శ్రీ కృష్ణుడికి డబ్బింగ్‌ చెప్పాను! | Special story to dubbing artist Yousuf | Sakshi
Sakshi News home page

శ్రీ కృష్ణుడికి డబ్బింగ్‌ చెప్పాను!

Published Wed, Aug 29 2018 12:22 AM | Last Updated on Wed, Aug 29 2018 12:22 AM

Special story to dubbing artist Yousuf - Sakshi

పొద్దున్నే ఖురాన్‌ తెలుగులో చదవడం...సాయంత్రం శ్రీకృష్ణుడిపాత్రకు గాత్రం ఇవ్వడం...సినిమాలు, సీరియల్స్, ప్రకటనలు, డాక్యుమెంటరీలు... అన్ని విభాగాలలోను తన గొంతుతో సుపరిచితులయ్యారు  యూసఫ్‌. సుమారు 500 కు పైగా చిత్రాలకు, సీరియల్స్‌కు డబ్బింగ్‌ చెప్పిన యూసఫ్‌ ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు.తన డబ్బింగ్‌ ప్రయాణంగురించి ఫోన్‌ ద్వారా సాక్షితో  సంభాషించారు..

మాది ఖమ్మం జిల్లా ఇష్టాపురం. నాన్నది టైలర్‌ వృత్తి. అమ్మ గృహిణి. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంకామ్‌ చదివాను. ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేయడానికి హైదరాబాద్‌ వచ్చాను. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. కొత్త స్నేహాలు కలిశాయి. మిత్రులందరితో తరచూ ఫోన్‌లో సంభాషించేవాడిని. నా గొంతు విన్నవారంతా ‘నీ గొంతు బాగుంది, చక్కగా వాడుకోవచ్చు కదా’ అని తరచుగా అనేవారు. వారి ప్రోత్సాహంతో కొన్ని వ్యాపార ప్రకటనలను స్వయంగా రచించి, నేనే నటించి, నా గాత్రంతో వినిపించాను. కొన్ని ఆడియో క్యాసెట్లకు కూడా గొంతు ఇచ్చాను. ఆ తరవాత మిత్రుల సహకారంతో సినిమాలో డబ్బింగ్‌ చాన్స్‌ కోసం ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘జెండా’ చిత్రంలో డబ్బింగ్‌ చెప్పడానికి అవకాశం వచ్చింది. ఆ సినిమా కొత్తవారితో తీస్తున్నారని తెలిసి నేను కూడా ఒక ప్రయత్నం చేద్దామని, సెలక్షన్స్‌ కోసం రామానాయుడు స్టూడియోకి వెళ్లాను. ఎన్నో పరీక్షల తరవాత నన్ను ఎంపిక చేశారు. అక్కడే డబ్బింగ్‌ ఎలా చెప్పాలనే విషయంలో మంచి శిక్షణ పొందాను. ‘రెండు మూడు రోజుల తరవాత ప్రారంభిద్దాం’ అనడంతో వెళ్లిపోయాను. 

సినీ రంగ ప్రవేశం
మళ్లీ పిలుస్తాను అనడం, పిలుపు రాకపోవడం మామూలే. ఎంత కాలం గడిచినా నాకు పిలుపు రాలేదు. డబ్బింగ్‌ యూనియన్‌లో మెంబర్‌షిప్‌ లేకపోవడం వల్ల అవకాశం చేజారిపోయిందని తరవాత తెలిసింది. ‘జెండా’ సినీ నిర్మాత ప్రోత్సాహంతో డబ్బింగ్‌ యూనియన్‌లో మెంబర్‌షిప్‌ తీసుకున్నాను. ఆ సినిమాకి డబ్బంగ్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న మిఠాయి చిట్టిగారు ‘ధైర్యం కోల్పోవద్దు’ అని నన్ను ప్రోత్సహించారు. ఆ తరవాత జరిగిన ఆడిషన్స్‌లో నేను సెలక్ట్‌ అయ్యాక, మంచి మంచి అవకాశాలు వచ్చాయి. డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ వ్యవస్థాపక సభ్యులైన గోగినేని ప్రసాద్, కాంచనబాబు, మరికొందరు అవకాశాలు ఇవ్వడంతో నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను. అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. 

ఒకేరోజు పాతిక సీరియల్స్‌
సినిమాలలో చెబుతుండగానే, ‘చక్రవాకం’ సీరియల్‌తో బుల్లితెర అవకాశాలు వచ్చాయి. ఆ తరవాత వరుసగా సీరియల్స్‌కి డబ్బింగ్‌ ఇవ్వడం ప్రారంభించాను. సినిమాలు, టీవీ సీరియల్స్‌తో బాగా బిజీ అయిపోయాను. ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేసినా, కొన్ని సీరియల్స్‌ వదులుకోవలసి వచ్చింది. సినిమా అవకాశాలు మాత్రం వదులుకోలేదు. ఒకేరోజు టెలికాస్ట్‌ అయ్యే  సీరియల్స్‌లో సుమారు పాతిక సీరియల్స్‌లో నా గొంతు ఉండేది. 

గొంతుకు గుర్తింపు
సినిమాలు, సీరియల్స్‌తో పాటు ఎన్‌జిసి, డిస్కవరీ చానల్స్‌లో కూడా వాయిస్‌ ఓవర్‌ ఇస్తుండేవాడిని. ఆకాశవాణి నాటకాలలో, ఆడియో క్యాసెట్లు ... ఒక్కమాటలో చెప్పాలంలో 2004 నుంచి టీవీ చూసేవారందరికీ తప్పనిసరిగా నేను చిరపరిచితుడిని. నన్ను వ్యక్తిగతంగా గుర్తుపట్టరు కాని, నా గొంతును గుర్తుపడతారు. అలా డబ్బింగ్‌లో స్థిరపడిపోయాను. నా డబ్బింగ్‌ ప్రయాణంలో పెద్ద ఇబ్బందులేవీ ఎదుర్కోలేదు. వచ్చిన అవకాశాలన్నీ జాగ్రత్తగా ఉపయోగించుకున్నాను. 

ముందస్తు డబ్బింగ్‌
రెండుమూడు రోజులు ఊరు వెళ్లవలసి వస్తే, ముందుగానే డబ్బింగ్‌ చెప్పి వెళ్లేవాడిని. పనులన్నిటినీ జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవలసి వచ్చేది. నాకు శ్రావణితో వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు, ఆర్యన్, రయాన్‌. నా వివాహ సమయంలో సెలవు పెట్టవలసి వచ్చింది. వేరే వారితో డబ్బింగ్‌ చెప్పిస్తే, సీరియల్స్‌ దెబ్బ తింటాయని చెప్పడంతో, ముందుగానే డబ్బింగ్‌ పని పూర్తిచేసుకున్నాను. 2017 వరకు దాదాపుగా 500 పైగా సీరియల్స్, చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పాను. ఇందిరా ప్రొడక్షన్స్, గోపీకృష్ణ మూవీస్, శ్రీకాంత్‌ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ... వంటి అనేక మంచి మంచి సంస్థలలో డబ్బింగ్‌ చెప్పాను. 2013లో జరిగిన మహాకుంభమేళాకు సంబంధించి అరవై నిమిషాల నిడివితో ఒక కార్యక్రమం రూపొందించారు. అందులో నా గాత్రం ఉపయోగించుకున్నారు.

శ్రీకృష్ణుడికి గాత్రం
ఎన్ని సినిమాలు, సీరియల్స్‌కి చెప్పినా నాకు బాగా గర్వంగా, తృప్తిగా అనిపించింది మాత్రం శ్రీకృష్ణుడి పాత్రధారికి చెప్పిన డబ్బింగ్‌. టీవీలో వస్తున్న మహాభారతం సీరియల్‌లో శ్రీకృష్ణుడి పాత్రకు నాలుగైదు సార్లు అంటే నాలుగైదు సీరియల్స్‌లో డబ్బింగ్‌ చెప్పాను. బి.ఆర్‌చోప్రా రూపొందించిన మహాభారత్‌ను తెలుగులోకి డబ్‌ చేసినప్పుడు, అందులో శ్రీకృష్ణుడిగా వేసిన ‘నితీష్‌ భరద్వాజ్‌’కి తెలుగులో డబ్బింగ్‌ చెప్పాను. నా కోసమే ఆగారేమో అన్నట్లుగా ఎంతోకాలం తరవాత ఆ సీరియల్‌ని తెలుగులో డబ్‌ చేశారు. నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. ‘జై హనుమాన్‌’ చిత్రంలో శ్రీరాముడు పాత్రకు, ఆ తర్వాత శ్రీకృçష్ణుడి పాత్రకు నాలుగైదు సార్లు డబ్బింగ్‌ చెప్పాను. ‘హరహరమహాదేవ’ సీరియల్‌లో విష్ణుమూర్తి ప్రాతకు కూడా డబ్బింగ్‌ చెప్పాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కోయిలమ్మ, కుంకుమభాగ్య, శ్రీఆంజనేయం సీరియల్స్‌లో ప్రముఖంగాడబ్బింగ్‌ చెప్పాను. ‘ఆడదే ఆధారం’ సీరియల్‌లో మొదటిసారిగా విక్రమ్‌భాయ్‌ అనే విలన్‌ పాత్రకి డబ్బింగ్‌ చెప్పడం నాకొక టర్నింగ్‌ పాయింట్‌. అప్పటి నుంచి విలన్‌కి చెప్పే అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా అన్ని విలక్షణ పాత్రలకు చెప్పాను.

పౌరాణికాలంటే ఇష్టం
ఉదయం ‘తెలుగు ఖురాన్‌’ రికార్డు చేసి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడి పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. నాకు చిన్నప్పటి నుంచి పౌరాణికాలంటే ఇష్టం. శ్రీకృష్ణుడు నా డ్రీమ్‌ క్యారెక్టర్‌. మహాభారతం ద్వారా నా కల నెరవేరడం నా అదృష్టం. శ్రీకృష్ణుడి పాత్రకు గట్టి పోటీనే ఎదురైంది. 50 మంది గొంతుకలలో నా గొంతును ఎంపిక చేశారు. ‘నేను ఎవరు’ అనేది పట్టించుకోకుండా, నిష్పక్షపాతంగా ఆలోచించి, నాకు ఆ అవకాశం వచ్చేలా చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి... ఇలా నా డ్రీమ్‌ క్యారెక్టర్స్‌కి అనేకమార్లు డబ్బింగ్‌ చెప్పడం నా పూర్వజన్మ సుకృతంగా భావించాను. ఎంతోమంది కలలు కన్నా దక్కని అదృష్టం, నాకు రావడం నిజంగా నా పూర్వజన్మ పుణ్యమే.

ప్రకటనలకు... 
∙శ్రీరామావారి కాలమానం (థియేటర్లలో ప్రదర్శించారు), నివేదిత గ్రామర్‌ స్కూల్, జ్ఞానభారతి, కేర్‌ మినరల్‌ సోడా, డంకన్స్‌ నంబర్‌ వన్‌ టీ (నటన కూడా. దక్షిణభారతదేశంలో అన్ని భాషలలోను వచ్చింది)
∙కొందరు రాజకీయనాయకులకు పాటలు, డైలాగులు కూడా రాశాను.

చిత్రాలు
∙ప్రిన్స్‌ ఆఫ్‌ పర్షా్య (తెలుగులోకి అనువాదమైన హాలీవుడ్‌ చిత్రం) ∙దాసరి గారి ‘యంగ్‌ ఇండియా’ లో మహానటి సావిత్రి మనవడు అభినయ్‌కి డబ్బింగ్‌ చెప్పాను ∙50 పర్సెంట్‌ లవ్, అజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ (రణ్‌బీర్‌ కపూర్‌), జబ్‌ వి మెట్‌ (షాహిద్‌ కపూర్‌) ∙20కి పైగా చిన్న సినిమాలలో హీరోలకు చెప్పాను ∙ ఆదిత్య ఓం (మా అన్నయ్య బంగారం) ఇలా అనేక చిత్రాలలో నా గొంతు ప్రముఖంగా వినిపిస్తుంది. నాకు బాగా నచ్చిన చిత్రం ‘అజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ). 

హబ్సిగూడ స్ట్రీట్‌ నంబర్‌ 8,  కెప్టెన్‌ వీరరాజారెడ్డి వీధి...
కాశ్మీర్‌లో టెర్రరిస్టుల అటాక్‌లో 26 సంవత్సరాల వయసులో మరణించిన వీరరాజారెడ్డి పేరు పెట్టారు ఆ వీధికి. ఆయన మరణించిన సంవత్సరం తరువాత వచ్చిన గణేశ్‌ నవరాత్రుల సమయంలో అంటే 2003లో ఆయనకు సంబంధించిన వివరాలు డ్రామాగా రూపొందించి ‘సౌండ్‌ అండ్‌ లైట్‌’æ షోగా ప్రదర్శించాను. అందులో కాశ్మీరు సెట్‌ వేసి, తొమ్మిదిరోజులూ ప్రదర్శించాం. నేను స్క్రిప్ట్‌ రాసి, వాయిస్‌ ఓవర్‌ చెప్పాను. ఆయన పాత్ర కూడా నేనే పోషించాను. హిమాలయాలతో కూడిన, కాశ్మీర్‌ సెట్, ఆయనకు బుల్లెట్స్‌ తగలడం అంతా లైవ్‌గా చేశాం. అది నా జీవితంలో ముఖ్యమైన ఘట్టం.
– సంభాషణ: వైజయంతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement