కరువులోనూ పస్తు పెట్టవు! | Domestic rice strains | Sakshi
Sakshi News home page

కరువులోనూ పస్తు పెట్టవు!

Published Tue, May 23 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

కరువులోనూ పస్తు పెట్టవు!

కరువులోనూ పస్తు పెట్టవు!

దేశీ వరి వంగ‘డాలు’

- ఇదీ తమిళనాడులో ప్రకృతి వ్యవసాయదారుల అనుభవం
- కరువును తట్టుకొని మోస్తరు దిగుబడినిచ్చిన దేశీ వరి వంగడాలు
- 182 రకాల దేశీ వరి వంగడాలను పరిరక్షిస్తున్న ‘సేవ్‌ అవర్‌ రైస్‌’ ఉద్యమం
- జూన్‌ 17–18 తేదీల్లో తిరుత్తరైపూండిలో దేశీ వరి విత్తనోత్సవం


కనికరం లేని కరువు తమిళనాడు రైతులపై పగబట్టింది. లేకపోతే మరేమిటి? 149 ఏళ్ల నాడు మాదిరిగా కటిక కరువు బారిన పడి పంటలు పండక తమిళ రైతులు విలవిల్లాడుతున్నారు. గత ఏడాది పంటల కాలంలో కేవలం 4 జల్లులు పడ్డాయి. బోర్లున్న రైతుల పరిస్థితి కూడా నీటి లభ్యత తగ్గిపోవడంతో వ్యవసాయం కుంటుపడిపోయింది. రసాయనిక పద్ధతుల్లో వర్షాధారంగా వరి సాగు చేసిన రైతుల పొలాలు మాత్రం పూర్తిగా ఎండిపోయాయి. అయితే, సేంద్రియ వ్యవసాయ దిగ్గజం కీర్తిశేషులు డాక్టర్‌ నమ్మాళ్వార్‌ చూపిన బాటలో నడుస్తున్న రైతులు మాత్రం ఆ నాలుగు చినుకులతోనే ఒక మోస్తరు దిగుబడులు పొందారు. ప్రకృతికి అనుగుణమైన సేద్య పద్ధతులను అనుసరించడంతోపాటు సంప్రదాయ దేశీ వరి వంగడాలను నమ్ముకోవడమే వీరి విజయరహస్యం.

నమ్మాళ్వార్‌ అనుంగు శిష్యుడైన జయరామన్‌ 18 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అపురూపమైన, ఔషధ గుణాలతో కూడిన దేశీ వరి వంగడాలను పునర్వినియోగంలోకి తెచ్చిన ఘనుడాయన. అందుకే నమ్మాళ్వార్‌ ఆయనను ప్రేమగా ‘నెల్‌ జయరామన్‌’ అని పిలిచారు (నెల్‌ అంటే తమిళంలో వరి అని అర్థం). ‘సేవ్‌ అవర్‌ రైస్‌’ సంస్థకు రాష్ట్ర సారధిగా ఉన్న ఆయన పేరు ఆ విధంగా ‘నెల్‌ జయరామన్‌’గా మారిపోయింది. బెంగళూరులో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమంలో ప్రకృతి వ్యవసాయ శిఖరాగ్రసభకు ఇటీవల హాజరైన ఆయనతో ‘సాగుబడి’ ముచ్చటించింది. దేశీ వరి విత్తనాలను పరిరక్షించుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తే, కనీవినీ ఎరుగని కరువునైనా విజయవంతంగా ఎలా ఎదుర్కోవచ్చో ఆయన వివరించారు. ఆ వివరాలు పాఠకుల కోసం..

భూతాపం అమితంగా పెరిగిపోతుండడంతో వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా వరి సాగును, అస్తవ్యస్థం చేస్తున్నాయి. భూతాపోన్నతి విసురుతున్న సవాళ్లను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, జన్యుమార్పిడి హైబ్రిడ్‌ విత్తనాలతోనే ఎదుర్కోగలమన్న వాదనలు శాస్త్రవేత్తల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అయితే, తమిళనాడులో ‘సేవ్‌ అవర్‌ రైస్‌’ ఉద్యమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయదారులు మాత్రం దేశీ వరి వంగడాలతో ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నారు.

పాతిక వేల మంది రైతులతో ప్రకృతి సేద్యం
దివంగత డా. నమ్మాళ్వార్‌ ప్రధాన అనుచరుడు, ‘సేవ్‌ అవర్‌ రైస్‌’, ‘క్రియేట్‌’ సంస్థల తమిళనాడు రాష్ట్ర సమన్వయకర్త అయిన ‘నెల్‌’ జయరామన్‌ 18 ఏళ్లుగా దేశీ వరి వంగడాల పరిరక్షణోద్యమంలో విశేష కృషి చేస్తున్నారు. తిరువారూర్‌ జిల్లా తిరుత్తరైపూండి తాలూకాలోని కట్టిమేడ్‌ ఆయన స్వస్థలం.

నమ్మాళ్వార్‌ నేర్పిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను, దేశీ వరి వంగడాల పరిరక్షణను ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తున్న రైతు నేత నెల్‌ జయరామన్‌(51) రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకున్నారు. వీరి ద్వారా ప్రకృతి వ్యవసాయంపై సుమారు 30 వేల మందికి పైగా శిక్షణ పొందారు. దేశీ వరి విత్తనాలతో ప్రకృతి సేద్యాన్ని కొనసాగిస్తున్న రైతుల సంఖ్య సుమారు 25 వేల వరకు ఉంటుందన్నారు. ధాన్యాన్ని బియ్యం ఆడించి, అటుకులుగా మార్చి నేరుగా వినియోగదారులకే రైతులు అమ్ముతూ రసాయనిక వ్యవసాయం చేసే రైతులకన్నా ఎక్కువ నికరాదాయం పొందుతున్నారని తెలిపారు. అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు వచ్చిన తర్వాత కూడా దేశీ వరి విత్తనాల పరిరక్షణ అవసరం ఏమిటి? ప్రాచీన కాలం నుంచి మన వ్యవసాయ సంస్కృతి ప్రకారం.. వ్యవసాయం పరమార్థం కేవలం రైతుకు ధాన్యరాశులు కొలవడం కోసం మాత్రమే కాదు. పశువులకు తగినంత గ్రాసం అందాలి. మోళ్లు భూమిలోనే కలిసిపోయి భూసారాన్ని పెంచాలన్నది లక్ష్యం. దీన్ని అర్థం చేసుకొని ఆచరించడం ప్రకృతి వ్యవసాయదారుల కనీస బాధ్యత అని జయరామన్‌ వివరించారు.

కటిక కరువులోనూ 18 బస్తాల దిగుబడి
ఈ ఏడాది తమిళనాడులో నెలకొన్న తీవ్రమైన కరువు ప్రభావంతో రసాయనిక వ్యవసాయంలో వర్షాధారంగా వేసిన వరి పొలాలు పూర్తిగా ఎండిపోయాయి. బోర్ల కింద రసాయనిక వ్యవసాయం చేసిన రైతులకు ఎకరానికి 15 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. అయితే, కరువును తట్టుకునే దేశీ వరి రకాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వర్షాధారంగా సాగు చేసిన రైతులకు 16–18 బస్తాల (బస్తా 62 కిలోలు) వరకు దిగుబడి వచ్చిందని నెల్‌ జయరామన్‌ తెలిపారు.

60 – 90 రోజుల్లో కోతకొచ్చే దేశీ వరి రకాలు
ఈ ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన దేశీ వరి రకాలు, సాధించిన దిగుబడి వివరాలు.. అరువదంకురువై – 60 రోజులు – 15 బస్తాలు. పూంగార్‌ – 70 రోజులు – 18 బస్తాలు. కురుంకురువై – 90 రోజులు – 15 బస్తాలు. కుళ్లంగార్‌ – 90 రోజులు – 17–18 బస్తాల దిగుబడి (ఈ బియ్యం గంజి తాగితే పక్షవాతం రోగులకు ఉపశమనం కలుగుతుంది). సింగిణికార్‌ – 124 రోజులు – 17 బస్తాలు. సేలం సన్నాలు – 120 రోజలు – 19 బస్తాలు. మాపిళ్లై చాంబ – 150 రోజులు – 18 బస్తాలు (ఈ రకం పంటలో విత్తనం మొలిచేటప్పుడు తేమ ఉంటే చాలు. సాధారణంగా 6 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ ఏడాది కరువు వల్ల 4 అడుగులు పెరిగింది).  ఈ ఏడాది తమిళనాడులో వరి పంట కాలంలో కేవలం 4 సార్లు చిరు జల్లులు మాత్రం కురిశాయి. ఎకరానికి 30 కిలోల చొప్పున విత్తనాలను వెదజల్లి 17–18 బస్తాల వరకు దిగుబడి సాధించారు. వరి కోసిన తర్వాత 60 రోజుల్లో చేతికొచ్చే నాటు రకం మినుము సాగు చేశామని తెలిపారు.
– సాగుబడి డెస్క్‌

182 అపురూప దేశీ వరి వంగడాలు!
2006 నుంచి దేశీ వరి వంగడాల వ్యాప్తి కోసం జయరామన్‌ తదితర రైతు మిత్ర బృందం తిరువారూర్‌ జిల్లా తిరుత్తరైపూండిలో ‘నెల్‌ (రైస్‌) ఫెస్టివల్‌’ నిర్వహిస్తున్నారు. వందలాది విత్తనాలకు పురుడు పోసే విత్తనానికి విలువ కట్టలేం. ఈ చైతన్యం తోనే వాళ్లు విత్తనాలు అమ్మటం లేదు. విత్తనోత్సవంలో రైతుకు రకానికి రెండు కిలోల చొప్పున విత్తనాలు ఇవ్వడం, ఆ తర్వాత సంవత్సరం ఆ రైతు 4 కిలోల విత్తనాలను తెచ్చివ్వడం అన్నది నియమం. గత ఏడాది విత్తనోత్సవంలో 169 దేశీ వరి వంగడాలను 4,620 మంది రైతులకు ఇచ్చారు. 86 వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేకంగా విత్తనోత్పత్తి చేపట్టారు. సాధారణంగా మే/జూన్‌ మాసాల్లో నెల్‌ ఫెస్టివల్‌ రెండు రోజుల పాటు జరుగుతుంది. ఈ ఏడాది జూన్‌ 17–18 తేదీల్లో జరగనుంది. ఈసారి 182 రకాలను 6 వేల మంది రైతులకు ఇవ్వబోతున్నామని నెల్‌ జయరామన్‌ ‘సాగుబడి’ తో చెప్పారు. ఏ రాష్ట్రానికి చెందిన రైతులైనా ఈ విత్తనోత్సవంలో పాల్గొనవచ్చు. ఆసక్తి గల రైతులు భోజన,వసతి సదుపాయాల కోసం ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. ఇతర వివరాలకు..
నెల్‌ జయరామన్‌ – 094433 330954
శ్రీరామ్‌ రామమూర్తి – 094867 18853
svrsriram@gmail.com   www.organicwayfarm.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement