సాక్షి, హైదరాబాద్: తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళినీ చెప్పారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 12 ఏళ్లకు తెలంగాణ మూలాలున్న సీఎంగా రేవంత్‌రెడ్డి ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ఫేస్‌బుక్‌లో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు.
కొద్దిరోజులుగా మీడియా మిత్రులు తన ప్రతిస్పందన తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఫేస్‌బుక్‌లో బహిరంగ లేఖ పెడుతున్నానని చెప్పారు. తన లేఖ చివరిలో డి.నళినీ ఆచార్య, యజ్ఞ బ్రహ్మ, వేద ప్రచారకురాలు అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది నిరూపితమైంది. గతం ఒక రీల్ మాదిరి నా కళ్ల ముందు కదులుతోంది.
ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్‌గా ‘సోషల్ స్టిగ్మా (కళంకం)’ను మోశాను. నన్ను ఆనాటి ప్రభుత్వం మూ డేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. క్షణక్షణం ఒక గండంలా గడిచింది’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు దగ్గరైనా.. తన బంధుమిత్ర పరివారమంతా వెలివేసిందని, పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి జీవచ్ఛవంలా బతికానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేవుడు నన్ను క్రిమినాలజీ (నేర శాస్త్రం) నుంచి ఫిలాసఫీ (వేదాంతం) వైపు నడిపించాడు. రెండేళ్ల క్రితం నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు.
వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. మీరు (సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్‌ను నేను స్వతంత్రంగా ఉంటూనే వేద, యజ్ఞ, ధారి్మక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను’అని పేర్కొన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలా లైన ’వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నానని, అందువల్ల సీఎం రేవంత్‌రెడ్డిని కలవలేకపోతున్నట్టు నళినీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment