కొనాలంటే మంటే
- మిర్చి కిలో కేజీ రూ.60
- తగ్గిన దిగుబడితో ధరాఘాతం
- విలవిల్లాడుతున్న వినియోగదారులు
- యథేచ్ఛగా వ్యాపారుల దోపిడీ
- మరో నెలన్నర పాటు ఇదే పరిస్థితి
సాక్షి, సిటీబ్యూరో: పచ్చిమిర్చి ధర మళ్లీ ఘాటెక్కింది. కూరల్లో నిత్యవసర వస్తువైన టమాటా కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి కేజీ రూ.60 పలుకుతుండగా, టమాట రూ.50కి విక్రయిస్తున్నారు. రైతుబజార్‌లో కాస్త తక్కువగా మిర్చి కేజీ రూ.42, టమాటా రూ.41 వంతున అమ్ముతున్నారు. ఈ ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. సీజన్ ముగుస్తుండడంతో మార్కెట్లోకి వచ్చే సరుకు తగ్గిపోయింది. ప్రధానంగా కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి తగినంత పచ్చిమిర్చి సరఫరా కావట్లేదు.
టమాటా ఉత్పత్తి కూడా చివరి దశకు చేరుకోవడంతో సరఫరా సగానికి పడిపోయింది. దీంతో నగర డి మాండ్, సరఫరాల మధ్య అంతరం ఏర్పడింది. సుమారు 50 శాతం మేర సరఫరా తగ్గింది. దీన్నే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు రేట్లు భారీగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి దిగుమతి అయ్యే టమాటా పైనే నగరం ఆధారపడుతోంది. ఆదివారం హోల్‌సేల్ మార్కెట్లో టమాటా కిలో రూ.38 పలికింది. ఇదే సరుకు రైతుబజార్‌లో కిలో రూ.41కి విక్రయించగా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.50 పలికింది. ఇక చిక్కుడు, క్యారెట్, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, ఫ్రెంచ్‌బీన్స్ ధరలైతే సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి.
అక్కడా వ్యాపార ధోరణే
రైతుబ జార్లలోనూ వ్యాపార ధోరణే కనిపిస్తోంది. స్థానికంగా ఉత్పత్తులు తగ్గిపోవడంతో కూరగాయల కొరత పెరుగుతోంది. గత నెలలో రైతుబజార్‌లో కిలో రూ.20కి లభించిన టమాటా ప్రస్తుతం రూ.41కి చేరింది. ఇదే సరుకు బహిరంగ మార్కెట్లో కేజీ రూ.50పైనే పలుకుతోంది. నగర అవసరాలకు రోజుకు 600 టన్నులకుపైగా టమాటా కావాల్సి ఉండగా, ప్రస్తుతం 300 టన్నులే దిగుమతి అవుతున్నట్టు రికార్డులు చెబున్నాయి. ఈ ప్రభావం ధరలపై పడుతోంది. ఈ విషయంలో మార్కెటింగ్ శాఖ జోక్యం ఏమాత్రం కన్పించట్లేదన్న విమర్శలు ఉన్నాయి.
ధరల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఇక పచ్చిమిర్చి విషయమైతే చెప్పనవసరమే లేదు. గత నెలలో కేజీ రూ.20-25కు లభించిన పచ్చిమిర్చి ఇప్పుడు ఏకంగా రూ.60కి ఎగబాకింది. అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే పచ్చి మిర్చి, టమాటాల ధరలు అస్థిరంగా ఉండటంతో ఈ ప్రభావం మిగతా కూరగాయలపై పడుతోంది. వారం వ్యవధిలోనే ధరలు అనూహ్యంగా పెరగడంతో సామాన్యుడి కూరగాయల బడ్జెట్ బాగా పెరిగింది. ఇక వర్షాలు కురిస్తే కూరగాయల ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి, ఇతర రాష్ట్రాల నుంచి టమాటా, మిర్చిని సేకరించడం ద్వారా కూరగాయల ధరలకు కళ్లెం వేయాలని నగర వాసులు కోరుతున్నారు.