మట్టిపై నమ్మకం.. మొక్కలపై మక్కువ! | Inti Panta Special Story | Sakshi
Sakshi News home page

మట్టిపై నమ్మకం.. మొక్కలపై మక్కువ!

Published Tue, Jul 9 2019 11:37 AM | Last Updated on Tue, Jul 9 2019 11:37 AM

Inti Panta Special Story - Sakshi

∙సిల్పాలిన్‌ బెడ్‌లో ఒత్తుగా అల్లుకున్న కాకర, బచ్చలి పాదులు, టమాటో మొక్క.. ఆ బెడ్‌లోనే 4 కుండీలు, వాటిల్లోనూ బత్తాయి తదితర పండ్ల మొక్కలు..

ఒకటి కాదు పది కాదు.. ఏకంగా 35 ఏళ్ల మాట. పుట్టింటి నుంచి తెచ్చిన మాసుపత్రి, మరువం మొక్కలను, వాటితోపాటు తెచ్చిన మట్టిని, మట్టి కుండీని కూడా తన ఇంటిపైన కూరగాయలు, పండ్ల తోట పొత్తిళ్లలో ఉంచి అపురూపంగా చూసుకుంటున్నారు సీనియర్‌ మోస్ట్‌ సిటీ ఫార్మర్‌ నూర్జహాన్‌. ఆమెకు మట్టి మీద నమ్మకం ఉంది, మొక్కల మీద మక్కువ వుంది. ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్‌ నగరానికి తరలి వచ్చి 35 ఏళ్లయినా అవి చెక్కుచెదరలేదు సరికదా.. వందల రెట్లు పెరిగాయి! వారి మేడపైన వందలాది పండ్లు, కూరగాయ మొక్కలై వర్థిల్లుతున్నాయి. నూర్జహాన్‌ గుండెల నిండుగా ఉన్న ప్రకృతిపై ప్రేమ.. వారి ఇంటిపై సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటగా విరిజిల్లుతూ కుటుంబానికి వరప్రసాదంగా మారింది. 

ఒంగోలులో పుట్టిన ఆమె ప్రకాశం జిల్లా కరవదికి చెందిన రహంతుల్లాతో వివాహం అయిన తర్వాత భాగ్యనగరానికి వచ్చి ఆసిఫ్‌నగర్‌లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. పోలీస్‌గా పనిచేసిన రహంతుల్లా ఇటీవలే హెడ్‌ కానిస్టేబుల్‌గా రిటైరయ్యారు. అద్దె ఇళ్లలో ఉన్న 15 ఏళ్లు కొద్ది కుండీలకే పరిమితమైన నూర్జహాన్‌ ఇంటిపంటలు.. 20 ఏళ్ల క్రితం వెయ్యి చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకున్నాక రెండు మడులు వందల కుండీలుగావిస్తరించింది. ఇంటి పిట్టగోడలపైన, దారి పక్కన, మేడపైన.. ఎక్కడ చూస్తే అక్కడ ఇంటిపంటలు వందలాది చిన్నా పెద్దా కుండీల్లో ఫలప్రదంగా అలరారుతున్నాయి. పాత డబ్బాలు, సీసాలు, సేట్‌కేసులు.. పచ్చని మొక్కలకు ఆలంబనగా మారి కనిపిస్తాయి. ఇరుకు అనేది ఇంటిపంటల సాగుకు సమస్యే కాదని ఆమె నిరూపిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అని నూర్జహాన్‌ ఇంటిపంటలను చూస్తే ఇట్టే అర్థమవతుంది ఎవరికైనా. సేంద్రియ ఇంటిపంటల సాగులో అనుసరిస్తున్న పద్ధతులు ఆసక్తిగొలుపుతున్నాయి.

ఒక మడిలో 4 కుండీలు.. పది మొక్కలు..   
ఉద్యాన శాఖ ఇచ్చిన పెద్ద సిల్పాలిన్‌ రౌండ్‌ గ్రోబాగ్స్‌తోపాటు తాము నిర్మించుకున్న ఇటుకల సిమెంటు మడుల్లో కూడా ఇంటిపంటలను నూర్జహాన్‌ సాగు చేస్తున్నారు. మేడ పైన నాపరాళ్లు పరిచి వాటిపైన ఇటుకలతో మడి నిర్మించుకుంటే శ్లాబ్‌ లీక్‌ అవకాశం ఉండదు అంటారామె.

రౌండ్‌ గ్రోబాగ్‌/ ఇటుకల మడిలో ఒకటికి పది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఉండేలా చూసుకోవడం విశేషం. రౌండ్‌ గ్రోబ్యాగ్‌/ ఇటుకల మడిలో మట్టి నింపిన తర్వాత.. ఆ మట్టి మీద 3 లేక 4 పండ్ల మొక్కల కుండీలను పెడతారు. ఆ కుండీల అడుగు భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. కుండీల్లో మొక్కల వేర్లు అడుగున ఉన్న రౌండ్‌ గ్రోబాగ్‌/ ఇటుకల మడిలోని మట్టి లోపలికి కూడా విస్తరిస్తాయి. అందువల్ల ఆ కుండీలను పెట్టిన దగ్గరి నుంచి కదిలించరు. మట్టి మార్చరు. ఆ కుండీల చుట్టూ గ్రోబాగ్‌ / ఇటుకల మడిలోని మట్టిలో కూరగాయ మొక్కలు, తీగ జాతి కూరగాయలు, ఆకుకూరలు వేస్తారు. కూరగాయ మొక్కల పంట అయిపోయిన తర్వాత ఆ మొక్కను తీసేసి.. అక్కడి మట్టి కూడా కొద్దిగా తీసి ఆ గుంతలో వంటింటి వ్యర్థాలు, ఆకులు అలములు వేసి కంపోస్టు తయారయ్యేలా చూస్తారు. అంతే. ప్రతి 15 రోజులకో, నెలకో కంపోస్టు ఎరువు వేయాల్సిన అవసరం లేదంటారు సీనియర్‌ మోస్ట్‌ సిటీ ఫార్మర్‌ నూర్జహాన్‌(98852 24081).  ఫొటోలు: కె. రమేశ్‌బాబు, సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement