సునాయాసంగా సొంత పంటలు..!
సొంత ఊరును వదలి మహానగరానికి వచ్చినా ఆమెకు మొక్కలపై మమకారం తగ్గలేదు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలోని మల్లికార్జున్‌నగర్‌కు చెందిన గృహిణి గంధం భారతి తమ ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలతోపాటు కొన్ని రకాల పండ్లను సేంద్రియ పద్ధతుల్లో పండించుకుంటున్నారు. ఆమెకున్న ఆసక్తికి పశుసంవర్థక శాఖలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న భర్త డా. దుర్గయ్య ప్రోత్సాహం తోడైంది. మేడపైనే వందకు పైగా కుండీల్లో సునాయాసంగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. సిల్పాలిన్ బెడ్స్, మట్టి కుండీలు, థర్మకోల్ బాక్స్‌లు, ప్లాస్టిక్ డబ్బాలను మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, బెండ, వంగ, టమాట వంటి కాయగూరలు, బీర, కాకర, సొర, దోస వంటి తీగజాతి కూరగాయలు పండిస్తున్నారు. దానిమ్మ, నిమ్మ వంటి కొన్ని పండ్ల మొక్కలను సైతం మేడపైనే పెంచుతున్నారు. బొప్పాయి, మునగ చెట్లను పెరట్లో పెంచుతున్నారు.
మేడ మీద పొడవైన సిమెంట్ తొట్టెను నిర్మించారు. స్లాబు కిందకు చెమ్మ దిగకుండా ప్లాస్టిక్ షీట్ పరిచారు. ఎర్రమట్టి, పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని వేసి కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త మట్టి మిశ్రమాన్ని కలుపుతున్నారు. తీగజాతి కూరగాయ మొక్కలు పెంచేందుకు ఇనుప వైర్‌తో మేడ మీద ఒక మూలన పందిరి ఏర్పాటు చేశారు.
నలుగురున్న తమ కుటుంబానికి సరిపడా ఆకుకూరలను... వారంలో ఐదు రోజులకు సరిపడా కాయగూరలను ఇంటిపంటల ద్వారానే పండించుకుంటున్నామని భారతి తెలిపారు. ఉల్లిపాయ పొట్టు, రెండు గుప్పిళ్లు వేపాకు, రెండు చిటెకెల పసుపును నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టిన మిశ్రమాన్ని మొక్కలపై పిచికారీ చేసి.. చీడపీడలను నివారిస్తున్నారు. కూరగాయ వ్యర్థాలు, ఎండిన ఆకులను మొక్కల పాదుల్లో ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ఆ బలంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయని, సంతృప్తికరంగా ఆరోగ్యదాయకమైన దిగుబడినిస్తున్నాయని ఆమె చెప్పారు. తన అభిరుచికి తగిన కొన్ని పూలమొక్కలను సైతం పెంచుతున్నారు. ఇంటిపంటలు, పూల మొక్కల మధ్య ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటున్నదని భారతి (89788 89440) చెప్పారు.
- దండేల కృష్ణ, సాగుబడి డెస్క్; ఫొటోలు: సోమ సుభాష్