బంజరులో చెరువులు..బంగారు పంటలకు బాటలు!
ఒడిసిపట్టిన వాన నీటితో బంజరు భూముల్లో జలసిరి
- బోర్లు వేయకుండానే 120 ఎకరాల్లో వర్షాధార సమీకృత వ్యవసాయం
- 40 ఎకరాల్లో చెరువుల తవ్వకం..కురిసిన ప్రతి చినుకూ చెరువుల్లోనే..
- 50 ఆవులు, 400 గొర్రెల పెంపకం..వాటి విసర్జితాలతో చేపల పెంపకం
- 80 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు
వరంగల్ జిల్లాలోని ఆ ప్రాంతం కరువుకు నిలువెత్తు నిదర్శనం. కనుచూపు మేర కానరాని నీటి జాడ.. బీడు భూముల్లో రాతి గుట్టలు.. పశువుల మేతకు మాత్రమే పనికొచ్చే పడావు భూములు. చేయీ చేయీ కలిపి కలసికట్టుగా కదిలిన రైతుమిత్రులు కొందరు విజ్ఞతతో కదలి కరువును పారదోలారు. అవరోధాల మాటున దాగిన అపారమైన వ్యవసాయావకాశాలను ముందుచూపుతో దర్శించి, తమ కలలను నిజం చేసుకుంటున్నారు. తమ భూమిలో కొంత విస్తీర్ణంలో చెరువులు తవ్వి.. వాన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టి.. ఒక్క బోరు కూడా వేయకుండా కరువును జయించవచ్చని ఆచరణాత్మకంగా చూపిస్తున్నారు. సమష్టి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పశువులు, గొర్రెల విసర్జితాలతో చేపల పెంపకం.. ఆ చెరువుల నీటితో పంటలు సాగు చేస్తున్నారు. సమీకృత వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ రైతులను, శాస్త్రవేత్తలను సైతం ఔరా అనిపిస్తున్నారు. ఈ విలక్షణ వ్యవసాయ క్షేత్రాన్ని మల్లిఖార్జున గుప్తా నిర్వహిస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన ఆయన అనుభవాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..
పొలాల మధ్య చెరువులు తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే బంజరు భూముల్లో బంగారు పంటలు పండించుకోవచ్చని రుజువుచేస్తున్నారు తోట మల్లిఖార్జున గుప్తా. జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పాడిపంటలు, సేంద్రియ వ్యవసాయం, చేపల పెంపకాన్ని ఏకకాలంలో చేపట్టి సమీకృత సహకార వ్యవసాయ పద్ధతికి నాంది పలికారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆయన స్వగ్రామం. 2010లో మిత్రులతో కలసి దుగ్గొండి మండలం గొల్లపల్లిలో 130 ఎకరాల బంజర భూమిని కొనుగోలు చేశారు. వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. చుక్క నీరు లేని చోట వ్యవసాయం ఎలా చేస్తావనే ప్రశ్నకు సమాధానంగా స్వయంకృషి ప్రేరణా కేంద్రం నెలకొల్పి కొత్త ఒరవడికి శ్రీకారం పలికారు.
నిండుకుండలా చెరువులు..
మొత్తం 130 ఎకరాల్లోని 40 ఎకరాల్లో ఏడు చెరువులు తవ్వించారు. చెరువు లోతు 12 అడుగులు. ఎగువన వెయ్యెకరాల విస్తీర్ణంలో కురిసిన వర్షపు నీటిని నిలిపేందుకు తమ పొలంలో సిమెంటుతో ఆనకట్టను నిర్మించారు. ఆనకట్ట నుంచి భూమిలో వేసిన పైపుల ద్వారా దిగువన తవ్విన చెరువుల్లోకి నీరు వెళ్తుంది. వర్షపు నీటితో ఒకదాని వెంట మరొకటిగా చెరువులు నిండుతాయి. భూమిలో పైపులు వేసి ఈ చెరువులన్నింటినీ అనుసంధానించారు. ఇలా నిండిన చెరువుల్లోని నీటిని ఏడాదంతా ఇంజిన్లతో ఎత్తిపోస్తూ.. పొలంలోని మెరక ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి పంటలకు, తోటలకు నీరందిస్తారు. ఐదారేళ్లుగా వాన నీటి సంరక్షణ చేస్తుండడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగింది. వీరి పొలంలోనే కాకుండా పక్క రైతుల పొలాల్లోని బావులు, బోరుల్లో కూడా జలకళ ఉట్టిపడుతోంది. వ్యవసాయ క్షేత్రం అంతటా జలం ఉబికి వస్తోంది.
బిందుసేద్యంలో మిశ్రమ పంటల సాగు..
ఈ సమష్టి సహకార వ్యవసాయ క్షేత్రంలోని అన్ని పంటలకు బిందుసేద్యం పద్ధతిలోనే నీరందిస్తున్నారు. దీనికోసం 80 ఎకరాల్లో బిందు సేద్యం పరికరాలు బిగించారు. ఇక్కడ మొదట్లో చెరుకు, పత్తి, మిర్చి, పసుపు, అరటి సాగు చేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంటలతో పాటు 40 ఎకరాల్లో సుబాబుల్, 10 ఎకరాల్లో సర్వీ చెట్లను పెంచుతున్నారు. అంతరపంటలుగా సోయా, కూరగాయలు పండిస్తున్నారు. గుప్తా వ్యవసాయ క్షేత్రంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంటలను కలిపి సాగు చేస్తున్నారు. సుబాబుల్ చెట్ల ఆకులు జీవాలకు మంచి మేతగా ఉపయోగపడుతున్నాయి. రాలిన చెట్ల ఆకులు, రెమ్మలతో భూమి సారవంతమవుతోంది. సుబాబుల్ అమ్మకం ద్వారా రెండున్నరేళ్లకు ఎకరాకు రూ. 50–60 వేల ఆదాయం లభిస్తోంది. ఇంకో రెండు కత్తిరింపుల తరువాత సుబాబుల్ పైరును తొలగించి సేంద్రియ కూరగాయ పంటలను సాగు చేస్తామని గుప్తా తెలిపారు.
ఆవు పేడ, మూత్రం నేరుగా చెరువులోకి...
గుప్తా పంటల సాగులో వైవిధ్యం పాటించటంతో పాటు పాడి, చేపల పెంపకం చేపట్టారు. తొలుత 25 ఒంగోలు జాతి ఆవులను కొన్నారు. వాటి సంఖ్య ప్రస్తుతం 50కి పెరిగింది. వీటికి మేత కోసం 15 ఎకరాల్లో మొక్కజొన్న పెంచుతున్నారు. పశువుల పాకలోని పేడ, మూత్రాలను పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగించుకునేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తున్నారు. పాకలోని ఆవుల పేడ, మూత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాలువ ద్వారా చెరువులో కలుస్తాయి.
ఇలా పోషకాలు కలిగిన నీటిని ఇంజిన్లతో ఎత్తిపోతల ద్వారా పొలంలో మెరక ప్రాంతానికి తరలించి పంటలకు అందిస్తున్నారు. చెరువుల్లో డెడ్‌స్టోరేజీకి దిగువన ఉన్న నీటిని మాత్రం వినియోగించుకోకూడదన్న నియమం పెట్టుకున్నామని గుప్తా వివరించారు. ప్రతి 15 రోజులకోసారి పంటలకు అందిస్తారు. దీనివల్ల భూమి సహజపద్ధతుల్లోనే సారవంతమవుతోంది. దీంతో రసాయన ఎరువులు వాడే అవసరం తప్పింది. కొన్ని పశువులను రైతులకు అమ్మటం ద్వారా ఆదాయం పొందుతున్నారు. 400 నెల్లూరు జాతి గొర్రెలను పెంచుతున్నారు. 40 ఎకరాల్లోని ఏడు చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరక్టర్ జనార్థన్ సందర్శించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టడం ద్వారా సంవత్సరం పొడవునా చెరువుల్లో నీటిని నిల్వ ఉంచడంతో పాటు చేపల పెంపకం చేపడుతున్న గుప్తాను అభినందించారు.
మరో మూడు నాలుగేళ్లలో దీన్ని పూర్తిస్థాయి సేంద్రియ క్షేత్రంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు గుప్తా ప్రణాళికలు రచిస్తున్నారు. భవిష్యత్తులో చేపల హేచరీ నెలకొల్పుతామన్నారు. రైతులతో పాటు ఆసక్తి గలవారు సందర్శించేలా అగ్రి టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గుప్తా కృషి చేస్తున్నారు. సమీకృత వ్యవసాయాన్ని వాననీటి సంరక్షణకు జోడించి చక్కని ఫలితాలు సాధిస్తున్న గుప్తా, ఆయన మిత్రులు ఆదర్శప్రాయులు.
– తూమాటి భద్రారెడ్డి, సాక్షి, వరంగల్ రూరల్ జిల్లా
మెట్ట పొలాల మధ్యలో నీటి సంరక్షణ చెరువులు తవ్వితే సాగునీటి కరువు తీరుతుంది!
ప్రభుత్వాలు పూనుకొని మెట్ట పొలాల మధ్య పల్లపు ప్రాంతాల్లో అక్కడక్కడా చెరువులు తవ్విస్తే కొద్ది సంవత్సరాల్లోనే రైతులకు నీటి కరువు తీరిపోతుంది. భూగర్భంలో నీళ్లు దాచిపెట్టినట్టవుతుంది. చుట్టుపక్కల 3, 4 కి.మీ. వరకు భూగర్భ జలాలు పెరుగుతాయి. బోర్లు, బావుల్లో నీరు పెరుగుతుంది. మండలానికి ఐదుగురు రైతులనైనా సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలి. వ్యవసాయ పట్టభద్రులకు బ్యాంకులు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి. వ్యవసాయ అధికారులు వస్తే మేం అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలియజెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.
– తోట మల్లికార్జున గుప్తా (96424 07999),సమీకృత వ్యవసాయ క్షేత్రం వ్యవస్థాపకుడు,గొల్లపల్లి, దుగ్గొండి మం., వరంగల్ రూరల్ జిల్లా