Dandela krishna
-
పారిశ్రామిక కృషీవలుడు
మన దిగ్గజాలు కొందరు మాత్రమే కొన్ని రకాల వ్యాపారాలను చేయగలరు. సంక్లిష్టతలకు, ఒడిదుడుకులకు నెలవైన వ్యవసాయ పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టాలంటే ఎంతో తెగువ ఉండాలి. అంతేకాదు, నేల మీద, నేలనే నమ్ముకుని ఆరుగాలం శ్రమించే రైతన్నల మీద ఎంతో మమకారం కూడా ఉండాలి. ఆహార పరిశ్రమ రంగంలో భారత ప్రతినిధిగా కొమ్ములు తిరిగిన అంతర్జాతీయ సంస్థలకు సవాలు విసిరినా, కేవలం రూ.7 వేల పెట్టుబడితో మొదలుపెట్టిన వ్యాపార సామ్రాజ్యాన్ని రూ.7 వేల కోట్లకు విస్తరించినా... అది భవర్లాల్ హీరాలాల్ జైన్‌కు మాత్రమే సాధ్యమైంది. భారత ఆహార పరిశ్రమ రంగంలో ఆయన సృష్టించిన చరిత్ర చిరస్మరణీయం. నిత్యకృషీవలుడి నేపథ్యం నిత్యకృషీవలుడైన భవర్లాల్ హీరాలాల్ జైన్ 1937 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా వాకోడ్ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు హీరాలాల్ సాగర్మల్ జైన్, గౌరీ హీరాలాల్ జైన్. వారిది వ్యవసాయ నేపథ్యం గల మార్వాడీ జైన కుటుంబం. వీరి పూర్వీకులు రాజస్థాన్ నుంచి మహారాష్ట్రకు వలస వచ్చారు. భారతదేశంలో మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీ పరిశ్రమకు ఆద్యుడు భవర్లాల్. ఆయన స్థాపించిన జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ (జేఐఎస్ఎల్) మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పరిశ్రమగా గుర్తింపు సాధించింది. సివిల్స్‌ను త్యజించి... సాగును ప్రేమించి... భవర్లాల్ 23 ఏళ్ల వయసులోనే బీకామ్, ఎల్ఎల్బీ డిగ్రీలను పూర్తి చేశారు. లా కోర్సు పూర్తిచేసిన వెంటనే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లోనూ నెగ్గారు. అయితే, వ్యవసాయంపై గల ప్రేమతో ఆయన సివిల్స్ కొలువును తృణప్రాయంగా త్యజించారు. తొలుత వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నా, ఇంటికి పెద్ద కొడుకు కావడంతో కుటుంబ వ్యాపార బాధ్యతలను కూడా భుజాన వేసుకోక తప్పలేదు. వ్యాపారంలోకి ప్రవేశించిన తొలి రోజుల్లో ఆయన తోపుడు బండిపై వీధుల్లో కిరోసిన్‌ను అమ్మేవారు. 1972లో కేవలం రూ.7 వేల పెట్టుబడితో వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ట్రాక్టర్లు, పీవీసీ పైపులు, స్ప్రింక్లర్ సిస్టమ్స్ వంటి వ్యవసాయ పరికరాల పంపిణీ వ్యాపారం కొనసాగించడం వల్ల ఆయనకు వ్యవసాయ రంగంపై అవగాహన మరింత విస్తృతమైంది. వ్యవసాయ రంగానికి తన వంతుగా మరింతగా ఏదైనా చేయాలని ఆలోచించేవారు. నిరంతర అధ్యయనం సాగించేవారు. అరటిపొడి కర్మగారంతో అరంగ్రేటం.. అప్పులో కూరుకుపోయిన అరటిపొడి కర్మాగారాన్ని 1978లో కొనుగోలు చేసి పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టారు. దానిని లాభాల బాట పట్టించారు. ఆ తర్వాత రెండేళ్లకే 350 టన్నుల వార్షిక సామర్థ్యం గల పీవీసీ పైపుల కర్మాగారాన్ని స్థాపించారు. దాని సామర్థ్యాన్ని 1997 నాటికి 35 వేల టన్నులకు పెంచారు. డ్రిప్ ఇరిగేషన్‌పై రైతుల్లో అవగాహన కల్పించేందుకు 1987-88లో ఏకంగా వెయ్యి ఎకరాల్లో ఒక ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపించారు. దీనికోసం కాందేష్ ప్రాంతంలో జల్గావ్-పచోరా రోడ్డు మార్గంలో కొండలు, తుప్పలతో నిండిన బంజరు భూమిని కొనుగోలు చేసి, దానిని చదును చేసి వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దారు. తర్వాతి కాలంలో ఇక్కడ జైన్ అగ్రిపార్క్, జైన్ ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసి ఆహార పంటలలో కొత్త ప్రయోగాలకు ఊతమిచ్చారు. తెగుళ్లను తట్టుకుని, అధిక దిగుబడులను ఇచ్చే టిష్యూ కల్చర్ అరటి రకం గ్రాండ్ నైన్‌ను అందించిన ఘనత భవన్లాల్కే దక్కుతుంది. ఆయన స్థాపించిన జైఐఎస్ఎల్ ప్రస్తుతం సేంద్రియ ఎరువులు, సోలార్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరికరాలు వంటివి తయారు చేస్తోంది. పండ్లు కూరగాయల ప్రాసెసింగ్‌లో ఇది దేశంలోనే అతి పెద్ద కంపెనీ. అంతేకాదు, ఈ కంపెనీ ఉల్లి ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఆయన నెలకొల్పిన ఈ వ్యవసాయ క్షేత్ర ప్రాంతం ఇప్పుడు జైన్ హిల్స్, జైన్ వ్యాలీగా ప్రసిద్ధి పొందింది. గాంధీ మార్గంలో... మహాత్మాగాంధీపై అపార గౌరవం గల భవర్లాల్, గాంధీ సిద్ధాంతాలపై అధ్యయనం కోసం 2012లో గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. ఇందులోనే గాంధీజీకి చెందిన వస్తువులతో మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. భవర్లాల్ అండ్ కాంతాబాయ్ జైన్ మల్టీపర్పస్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, గ్రామీణాభివృద్ధి, విద్యా రంగాల్లో పలు సేవా కార్యక్రమాలకు ఊతమిచ్చారు. 2007లో ఆయన స్థాపించిన ‘అనుభూతి’ స్కూల్ ‘గ్రీన్ స్కూల్’ అవార్డు సాధించింది. ఇంగ్లిష్, మరాఠీ భాషలలో ఆయన రచించిన పలు పుస్తకాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఆధునిక నీటిపారుదల పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు గుర్తింపుగా భవర్‌లాల్‌కు 1997లో అమెరికా ఇరిగేషన్ అసోసియేషన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రాఫోరైడ్ మెమోరియల్ పురస్కారం దక్కింది. రైతుల ముంగిట్లోకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చేందుకు అహరహం శ్రమించిన ఈ నిత్యకృషీవలుడు 2016 ఫిబ్రవరి 25న కన్నుమూశారు. - దండేల కృష్ణ -
సునాయాసంగా సొంత పంటలు..!
సొంత ఊరును వదలి మహానగరానికి వచ్చినా ఆమెకు మొక్కలపై మమకారం తగ్గలేదు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలోని మల్లికార్జున్‌నగర్‌కు చెందిన గృహిణి గంధం భారతి తమ ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలతోపాటు కొన్ని రకాల పండ్లను సేంద్రియ పద్ధతుల్లో పండించుకుంటున్నారు. ఆమెకున్న ఆసక్తికి పశుసంవర్థక శాఖలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న భర్త డా. దుర్గయ్య ప్రోత్సాహం తోడైంది. మేడపైనే వందకు పైగా కుండీల్లో సునాయాసంగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. సిల్పాలిన్ బెడ్స్, మట్టి కుండీలు, థర్మకోల్ బాక్స్‌లు, ప్లాస్టిక్ డబ్బాలను మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, బెండ, వంగ, టమాట వంటి కాయగూరలు, బీర, కాకర, సొర, దోస వంటి తీగజాతి కూరగాయలు పండిస్తున్నారు. దానిమ్మ, నిమ్మ వంటి కొన్ని పండ్ల మొక్కలను సైతం మేడపైనే పెంచుతున్నారు. బొప్పాయి, మునగ చెట్లను పెరట్లో పెంచుతున్నారు. మేడ మీద పొడవైన సిమెంట్ తొట్టెను నిర్మించారు. స్లాబు కిందకు చెమ్మ దిగకుండా ప్లాస్టిక్ షీట్ పరిచారు. ఎర్రమట్టి, పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని వేసి కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త మట్టి మిశ్రమాన్ని కలుపుతున్నారు. తీగజాతి కూరగాయ మొక్కలు పెంచేందుకు ఇనుప వైర్‌తో మేడ మీద ఒక మూలన పందిరి ఏర్పాటు చేశారు. నలుగురున్న తమ కుటుంబానికి సరిపడా ఆకుకూరలను... వారంలో ఐదు రోజులకు సరిపడా కాయగూరలను ఇంటిపంటల ద్వారానే పండించుకుంటున్నామని భారతి తెలిపారు. ఉల్లిపాయ పొట్టు, రెండు గుప్పిళ్లు వేపాకు, రెండు చిటెకెల పసుపును నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టిన మిశ్రమాన్ని మొక్కలపై పిచికారీ చేసి.. చీడపీడలను నివారిస్తున్నారు. కూరగాయ వ్యర్థాలు, ఎండిన ఆకులను మొక్కల పాదుల్లో ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ఆ బలంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయని, సంతృప్తికరంగా ఆరోగ్యదాయకమైన దిగుబడినిస్తున్నాయని ఆమె చెప్పారు. తన అభిరుచికి తగిన కొన్ని పూలమొక్కలను సైతం పెంచుతున్నారు. ఇంటిపంటలు, పూల మొక్కల మధ్య ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటున్నదని భారతి (89788 89440) చెప్పారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్; ఫొటోలు: సోమ సుభాష్ -
ఇంటి పంటలకు రెండంతస్తుల పందిరి!
ఒక చిత్రకారుడు శ్రద్ధతో చిత్రించిన చిత్రంలా.. ఒక శాస్త్రవేత్త లోకాన్ని మరచి పరిశోధనలో లీనమై చేసే ఆవిష్కరణలా ఆయన ఇంటిపంటలు పండించే తీరు అబ్బురపరుస్తుంది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్‌కు చెందిన టి. వి. ఎస్. నాగేంద్రరావు గత రెండేళ్లుగా మేడ పై ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. కన్సల్టింగ్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే సమయాన్ని సర్దుబాటు చేసుకొని ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వనరుల పునర్ వినియోగంపై ఆసక్తి, పనిలో నవ్యత, నిత్యం కొత్తగా ఆలోచించటం ఆయన్ను వృత్తి జీవితంలో అగ్రపథాన నిలిపాయి. అవే సూత్రాలను అన్వయిస్తూ తన దైన శైలిలో ఆయన ఇంటిపంటలు సాగు చేస్తున్నారు రెండు కుండీల్లో ఆకు కూరలతో ప్రారంభించి.. ప్రస్తుతం మూడడుగుల వ్యాసార్థం గల 11 సిల్ఫాలిన్ బ్యాగ్‌లు, మట్టి కుండీల్లో వివిధ రకాల ఇంటిపంటలు పండిస్తున్నారు. కొత్తిమీర, తోటకూర, లెట్యూస్ వంటి ఆకుకూరలు, సొర, నేతిబీర, పొట్ల, పిచ్చుక పొట్ల కాయ వంటి తీగ జాతి కూరగాయలు. వంకాయ, టమాటా, బెండ, చిక్కుడు వంటి కూరగాయలతోపాటు దోమలకు సహజ వికర్షకంగా పనిచేసే నిమ్మగడ్డిని పెంచుతున్నారు. శాశ్వతంగా ఉండేలా పక్కాగా పందిరిని ఏర్పాటు చేసుకుంటే తీగజాతి మొక్కలు పెంచటం సులభం అంటారాయన. అటువంటి పందిరి సాయంతో పాదులు ఎక్కువ రోజులు కాపునివ్వటంతో పాటు అధిక దిగుబడినిస్తాయంటారాయన. రూ. ఆరు వేలు ఖర్చు చేసి (10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు) ఇనుప కడ్డీలు, బద్దెలతో మేడపైన ఇనుప ఊచలతో పందిరి నిర్మించారు. కర్రలతో ఒక పందిరి, దానిపై రెండడుగుల ఎత్తులో ఇనుప బద్దెలతో మరో పందిరిని రెండంతస్తులుగా నిర్మించటం విశేషం. తీగెలను రెండో అరపైకి పాకించటం వల్ల దిగుబడి పెరిగిందని ఆయన చెప్పారు. తుంపర సేద్యం.. వేసవి ఎండల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు స్ప్రింక్లర్లను ఉపయోగించి నీటిని తుంపరలుగా చల్లేలా ఏర్పాటు చేశారు. వాటర్ ప్యూరిఫైయర్‌లో ఉండే విడి భాగాలను ఉపయోగించి ఆయన స్వంతగా దీన్ని తయారు చేశారు. ప్రస్తుతం రోజుకో సారి మొక్కలకు నీటిని అందిస్తున్నారు. ఆరు సిమెంటు సంచుల మట్టి (ఇంటి పునాదులు తవ్వేటప్పుడు వచ్చేది), చివికిన పశువుల ఎరువు 2 సంచులు, వర్మీ కంపోస్ట్ 2 సంచులు, కొబ్బరి పొట్టు 10 కిలోలు, వేపపిండి 2 కిలోలను కలిపి తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని మొక్కల పెంపకంలో వాడుతున్నారు. కొబ్బరిపొట్టు వాడకం వల్ల మట్టి మిశ్రమం మెత్తగా ఉండి లోపలి పొరలు వదులవుతాయి. దీంతో మొక్కల వేర్లు సులభంగా మట్టిలోకి దిగి గాలి, పోషకాలను గ్ర హించటం వీలవుతుంది. ఒకే కుండీలో.. ఆకుకూరలు, కాయగూరలు అన్ని కుండీల్లో తీగ జాతి కూరగాయలు, ఆకుకూరల మొక్కలను కలిపి పెంచుతున్నారు. సిల్ఫాలిన్ సంచుల్లో ఒక అంచున తీగజాతి కూరగాయ మొక్కలు పెంచి పందిరి పైకి పాకిస్తున్నారు. మిగిలిన భాగంలో ఆకు కూరలు పెంచుతున్నారు. దీనివల్ల పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ తగ్గి దిగుబడి పెరుగుతుందని ఆయన చెప్పారు. నెలకో సారి ఎండు పేడను, వర్మీకంపోస్ట్‌ను పొడిగా చేసి మొక్కల పాదుల్లో వేస్తారు. ఉద్యాన శాఖ వారు అందించే ద్రవరూప ఎరువులను మొక్కలపై 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. వేప నూనె పిచికారీ చేసి గొంగళి పురుగును నివారించారు. ఇంటిపంటల పెంపకంలో వచ్చే సందేహాల నివృత్తి, సల హాల కోసం వాట్సప్ (83744 50023)లో ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తారు. బిల్డింగ్ నిర్మాణంలో పునాదులు తవ్వేటప్పుడు లభించే మట్టి, చెట్లు నరికేటప్పుడు దొరికే కర్రలు తెచ్చి దాచి అవసరమైనప్పుడు వాడుతున్నారు. మేడ కింది భాగంలో చూట్టూ ఉన్న కొద్ది స్థలంలోను వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. లాన్లో గడ్డికి బదులు పుదీనాను సాగు చేస్తున్నారు. ఇనుప బద్దెలతో తయారు చేసిన అరను గోడకి ఏర్పాటు చేసి మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ డబ్బాలను అందులో అమర్చి తక్కువ స్థలంలోనే రకరకాల అలంకార మొక్కలను పెంచుతున్నారు. కుండీలకు రంధ్రాలు ఏర్పాటు చేసి పై కుండీల్లో పోసిన నీరే అడుగున ఉన్న వాటి లోకి దిగేలా ఏర్పాటు చేయటం విశేషం. నలుగురు సభ్యులు గల తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు ఉంచుకొని మిగిలినవి స్నేహితులకు పంచుతున్నారు. వాటి రుచికి మెచ్చి ఐదారుగురు స్నేహితులు ఇంటి పంటలు పెంచుతున్నారని ఆయన (్చజ్టఠఝఝ్చ్చ ఃజఝ్చజీ.ఛిౌఝ) సంతోషంగా చెప్పారు. కొత్తవారికి కుండీల్లో ఇంటిపంటలు సాగు ఇబ్బందిగా ఉంటుందని... పెద్ద సిల్ఫాలిన్ సంచుల్లో ఆకుకూరలు సులువుగా పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ ఇంటిపంటలకు తులసి వైద్యం! మంగళూరుకు చెందిన బ్లేనీ బీ డిసౌజా దశాబ్ద కాలంగా ఇంటిపంటలను సాగు చేస్తున్నాడు. గత ఆరేళ్లుగా తమకుటుంబానికి సరిపడా కూరగాయలను మార్కెట్లో కొనకుండానే ఇంటిపంటల ద్వారానే పండించుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇంటిపంటల్లో ఆయన చేసిన ఓ ప్రయోగం ఆశ్చర్యకరమైన ఫలితాన్నిచ్చింది. మొక్కలను ఆశించే చీడపీడలను నివారించేందుకు గతంలో దోమల ఎరలను ఏర్పాటు చేసేవారు. అయితే అవేవీ అనుకున్నంతగా సత్ఫలితాన్నివ్వలేదు. నలైభై రోజుల క్రితం తులసి మొక్కలను ఉంచిన కుండీలను ఇంటిపంటలు పెంచే చోట ఉంచారు. ఆశ్చర్యకరంగా చీడపీడల ఉధృతి పూర్తిగా తగ్గిపోయిందని ఆయన తెలిపారు. మొత్తం 1200 చ. అ. విస్తీర్ణంలో ఇంటిపంటలు పెంచుతుండగా తులసి మొక్కలుంచిన ఆరు కుండీలను అక్కడక్కడా ఉంచారు. ఆశ్చర్యకరంగా అప్పటి నుంచి క్రమంగా మొక్కలపై చీడపీడల దాడి తగ్గిపోవటం గమనించారు. దీంతో పాటు ఎటువంటి సేంద్రియ, రసాయన కీటక నాశనలను పిచికారీ చేయకపోయినా చీడపీడల బెడద తగ్గటంతో.. దీనికి కారణం తులసి మొక్కలేనని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. దోమ లార్వాలను తులసి నియంత్రించగలదని పరిశోధనల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. -
మిత్రపురుగులతో తెల్లదోమకు చెక్!
పంటలను కాపాడిన మహిళా రైతుల నైపుణ్యం పంజాబ్‌లోని భటిండా ప్రాంతానికి చెందిన పత్తి రైతులను తెల్లదోమ ఈ ఏడాది తీవ్రంగా నష్టపరిచింది. వేలాది ఎకరాల్లో పంట తుడిచి పెట్టుకు పోవడంతో రైతులు కుదేలయ్యారు. 200 మందికి పైగా పంజాబ్ పత్తి రైతులు ఆత్మహత్యల పాలయ్యారంటే తెల్లదోమ దెబ్బ ఎంత విధ్వంసకరంగా పరిణమించిందో అర్థం చేసుకోవచ్చు. శక్తివంతమైన రసాయనిక పురుగుమందులకూ తెల్లదోమ లొంగలేదు. తెల్లదోమ నష్టానికి గురైన ప్రతి ఎకరానికి రూ. 50 వేల మేరకు పరిహారం ఇవ్వాలంటూ పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు.. అయితే.. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నప్పటికీ తెల్లదోమ దెబ్బకు తల్లడిల్లని కొన్ని గ్రామాలు వ్యవసాయ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. హర్యానా లోని జింద్ జిల్లాలో నిధానా, లలిత్ ఖేరా అనేవి చిన్న గ్రామాలు. అక్కడి రైతులకు తెల్లదోమ అసలు సమస్య కానే కాదు. రసాయనిక పురుగుమందుల పిచికారీని చాలా ఏళ్ల క్రితమే నిలిపివే సి.. వాటికి బదులు మిత్ర పురుగులను ఉపయోగిస్తుండడమే ఇందుకు కారణం. తెల్లదోమకు సహజ శత్రువులైన కీటకాలను ఇళ్ల దగ్గర పెంచి, పొలాల్లో వదలటం ద్వారా తె ల్లదోమను కట్టడి చేయగలుగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడి రైతులు మిత్రపురుగులతో స్నేహం చేసే కళను గత కొన్నేళ్లుగా ఒంటబట్టించుకున్నారు. హర్యానాలోని సిర్సా జిల్లాలో 70, భీవానిలో 10 ఎకరాల్లో, రోహ్తక్ జిల్లాలోని 10 ఎకరాల్లో, పంజాబ్‌లోని మన్సా జిల్లాలో 62 ఎకరాల్లో, భటిండా జిల్లాలోని మరికొందరు రైతులు కూడా రసాయన రహిత పద్ధతుల్లో రసంపీల్చే పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ఈ ప్రాంతంలో మిత్రపురుగుల వినియోగం పెరగడానికి కీ. శే. సురేంద్ర దలాల్ కృషే కారణం. ఆయన హర్యానా వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా పనిచేశారు. 150 మంది రైతులకు అప్పట్లో ఆయన సమగ్ర శిక్షణ నిచ్చారు. ఇందులో ఎక్కువ మంది మహిళా రైతులే. శత్రుపురుగులను గుర్తించటం, వాటిపై మిత్ర కీటకాలను ప్రయోగించటంలో వీరు సుశిక్షితులయ్యారు. కొంచెం చదువునేర్చిన మహిళలు, నిరక్షరాస్య మహిళా రైతులు సైతం తెల్లదోమను నియంత్రించటంలో పైచేయి సాధించారు. జాతీయ సమీకృత చీడపీడల నివారణ సంస్థ (న్యూఢిల్లీ) ఈ పద్ధతులను పరిశీలించి ఆమోద ముద్ర వేసింది కూడా. ఈ నిధాన ప్రాంతంలో రైతులు అనుసరిస్తున్న నమూనాని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాలని జిస్టిస్ ఎస్. ఎన్. అగర్వాల్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. స్థానికంగా ఇనో, ఈరో అని పిలిచే రెండు కీటకాలను వారు తెల్లదోమపైకి ప్రయోగించి మట్టుబెడుతున్నారు. ఈ పద్ధతినే ఇక్కడి రైతులందరూ అనుసరిస్తున్నారు. ఒక్క మిత్ర పురుగు 100 శత్రు కీటకాలను మట్టుపెడుతుంది. ఈ మిత్ర కీటకాలు పంటకు హాని చేసే ఇతర కీటకాలను కూడా తినేస్తాయి. 170 రకాల కీటకాల గురించి ఇక్కడి మహిళా రైతులకు తెలుసు. ఈ ఒక్క విషయం చాలు ఇక్కడి మహిళా రైతుల నేర్పరితనం ఏపాటిదో అర్థం చేసుకోవటానికి అంటారు ప్రముఖ వ్యవసాయ రచయిత దేవిందర్ శర్మ. వీళ్ల దగ్గర్నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు నేర్చుకునే ప్రయత్నం చేయకపోవటం సిగ్గుపడాల్సిన విషయమని అభివర్ణించారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్