నాలుగు కోట్ల నవ్వులు!
అలవాటుగా ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. యు.ఎస్.లోని డాలస్‌కు చెందిన క్యాన్ డేస్ పైన్ (37) తన పుట్టిన రోజు సందర్భంగా పిల్లలకు ఏదైనా బహుమతి కొందామని షాపుకెళ్లి అక్కడ ఒక సో బక్కా మాస్క్ (చింపాంజీ లాంటి)ను చూసి ముచ్చటపడి కొనుగోలు చేసింది. ఇంటికి వస్తూ.. కారులో దాన్ని ధరించి ఒక నిమిషం వీడియో తీసి దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అంతే! అది క్షణాల్లో హల్‌చల్‌గా మారింది. అత్యధికమంది వీక్షించిన రికార్డును సొంతం చేసింది. 4 కోట్ల 80 లక్షలమంది ఈ ఫన్నీ వీడియోను చూశారు.
దీంతో పైన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. పోస్ట్ చేసిన కొద్దినిమిషాల్లోనే విపరీతమైన కామెంట్లతో తన ఇన్‌బాక్స్ నిండిపోయిందని పైన్ తెలిపింది. లెక్కలేనన్ని ఈ మెయిల్స్ రిసీవ్ చేసుకున్నానంది. ఈ వీడియో చూడడం ద్వారా తమ డిప్రెషన్ మాయమైందని, చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది. అయితే స్థానిక చర్చ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే పైన్ ఇలాంటి వీడియోలను ఇక ముందు కూడా పోస్ట్ చేయనున్నదట. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు.