Green chillies
-
పచ్చిమిరపమొక్కల్ని ఇలా పెంచితే కాయలే కాయలు!
గార్డెనింగ్ ఒక కళ. కాస్త ఓపిక, మరికాస్త శ్రద్ధపెడితే ఇంట్లోనే చాలారకాల పూల మొక్కల్ని పెంచుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు పండించు కోవచ్చు. పైగా వర్షాకాలం కాబట్టి బాల్కనీలోగానీ, ఇంటిముందు ఉన్న చిన్నస్థలంలోగానీ హాయిగా వీటిని పెంచు కోవచ్చు. గార్డెనింగ్‌తో మనసుకు సంతోషం మాత్రమేకాదు ఆర్గానిక్ ఆహారాన్ని తిన్నామన్న ఆనందమూ మిగులుతుంది. కిచెన్‌గార్డెన్‌లో చాలా సులభంగా పెరిగే మొక్కల్లో ఒకటి పచ్చి మిరపకాయ. ఇంట్లోనే పచ్చి మిరపకాయలను ఎలా పండించవచ్చు? తొందరగా పూత, కాపు రావాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.పచ్చిమిరపతో చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఆహారంలో రుచిని జోడించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రసిద్ధి చెందిన విటమిన్ సి విటమిన్ పుషల్కంగా లభిస్తుంది. మొటిమలు, చర్మం ముడతల్ని నివారిస్తుంది. జుట్టుకు మంచిది , బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తికి కూడా చాలా మంచిది. మరి ఇన్ని రకాల లాభాలున్న ఈ చిన్ని మొక్కను ఎలా పెంచుకోవాలి.సరైన విత్తనాలు ఎంచుకోవడం ముఖ్యంగా. సాధారణంగా ఎండుమిరపగింజలు వేసినాసులభంగా మొలకెత్తుతాయి. కానీ మంచి ఫలసాయం రావాలంటే నాణ్యమైన విత్తనాలను తెచ్చుకోవాలి. చిన్ని చిన్న కంటైనర్లు , కుండీలలో కూడా బాగా పెరుగుతాయి. 3-4 అంగుళాల లోతు , సరైన డ్రైనేజీ రంధ్రాలు ఉండేలా చూసుకోండి. తేమ , వెచ్చని వాతావరణం అవసరం కాబట్టి వాటిని పండించడానికి ఇంట్లో సెమీ షేడ్ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. కంపోస్ట్ కలిపిన సారవంతమైన మట్టితో కుండీని ఉపయోగించాలి. మంచి నాణ్యమైన పచ్చిమిర్చి విత్తనాలను తీసుకుని, కుండీలో ఒక అంగుళం లోతులో నాటండి. మట్టిని తేమగా ఉంచాలి. అలా అని ఎక్కువ నీరు పోయకూడదు. వాతావరణాన్ని బట్టి ప్రతి రోజు లేదా ప్రతి 2 రోజులకు ఒకసారి నీరు పోయాలి. నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్లిపోతుంది. విత్తనాలను నాటిన 7-10 రోజులలో రెండు చిన్న మొలకలు వస్తాయి. వీటికి ప్రతిరోజూ 5-6 గంటల సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. కాస్త ఎదిగిన తరువాత ఈ మొక్కలకు ట్రిమ్మింగ్ చాలా కీలకం. పూతకు ముందే చివర్లను కత్తిరిస్తే, మొక్క గుబురుగా వచ్చి, తొందరగా పూత కొస్తుంది. పూత దశలో లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కకు అందిస్తే పూత నిలబడి, బోలెడన్ని కాయలు వస్తాయి. సరైన రక్షణ, పోషణ అందితే దాదాపు రెండేళ్లయినా కూడా మిరప చెట్టు కాయలు కాస్తుంది. -
పచ్చిమిర్చితో అందమా? అస్సలు ఊహించలేరు!
పచ్చి మిరపకాయలేని కూరను ఊహించలేం కదా. పచ్చిమిర్చి అనగానే సహజంగా సుర్రున మండే కారం, కూరల్లో వాటి ప్రాధాన్యత, ఇంకాస్త ముందుకెడితే ఊరబెట్టిన మిరపకాయలు గుర్తొస్తాయి కదా. కానీ మన శరీరానికి కావాల్సిన విటమిన్లు పచ్చి మిర్చిలో పుష్కలంగా ఉంటాయి. జుట్టు అందాన్ని, చర్మమెరుపును సాధించవచ్చు. రోగ నిరోధక వ్యవస్థను పెంచే విటమిన్ సీ, చర్మ సంరక్షణకు తోడ్పడి, కంటి చూపును మెరుగు పరిచే విటమిన్ ‘ఏ’ కూడా వీటి ద్వారా లభ్యమవుతుంది తెలుసా? మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.పచ్చిమిర్చిని శాస్త్రీయంగా క్యాప్సికమ్ ఫ్రూట్సెన్స్ అంటారు. మిర్చిల్లో క్యాప్సైసిన్ అనే పదార్థమే దీని రుచి కారంగా ఉండడానికి కారణం. దీన్ని ఏడాది పొడవునా సాగు చేస్తారు. దాదాపు 400 రకాల పచ్చి మిరప కాయలు వినియోగంలో ఉన్నాయట. వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కో స్థాయిలో ఘాటు కలిగి ఉంటాయి.యాంటీమైక్రోబయల్ లక్షణాలతోపాటు, పచ్చి మిరపకాయలలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, టానిన్లు, స్టెరాయిడ్స్ , క్యాప్సైసిన్ వంటి అనేక మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి మిరపకాయల్లో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయని పరిశోధనలో తేలింది.పచ్చి మిరపకాయల వల్ల కలిగే ప్రయోజనాలుదీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణడయాబెటిస్కు రోగులకు ఉపయోగపడుతుంది.రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుందిబరువు తగ్గడానికి సహాయం చేయడంచలికాలంలో శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుందిపొట్టలో అల్సర్లను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ కారణంగా పచ్చిమిర్చి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. బోలు ఎముకల వ్యాధి నివారణలో సహాయం చేస్తుందిజీర్ణక్రియను మెరుగుపరుస్తుందిఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.వీటిల్లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడితే, విటమిన్ ఈ వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందిశరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలకు పచ్చిమిర్చి దివ్యౌషధం.నోట్: ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కదా అని దేన్నీ అతిగా తినడం మంచిది కాదు. శృతిమించితే ప్రయోజనాలు లభించక పోగా అనారోగ్యాన్ని చేతులారా కొని కొంటామనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. -
ఘాటెక్కిన పచ్చిమిర్చి
హైదరాబాద్: పచ్చిమిర్చి ధరలు మండిపోతున్నాయి. ప్రధాన మార్కెట్లో వారం రోజుల క్రితం కిలో రూ. 40–50 పలికితే.. తాజాగా రూ.100–120కి చేరింది. గుడిమల్కాపూర్ బోయిన్‌ల్లి మాదన్నపేట ఎల్బీనగర్ మార్కెట్లతో పాటు రైతు బజార్లకు సైతం సరఫరా బాగా తగ్గింది. శనివారం నగర మార్కెట్లకు కేవలం 900 క్వింటాళ్లు దిగుమతి అయింది. దీంతో నగర అవసరాలకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్‌లోనే అధికంగా పచ్చి మిర్చి పండిస్తున్నారు. ఏపీలోని అనంతపురం, కడప జిల్లాలో అత్యధికంగా మిర్చి పండిస్తున్నారు. నగర శివారు జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో పచ్చిమిర్చి దిగుబడి తగ్గడంతో నగర మార్కెట్ భారీగా దిగుమతులు పడిపోయాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులతో టాన్స్‌పోర్టు ఖర్చు ఎక్కువైందని వ్యాపారులు చెప్పారు. మరో మూడు వారాల వరకూ.. తాజాగా శనివారం నగరానికి కేవలం 900 క్వింటాళ్ల పచ్చిమిర్చి మాత్రమే రావడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. మామూలు రోజుల్లో నిత్యం మార్కెట్లకు 2800–3000 క్వింటాళ్ల పచ్చిమిర్చి దిగుమతి అయ్యేదని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం దిగుమతులు తక్కువగా ఉండడంతో హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాలుకు రూ. 800 నుంచి రూ.9,500కు విక్రయిస్తున్నారు. నగరంలో పచ్చిమిర్చి సరఫరా తగ్గిన దృష్ట్యా కర్ణాటకలోని బెల్గాం నుంచి కూడా పచ్చిమిర్చి దిగుమతి అవుతోంది. మరో రెండు మూడు వారాలు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. మార్కెట్‌కు డిమాండ్ ప్రకారం సరఫరా కాకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మిర్చి సరఫరా తగ్గడంతో కొందరు చిల్లర వ్యాపారులు ధరలు మరింత పెంచేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి కిలో ధర రూ. 120 వరకు పలుకుతోంది. -
ఆ'క్యాష్' మిర్చి: రూటే సపరేటు.. కిలో రూ.120 నుంచి రూ.140
కారంలోనే కాదు.. లాభాల్లోనూ నాలుగు రెట్లు ఘాటు అధికం..ఆ మిర్చి. ఆ రకం వంగడానికి కార్పొరేట్ కంపెనీలే దాసోసం అన్నాయి. అందుకే ఆ మిర్చి రకం కాయలు అధిక ధరలు పలుకుతున్నాయి. ఫలితంగా కర్షకుడి ఇంట సిరులు పంట పండుతోంది. సాగుదారుకు అధిక క్యాష్ ఇస్తున్నదే.. ఆకాష్ మిర్చి వంగడం. దీనిపై ప్రత్యేక కథనం. గుర్రంకొండ: కొత్తరకం ఆకాష్ మిర్చి(డెమెన్ ఎఫ్–1) సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. ప్రస్తుతం కిలో మిర్చి మార్కెట్లో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతోంది. సాధారణ మిర్చితో పోల్చితే ఈ రకం మిర్చి నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. బయట రాష్ట్రాల్లో ఈ రకం మిర్చికి అధికంగా డిమాండ్ ఉంది. సాధారణ మిర్చి కొమ్మకు కింది వైపు కాయగా ఆకాష్ మిర్చి కొమ్మకు పైభాగంలో ఆకాశాన్ని చూస్తుండటం వీటి ప్రత్యేకత. పంట సాగుతో రైతుకు నిలకడైన ఆదాయం వస్తుండడంతో గత మూడేళ్లుగా ఈ ప్రాంతం రైతులు మిర్చి పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కర్ణాటకలో కొత్త వంగడం: ఆకాష్ మిర్చి రకం విత్తనాలు మొదట కర్ణాటక రాష్ట్రంలో నాలుగేళ్ల కిందట కనుగొన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ వారు ఈ రకం విత్తనాలు ఉత్పత్తి చేసి, మార్కెట్లో విక్రయిస్తున్నారు. మూడేళ్లుగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, పెద్దమండ్యం, గుర్రంకొండ మండలాల్లో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా కారం ఉండడంతో ప్రముఖ కంపెనీలైన ఆశీర్వాద్, ఆచీ కంపెనీలు తాము తయారు చేసే కారం పొడుల్లో ఆకాష్ మిర్చిని ఎక్కువగా వినియోగస్తుండడంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఎకరా సాగుకు రూ. 1.50 లక్షలు ఖర్చు ఆకాష్ మిర్చి ఎకరం సాగుకు రూ.1.50 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో రబీ సీజన్ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ 10వ తేదీలోగా నారు నాటుకోవాలి. ఎకరం పొలానికి రూ.10 వేల మొక్కల నారు అవసరం. మార్కెట్లో 10 వేల మొక్కల నారుకు రూ.10 వేలు చెల్లించాలి. దుక్కి నుంచి మల్చింగ్, డ్రిప్ పైపులు, వారానికి రెండు సార్లు పురుగు నివారణ మందుల పిచికారీ, ఎరువులు తదితర అన్ని ఖర్చులు ఎకరాకు రూ. 1.50 లక్షలు వరకు అవుతాయి. ఎకరానికి సుమారు రూ.20 లక్షల ఆదాయం ప్రస్తుతం మార్కెట్లో కిలో మిర్చి రూ. 120 నుంచి రూ.130 వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్ అంతా సరాసరి రూ.80 నుంచి రూ.100 వరకు ధరలు తగ్గకుండా పలుకుతుంటాయి. దీంతో సాగు ఖర్చు పోను ఎకరానికి సరాసరి కనీసం రూ. 10 లక్షల నుంచి అత్యధికంగా రూ.20 లక్షల వరకు రైతులకు మిగులుతోంది. ఒక వేళ ధరలు లేక పోయినా ఎండుమిర్చి కింద వీటిని వాడుకున్న రైతులకు సాగు పెట్టుబడికి ఢోకా ఉండదు. నాలుగు రెట్లు అధిక కారం ఆకాష్ మిర్చి సాధారణ మిర్చి కంటే నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. సా«ధారణ మిర్చి తొడిమి ఒక ఇంచి లోపు ఉండగా ఈ రకం మిర్చి తొడిమి రెండు నుంచి రెండున్నర అంగుళాల పొడవు ఉండడం విశేషం. సాధారణ మిర్చి నాలుగు కిలోలకు ఆకాష్మిర్చి ఒక కిలో సమానం అవుతుంది. దీంతో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా హోటళ్లు, పీజీ హాస్టళ్లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. మొక్కలో ఆకాశం వైపు చూస్తున్న మిరప కాయలు ఎకరానికి 10 నుంచి 20 టన్నుల దిగుబడి మొక్క నాటిన 80 నుంచి 90 రోజులకు పంట దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణంగా ఎకరం పంటకు అత్యల్పంగా 10 టన్నుల నుంచి అత్యధికంగా 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు కాయల దిగుబడి వస్తుంది. మంచి ఎరువులు వాడుతూ పంటను కాపాడుకుంటే అత్యధికంగా నాలుగు నెలల వరకు దిగుబడి వస్తుంది. లాభదాయక పంట ఆకాష్ మిర్చి మంచి లాభదాయక పంట. మిగిలిన పంటలతో పోల్చితే ఈ రకం మిర్చి సాగుతో ఎప్పుడు నష్టం ఉండదు. మార్కెట్లో సాధారణ ధరలు ఉన్నా కిలో రూ. 70 వరకు ధర పలుకుతుంది. మంచి డిమాండ్ ఉంటే కిలో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతుంది. – జయమ్మ, మహిళా రైతు, దిగువ పల్లె మూడేళ్లుగా సాగు చేస్తున్నా ఆకాష్ మిర్చి పంటను మూడేళ్లుగా సాగు చేస్తున్నా. ఎకరానికి రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అయితే ఎప్పుడూ నష్టాలు రాలేదు. అన్ని సార్లు పెట్టుబడి పోను లాభాలే వచ్చాయి. – చెంగల్రాయులు, రైతు, కొత్తపల్లె ఇక్కడి వాతావరణం అనువైంది కొత్త రకం ఆకాష్ మిర్చి పడమటి మండలాల వాతావరణానికి అనువైంది.మార్కెట్లో ఈ రకం మిర్చికి మంచి గిట్టుబాటు ధరలున్నాయి. దీంతో నిలకడైన ఆదాయం ఉన్న ఈ పంట రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది. – శైలజ, ఉద్యానవనశాఖాధికారి, వాల్మీకిపురం క్లస్టర్ -
ఇంటిప్స్
క్యారట్ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి.క్యారట్ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది.అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ళ మంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి. -
ఇంటిప్స్
పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకుంటే చేతులు మండకుండా ఉంటాయి. వంటగదిలో అలోవెరా మొక్కను పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న గాయాలు తగిలినపుడు అలోవెరా ఆకును తెంపి ఆ జెల్‌ను గాయమైన చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది. -
...ఇట్లు గారెలు
రోజూ మబ్బుపడుతోంది సాయంత్రానికి నాలుగు చినుకులు పడనే పడతాయి పిల్లలు ఇంటికొచ్చేటప్పటికి ఏం చేస్తే బావుంటుంది? నానపోయండి... రుబ్బండి... నూనెలో వేయండి! మేము రెడీ!! మినపగారె కావలసినవి మినప్పప్పు - రెండు కప్పులు ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు పచ్చిమిర్చి- రెండు (తరగాలి) అల్లం- అంగుళం ముక్క (సన్నగా తరగాలి) ఉప్పు - తగినంత నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: మినప్పప్పును కడిగి కనీసం నాలుగు గంటల సేపు నానబెట్టాలి. నీటిని మితంగా వేస్తూ రుబ్బాలి. ఇందులో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం కలపాలి. బాణలిలో నూనె కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా చేసి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి. గమనిక: గారెకు మధ్యలో చిల్లు పెడితే పిండి మొత్తం సమంగా కాలుతుంది. చిల్లు లేకపోతే కొన్నిసార్లు మధ్యలో పిండి పచ్చిగా ఉంటుంది. సగ్గుబియ్యం గారెలు కావలసినవి సగ్గుబియ్యం- ఒకటిన్నర కప్పు ఉడికించిన బంగాళదుంపలు- మూడు (తొక్క తీసి చిదమాలి) వేయించిన వేరుశనగపప్పు - ఒక కప్పు (పలుకుగా పొడి చేసుకోవాలి) పచ్చిమిర్చి- మూడు (సన్నగా తరగాలి) కొత్తిమీర తరుగు- రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్ ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: సగ్గుబియ్యాన్ని రెండు గంటల సేపు నానబెట్టి నీటిని వడపోయాలి. సగ్గుబియ్యం, ఉడికించి చిదిమిన బంగాళదుంప, వేరుశనగపప్పు పొడి, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా వత్తి నూనెలో రెండు వైపులా కాల్చాలి. క్యాబేజ్ గారెలు కావలసినవి: పచ్చి శనగపప్పు- అర కప్పు మినప్పప్పు - అర కప్పు క్యాబేజ్ తరుగు - రెండు కప్పులు పచ్చిమిర్చి- రెండు (తరగాలి) అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి) కొత్తిమీర తరుగు - అర కప్పు కరివేపాకు - రెండు రెమ్మలు సోంఫు, జీలకర్ర - ఒక్కోటి అర టీ స్పూన్ మిరియాలు - అర టీ స్పూన్ ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత వెల్లుల్లి - రెండు రేకలు (తరగాలి) నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: మినప్పప్పు, శనగపప్పును కడిగి రాత్రంతా నానబెట్టాలి లేదా కనీసం ఐదు గంటల సేపు నాననివ్వాలి. నీటిని వంపేసి పప్పులలో మిరియాలు, సోంఫు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి తక్కువ నీటిని వేస్తూ గట్టిగా రుబ్బాలి. ఈ మిశ్రమంలో క్యాబేజ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా వత్తి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి. మొక్కజొన్న గారెలు కావలసినవి: మొక్కజొన్న గింజలు- 150 గ్రా (పచ్చివి) పచ్చి శనగ పప్పు - 50 గ్రా (గంట సేపు నానబెట్టాలి) పచ్చిమిర్చి తరుగు - టీస్పూన్, ఉల్లిపాయ ముక్కలు-కప్పు అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి) జీలకర్ర - అర టీ స్పూన్; ఉప్పు- తగినంత కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్ నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: మొక్కజొన్న గింజలు, శనగపప్పు కలిపి కాస్త పలుకుగా రుబ్బాలి. పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి పై మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని అరచేతిలో ఉంచి గారెల ఆకారంలో వత్తి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి. దీనికి కొబ్బరి కారం లేదా చికెన్ కర్రీ చక్కటి కాంబినేషన్. గమనిక: పిండిలో నీరు ఎక్కువై మరీ జారుడుగా ఉంటే కార్న్‌ఫ్లోర్ కలుపుకోవాలి. -
కొనాలంటే మంటే
- మిర్చి కిలో కేజీ రూ.60 - తగ్గిన దిగుబడితో ధరాఘాతం - విలవిల్లాడుతున్న వినియోగదారులు - యథేచ్ఛగా వ్యాపారుల దోపిడీ - మరో నెలన్నర పాటు ఇదే పరిస్థితి సాక్షి, సిటీబ్యూరో: పచ్చిమిర్చి ధర మళ్లీ ఘాటెక్కింది. కూరల్లో నిత్యవసర వస్తువైన టమాటా కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి కేజీ రూ.60 పలుకుతుండగా, టమాట రూ.50కి విక్రయిస్తున్నారు. రైతుబజార్లో కాస్త తక్కువగా మిర్చి కేజీ రూ.42, టమాటా రూ.41 వంతున అమ్ముతున్నారు. ఈ ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. సీజన్ ముగుస్తుండడంతో మార్కెట్లోకి వచ్చే సరుకు తగ్గిపోయింది. ప్రధానంగా కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి తగినంత పచ్చిమిర్చి సరఫరా కావట్లేదు. టమాటా ఉత్పత్తి కూడా చివరి దశకు చేరుకోవడంతో సరఫరా సగానికి పడిపోయింది. దీంతో నగర డి మాండ్, సరఫరాల మధ్య అంతరం ఏర్పడింది. సుమారు 50 శాతం మేర సరఫరా తగ్గింది. దీన్నే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు రేట్లు భారీగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి దిగుమతి అయ్యే టమాటా పైనే నగరం ఆధారపడుతోంది. ఆదివారం హోల్‌సేల్ మార్కెట్లో టమాటా కిలో రూ.38 పలికింది. ఇదే సరుకు రైతుబజార్లో కిలో రూ.41కి విక్రయించగా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.50 పలికింది. ఇక చిక్కుడు, క్యారెట్, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, ఫ్రెంచ్బీన్స్ ధరలైతే సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. అక్కడా వ్యాపార ధోరణే రైతుబ జార్లలోనూ వ్యాపార ధోరణే కనిపిస్తోంది. స్థానికంగా ఉత్పత్తులు తగ్గిపోవడంతో కూరగాయల కొరత పెరుగుతోంది. గత నెలలో రైతుబజార్లో కిలో రూ.20కి లభించిన టమాటా ప్రస్తుతం రూ.41కి చేరింది. ఇదే సరుకు బహిరంగ మార్కెట్లో కేజీ రూ.50పైనే పలుకుతోంది. నగర అవసరాలకు రోజుకు 600 టన్నులకుపైగా టమాటా కావాల్సి ఉండగా, ప్రస్తుతం 300 టన్నులే దిగుమతి అవుతున్నట్టు రికార్డులు చెబున్నాయి. ఈ ప్రభావం ధరలపై పడుతోంది. ఈ విషయంలో మార్కెటింగ్ శాఖ జోక్యం ఏమాత్రం కన్పించట్లేదన్న విమర్శలు ఉన్నాయి. ధరల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఇక పచ్చిమిర్చి విషయమైతే చెప్పనవసరమే లేదు. గత నెలలో కేజీ రూ.20-25కు లభించిన పచ్చిమిర్చి ఇప్పుడు ఏకంగా రూ.60కి ఎగబాకింది. అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే పచ్చి మిర్చి, టమాటాల ధరలు అస్థిరంగా ఉండటంతో ఈ ప్రభావం మిగతా కూరగాయలపై పడుతోంది. వారం వ్యవధిలోనే ధరలు అనూహ్యంగా పెరగడంతో సామాన్యుడి కూరగాయల బడ్జెట్ బాగా పెరిగింది. ఇక వర్షాలు కురిస్తే కూరగాయల ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి, ఇతర రాష్ట్రాల నుంచి టమాటా, మిర్చిని సేకరించడం ద్వారా కూరగాయల ధరలకు కళ్లెం వేయాలని నగర వాసులు కోరుతున్నారు. -
కూరగాయలు కుతకుత
నియంత్రణ లేని ఫలితం... నింగికెగసిన ధరలు సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల తరుణంలో నిత్యావసరాలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఎన్నికల హడావుడి, కోలాహలం ముగిసినా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 12 రోజుల వ్యవధి ఉండటంతో నిత్యావసరాలపై అధికారుల పర్యవేక్షణ లేకుండాపోయింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ కూరగాయల వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. అన్ని వర్గాల ప్రజలు నిత్యం వినియోగించే టమోట, పచ్చిమిర్చి, బీర, బెండ, గోకర, చిక్కుడు, దోస వంటి వాటి ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఎన్నికల ముందున్న ధరలతో ప్రస్తుత ధరలను పోలిస్తే కొన్ని రకాల కూరగాయలపై రూ.10-20 వరకు పెరుగుదల కన్పిస్తోంది. టమోట, మిర్చి ధరలు పెరగడం గృహిణులను కలవరపెడుతోంది. గత నెలలో కేజీ రూ.8-10కి లభించిన టమోట ప్రస్తుతం రూ.20కి, అలాగే రూ.15-20 ఉన్న పచ్చిమిర్చి రూ.40కి ఎగబాకాయి. ఈ సీజన్లో ఉత్పత్తి తక్కువగా ఉంటే బీర, చిక్కుడు, గోరుచిక్కుడు, వంకాయ, బీరకాయ ధరలు రైతుబజార్లో కాస్త తక్కువగానే ఉన్నా, బహిరంగ మార్కెట్లో భగభగమంటున్నాయి. గిరాకీని బట్టి వ్యాపారులు ధర నిర్ణయించి సొమ్ము చేసుకొంటున్నారు. తోపుడు బండ్ల వారైతే మరో రూ.5 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారం ధరల దోపిడీ టోకు మార్కెట్లో పచ్చిమిర్చి ధర కేజీ రూ.16 ఉండగా, రైతుబజార్లో మాత్రం రూ.18కి విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. గత నెలలో కేజీ రూ.15-20కు లభించిన పచ్చిమిర్చి ఇప్పుడు రూ.40కి ఎగబాకడంతో సామాన్యుడి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అసలు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో బతుకు భారంగా మారిన సామాన్యుడు పచ్చడి మెతుకులతో సరిపుచ్చుకొందామనుకొన్నా మిర్చి, టమోట ధరలు ఠారెత్తిస్తుండటం గొంతులోకి ముద్ద మింగుడు పడకుండా ఉంది. పెరిగిన ధరలను చూసి మధ్యతరగతి వర్గాలతో పాటు సామాన్య, పేద వర్గాల ప్రజలు జేబులు తడుముకొనే పరిస్థితి నెలకొంది. కాగా, నగరంలో నిత్యం 80-100 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ఇప్పుడిది 30-40 టన్నులకు మించట్లేదని, ఆ కొరత ప్రభావం ధరలపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. -
డోలాయమానంలో మిర్చిరైతులు
పర్చూరు, న్యూస్‌లైన్: ధరలు రోజురోజుకూ పతనమవుతుండటంతో మిర్చి రైతులు ఈ ఏడాది సాగుచేయాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నారు. నెల రోజుల క్రితం క్వింటా రూ. 6500 ఉన్న సాధారణ రకం మిర్చి ధర ప్రస్తుతం రూ. 1500 తగ్గి రూ. 5 వేలకు చేరింది. విరివిగా వర్షాలు కురుస్తుండటంతో పాటు జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉంది. ఈ నేపథ్యంలో మిర్చి సాగు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ధరలు మరింత పతనమవుతాయన్న భయం రైతాంగంలో నెలకొంది. మిర్చికి ఏటా సాగు ప్రారంభంలో ధరలు ఆశాజనకంగా ఉంటాయి. అలాంటిది సాగు ప్రారంభంలోనే ధరలు పతనమవడంతో మిర్చి సాగు చేసేందుకు రైతులు జంకుతున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏటా సుమారు 45 వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది. 90 శాతం రబీలోనే సాగు చేస్తారు. ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో సాగు చేయాలా వద్దా అనే ప్రశ్న రైతాంగాన్ని వేధిస్తోంది. తగ్గుతున్న ధరలు వారిని పునరాలోచనలో పడేస్తున్నాయి. ఎకరా మిర్చి సాగుకు హీనపక్షం లక్ష రూపాయలకుపైగా ఖర్చవుతుంది. దీనికి తోడు ఈ ఏడాది మిర్చి సాగు చేసే భూములకు కౌలు రూ. 20 వేల వరకు చేరింది. ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలో సాగు ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుబడులు మాత్రం ఎకరాకు సరాసరిన 15-16 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమైతే పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో సొంతంగా భూములున్న రైతులు మాత్రం కొంత మేర మిర్చి సాగుపై మొగ్గు చూపుతున్నా..కౌలు రైతులు వెనకాడుతున్నారు. గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతుల్లో చాలా మంది శనగ పైరు కూడా సాగు చేశారు. గిట్టుబాటు ధరలు లేక శనగ పైరు రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ భారీ పెట్టుబడులు పెట్టి మిర్చి సాగు చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంలో కొందరు రైతులున్నారు.