండానే తిరిగి ప్రయాణమయ్యారు.
ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో నవంబర్ చివరివారంలో హింసాకాండ చోటుచేసుకుంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదు ఉన్న ప్రాంతంలోనే ఆలయం ఉందని గతంలో హిందూ పిటిషనర్లు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై కోర్టు విచారించి సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సర్వే చేస్తున్న సమయంలో కొంతమంది అడ్డుకోవడంతో పాటు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల కేసుకు సంబంధించి.. 400 మందిని గుర్తించామని, ఇందులో 33 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment