ఇంటి పంటలకు రెండంతస్తుల పందిరి! | Farming drizzle | Sakshi
Sakshi News home page

ఇంటి పంటలకు రెండంతస్తుల పందిరి!

Published Tue, Nov 24 2015 4:58 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

ఇంటి పంటలకు రెండంతస్తుల పందిరి!

ఇంటి పంటలకు రెండంతస్తుల పందిరి!

ఒక చిత్రకారుడు శ్రద్ధతో చిత్రించిన చిత్రంలా.. ఒక శాస్త్రవేత్త లోకాన్ని మరచి పరిశోధనలో లీనమై చేసే ఆవిష్కరణలా ఆయన ఇంటిపంటలు పండించే తీరు అబ్బురపరుస్తుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డ్‌కు చెందిన  టి. వి. ఎస్. నాగేంద్రరావు గత రెండేళ్లుగా మేడ పై ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. కన్సల్టింగ్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే సమయాన్ని సర్దుబాటు చేసుకొని ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వనరుల పునర్ వినియోగంపై ఆసక్తి, పనిలో నవ్యత, నిత్యం కొత్తగా ఆలోచించటం ఆయన్ను వృత్తి జీవితంలో అగ్రపథాన నిలిపాయి. అవే సూత్రాలను అన్వయిస్తూ తన దైన శైలిలో ఆయన ఇంటిపంటలు సాగు చేస్తున్నారు

 రెండు కుండీల్లో ఆకు కూరలతో ప్రారంభించి.. ప్రస్తుతం మూడడుగుల వ్యాసార్థం గల 11 సిల్ఫాలిన్ బ్యాగ్‌లు, మట్టి కుండీల్లో వివిధ రకాల ఇంటిపంటలు పండిస్తున్నారు. కొత్తిమీర, తోటకూర, లెట్యూస్ వంటి ఆకుకూరలు, సొర, నేతిబీర, పొట్ల, పిచ్చుక పొట్ల కాయ వంటి తీగ జాతి కూరగాయలు. వంకాయ, టమాటా, బెండ, చిక్కుడు వంటి కూరగాయలతోపాటు దోమలకు సహజ వికర్షకంగా పనిచేసే నిమ్మగడ్డిని పెంచుతున్నారు.

 శాశ్వతంగా ఉండేలా పక్కాగా పందిరిని ఏర్పాటు చేసుకుంటే తీగజాతి మొక్కలు పెంచటం సులభం అంటారాయన. అటువంటి పందిరి సాయంతో పాదులు ఎక్కువ రోజులు కాపునివ్వటంతో పాటు అధిక దిగుబడినిస్తాయంటారాయన. రూ. ఆరు వేలు ఖర్చు చేసి (10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు) ఇనుప కడ్డీలు, బద్దెలతో మేడపైన ఇనుప ఊచలతో పందిరి నిర్మించారు. కర్రలతో ఒక పందిరి, దానిపై రెండడుగుల ఎత్తులో ఇనుప బద్దెలతో మరో పందిరిని రెండంతస్తులుగా నిర్మించటం విశేషం. తీగెలను రెండో అరపైకి పాకించటం వల్ల దిగుబడి పెరిగిందని ఆయన చెప్పారు.

 తుంపర సేద్యం..
 వేసవి ఎండల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు స్ప్రింక్లర్లను ఉపయోగించి నీటిని తుంపరలుగా చల్లేలా ఏర్పాటు చేశారు. వాటర్ ప్యూరిఫైయర్‌లో ఉండే విడి భాగాలను ఉపయోగించి ఆయన స్వంతగా దీన్ని తయారు చేశారు.  ప్రస్తుతం రోజుకో సారి మొక్కలకు నీటిని అందిస్తున్నారు. ఆరు సిమెంటు సంచుల మట్టి (ఇంటి పునాదులు తవ్వేటప్పుడు వచ్చేది), చివికిన పశువుల ఎరువు 2 సంచులు, వర్మీ కంపోస్ట్ 2 సంచులు, కొబ్బరి పొట్టు 10 కిలోలు, వేపపిండి 2 కిలోలను కలిపి తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని మొక్కల పెంపకంలో వాడుతున్నారు. కొబ్బరిపొట్టు వాడకం వల్ల మట్టి మిశ్రమం మెత్తగా ఉండి లోపలి పొరలు వదులవుతాయి. దీంతో  మొక్కల వేర్లు సులభంగా మట్టిలోకి దిగి గాలి, పోషకాలను గ్ర హించటం వీలవుతుంది.

 ఒకే కుండీలో.. ఆకుకూరలు, కాయగూరలు
 అన్ని కుండీల్లో తీగ జాతి కూరగాయలు, ఆకుకూరల మొక్కలను కలిపి పెంచుతున్నారు. సిల్ఫాలిన్ సంచుల్లో ఒక అంచున తీగజాతి కూరగాయ మొక్కలు పెంచి పందిరి పైకి పాకిస్తున్నారు. మిగిలిన భాగంలో ఆకు కూరలు పెంచుతున్నారు. దీనివల్ల పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ తగ్గి దిగుబడి పెరుగుతుందని ఆయన చెప్పారు.

  నెలకో సారి ఎండు పేడను, వర్మీకంపోస్ట్‌ను  పొడిగా చేసి మొక్కల పాదుల్లో వేస్తారు. ఉద్యాన శాఖ వారు అందించే ద్రవరూప ఎరువులను మొక్కలపై 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. వేప నూనె పిచికారీ చేసి గొంగళి పురుగును నివారించారు. ఇంటిపంటల పెంపకంలో వచ్చే సందేహాల నివృత్తి, సల హాల కోసం వాట్సప్ (83744 50023)లో ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తారు.

 బిల్డింగ్ నిర్మాణంలో పునాదులు తవ్వేటప్పుడు లభించే మట్టి, చెట్లు నరికేటప్పుడు దొరికే కర్రలు తెచ్చి దాచి అవసరమైనప్పుడు వాడుతున్నారు. మేడ కింది భాగంలో చూట్టూ ఉన్న కొద్ది స్థలంలోను వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. లాన్‌లో గడ్డికి బదులు పుదీనాను సాగు చేస్తున్నారు.

 ఇనుప బద్దెలతో తయారు చేసిన అరను గోడకి ఏర్పాటు చేసి మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ డబ్బాలను అందులో అమర్చి తక్కువ స్థలంలోనే రకరకాల అలంకార  మొక్కలను పెంచుతున్నారు. కుండీలకు రంధ్రాలు ఏర్పాటు చేసి పై కుండీల్లో పోసిన నీరే అడుగున ఉన్న వాటి లోకి దిగేలా ఏర్పాటు చేయటం విశేషం.

 నలుగురు సభ్యులు గల తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు ఉంచుకొని మిగిలినవి స్నేహితులకు పంచుతున్నారు. వాటి రుచికి మెచ్చి ఐదారుగురు స్నేహితులు ఇంటి పంటలు పెంచుతున్నారని ఆయన (్చజ్టఠఝఝ్చ్చ ఃజఝ్చజీ.ఛిౌఝ) సంతోషంగా చెప్పారు. కొత్తవారికి కుండీల్లో ఇంటిపంటలు సాగు ఇబ్బందిగా ఉంటుందని... పెద్ద సిల్ఫాలిన్ సంచుల్లో ఆకుకూరలు సులువుగా పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.
 - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్
 
 ఇంటిపంటలకు తులసి వైద్యం!

 మంగళూరుకు చెందిన బ్లేనీ బీ డిసౌజా దశాబ్ద కాలంగా ఇంటిపంటలను సాగు చేస్తున్నాడు. గత ఆరేళ్లుగా తమకుటుంబానికి సరిపడా కూరగాయలను మార్కెట్లో కొనకుండానే ఇంటిపంటల ద్వారానే పండించుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇంటిపంటల్లో ఆయన చేసిన ఓ ప్రయోగం ఆశ్చర్యకరమైన ఫలితాన్నిచ్చింది. మొక్కలను ఆశించే చీడపీడలను నివారించేందుకు గతంలో దోమల ఎరలను  ఏర్పాటు చేసేవారు. అయితే అవేవీ అనుకున్నంతగా సత్ఫలితాన్నివ్వలేదు. నలైభై రోజుల క్రితం తులసి మొక్కలను ఉంచిన కుండీలను ఇంటిపంటలు పెంచే చోట ఉంచారు.

ఆశ్చర్యకరంగా చీడపీడల ఉధృతి పూర్తిగా తగ్గిపోయిందని ఆయన తెలిపారు. మొత్తం 1200 చ. అ. విస్తీర్ణంలో ఇంటిపంటలు పెంచుతుండగా తులసి మొక్కలుంచిన ఆరు కుండీలను అక్కడక్కడా ఉంచారు. ఆశ్చర్యకరంగా అప్పటి నుంచి క్రమంగా మొక్కలపై చీడపీడల దాడి తగ్గిపోవటం గమనించారు. దీంతో పాటు ఎటువంటి సేంద్రియ, రసాయన కీటక నాశనలను పిచికారీ చేయకపోయినా చీడపీడల బెడద తగ్గటంతో.. దీనికి కారణం తులసి మొక్కలేనని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. దోమ లార్వాలను తులసి నియంత్రించగలదని పరిశోధనల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement