Barren lands
-
బంజరు ‘బంగారం’
సాక్షి, అమరావతి: ఎలాంటి పంటలకూ పనికి రాని 6.20 లక్షల ఎకరాల బంజరు భూములను వాటర్‌షెడ్ పథకాలతో బంగారు భూములుగా మార్చి సాగులోకి తేవడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పీఎంజీఎస్‌కేవై 2.0 కార్యక్రమంలో భాగంగా వాటర్‌షెడ్ డెవలప్మెంట్ విభాగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఈ పథకాలు చేపడతారు. ఇందుకయ్యే ఖర్చును 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2022–26 మధ్య ఐదేళ్లలో కొత్తగా వాటర్‌షెడ్ పథకాలకు ప్రణాళికలు పంపాలని కేంద్రం తాజాగా కోరింది. మన రాష్ట్రం నుంచి గరిష్టంగా 2.50 లక్షల హెక్టార్ల (6.20 లక్షల ఎకరాలు) ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఇందుకు రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బంజరు భూములను ఎంపిక చేశారు. కనీసం 2,500 హెక్టార్ల బంజరు ఉండే ప్రాంతాన్ని ఒక ప్రాజెక్టు (ప్రాంతం)గా తీసుకొని 61 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో 5,000 హెక్టార్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాజెక్టు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు గ్రామాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అధికారులు అదనంగా మరో 30 ప్రాజెక్టులతో 75 వేల హెక్టార్లు (1.85 లక్షల ఎకరాలు) అభివృద్దికి ప్రతిపాదనలు ముందస్తుగా సిద్ధం చేశారు. ఈ నెల 4న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మొత్తం 91 ప్రాజెక్టుల పరిధిలో 3.25 లక్షల హెక్టార్లతో ప్రతిపాదనలను రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు కేంద్ర అధికారులకు అందజేశారు. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రాష్ట్రంలో కనీసం 4 లక్షల మంది రైతు, కూలీల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. నిధుల పెంపు, నిబంధనల్లోనూ మార్పు పీఎంజీఎస్‌కేవై 1 లో రాష్ట్రంలో ఇప్పటికే దశల్లో వాటర్‌షెడ్ కార్యక్రమాలు జరిగాయి. ఆ పథకాల్లో అభివృద్దికి హెక్టారుకు గరిష్టంగా రూ.12 వేలు మాత్రమే కేటాయించారు. ఇంత తక్కువ నిధులతో చెక్ డ్యాంల నిర్మాణం, భూమిలో తేమ శాతం పెంపు, ఇతర కార్యక్రమాలతో పాటు ఆ ప్రాంతంలోని కూలీల కుటుంబాలకు వ్యవసాయ ఆధారిత జీవనోపాధి కల్పనలో సత్ఫలితాలు రాలేదు. ఈ నేపధ్యంలో పీఎంజీఎస్‌కేవై – 2లో వాటర్‌షెడ్ కార్యక్రమాల నిర్వహణకు హెక్టారుకు రూ.22 వేల నుంచి రూ.28 వేలు కేటాయించాలని నిర్ణయించారు. దీనికి తోడు గతానికి భిన్నంగా మెరుగైన ఫలితాలు దక్కేలా నిబంధనల్లోనూ మార్పులు చేశారు. ఒక ప్రాజెక్టులో చేపట్టే పనుల ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులివ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం గతంలో ఎక్కువ శాతం నిధులిచ్చిన పనులకు ఇప్పుడు తక్కువ కేటాయించాలని, గతంలో తక్కువ శాతం నిధులిచ్చిన పనులకు ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. -
కరోనా పొమ్మంది ఊరు రమ్మంది.. ఇక వలస వెళ్లం
ఇక్కడ కనిపిస్తున్న మహిళలు ఒకప్పుడు వలస కూలీలు. వాళ్లు ఉన్న నేల ఒకప్పుడు బంజరు భూమి. కరోనా ప్రపంచాన్ని కుదిపేసిన దుర్దినాల్లో ఈ మహిళలు బంజరు నేలలో బంగారం పండించారు. ’ఇది కరోనా కాలంలో మేము సాధించిన విజయం’ అంటూ తాము పండించిన కూరగాయలను ఇలా రాసిపోసి చూపిస్తున్నారు. ఇక వలస వెళ్లం ‘ఊరు పొమ్మంది కాడు రమ్మంది’ అనే నానుడిని మారుస్తూ ‘కరోనా పొమ్మంది... ఊరు రమ్మంది’ అనే కొత్త నానుడిని తెచ్చారీ మహిళలు. కరోనా వ్యాధి వలస కార్మికుల పని మీద ఉరుము ఉరిమింది. పిడుగులా వారి జీవితాల మీద విరుచుకు పడింది. కరోనా పొమ్మన్న కాలంలో ఊరు వాళ్లను కడుపులో దాచుకుంది. ఇప్పుడు ఈ మహిళలు కరోనా నెమ్మదించినా సరే ఇక మీదట పని కోసం పొట్ట పట్టుకుని వలస పోయేది లేదని, ఉన్న ఊర్లోనే ఇదే నేలలో సాగు చేస్తూ జీవితాలను పండించుకుంటామని చెబుతున్నారు. ఈ మహిళా విజయ కథనం మధ్యప్రదేశ్ రాష్ట్రం, చింద్వారా జిల్లా, మెండ్కి తాల్ గ్రామానిది. కలి‘విడి’గా పని చేశారు గత ఏడాది కోవిడ్ కరాళ నృత్యం చేసిన రోజుల్లో నగరంలో పనులు ఆగిపోయాయి. వలస కూలీలుగా వెళ్లిన ఈ మహిళలు నగరాన్ని వదిలి సొంత ఊరికి రావడం అయితే వచ్చేశారు. కానీ ఏం చేసుకుని బతుకు సాగించాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక మహిళకు చెందిన బంజరు నేలను చదును చేసి కూరగాయల మొక్కలు నాటారు. అందులోనూ నెలలోపే చేతికి వచ్చే మెంతి వంటి ఆకు కూరలతో మొదలు పెట్టారు. పాలకూర, ముల్లంగి, టొమాటో, వంగ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, అల్లం, కొత్తిమీర, పచ్చిమిరప, నిమ్మ, కీర వంటి కూరగాయలతోపాటు జామ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలనూ నాటారు. నూట నలభై మంది గిరిజన మహిళలు పది బృందాలుగా విడిపోయి పంటల సాగు మొదలు పెట్టారు. ఆరువేల మొక్కలు నాటారు. ఆరోగ్యకరమైన పోటీతో పంట పండించి మూడు లక్షల ఆదాయాన్ని ఆనందంగా పంచుకున్నారు. ‘ఏడాదికి ఐదు లక్షల ఆదాయం తమ లక్ష్యమని, ఆరు నెలల్లోనే మూడు లక్షలు వచ్చాయి. కాబట్టి తమ లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం కలిగింద’ ని చెప్పింది సావిత్రి కుశ్రమ్. పంటలు పండించి ఊరుకోవడం లేదు. కమ్యూనిటీ పోషణ్ వాటిక పేరుతో ఒక పోషకాహార వేదికను ఏర్పాటు చేశారు. గ్రామంలోని మహిళలకు, గర్భిణులకు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన పోషకాహారం గురించి వివరిస్తున్నారు. నగరాల్లో వలస కూలీలుగా ఉన్న రోజుల్లో సాయంత్రానికి చేతిలో డబ్బు పడేది, కానీ కడుపునిండా తినలేకపోయేవాళ్లమని, ఇప్పుడు మంచి భోజనం చేస్తున్నామని చెప్తున్నారు. కరోనా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పాఠం నేర్పించింది. ఈ మహిళలకు జీవితాన్ని బాగుపరుచుకునే మార్గాన్ని చూపించింది. ఈ పాఠం ఈ మహిళలకే కాదు, మరెందరికో మార్గదర్శనం. -
వొద్దు అన్నోళ్లే వావ్ అంటున్నారు!
సునీత ఐపీఎస్ అవ్వాలనుకున్నారు. అమ్మా నాన్నా చనిపోయిన నేపథ్యంలో ఎంబీఏ చదువుకొని హైదరాబాద్‌లో కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశారు. రసాయనిక అవశేషాలున్న ఆహారం, వాయుకాలుష్యం కారణంగా అనారోగ్యం పాలయ్యారు. సొంతూరుకు తిరిగొచ్చి.. వారసత్వంగా సంక్రమించిన మూడెకరాల బంజరు భూమిని చదును చేసి మాగాణిగా మార్చి.. గత మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు. సులువుగా బ్యాంకు రుణాలివ్వడంతోపాటు.. చిన్న కమతాల మహిళా రైతులు స్వయంగా ఉపయోగించుకోగలిగేలా పవర్ టిల్లర్లను, కలుపుతీత యంత్రపరికరాలను ప్రత్యేకంగా రూపొందించి అందించడానికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు కృషి చేయాలని ఆమె కోరుతున్నారు. ‘ఇదో పిచ్చిది, దీనికేం పనిలేదు..హైద్రాబాద్‌లో మంచిగా ఉద్యోగం చేసుకోక, ఇక్కడ వ్యవసాయం చేస్తానని వచ్చింది. మాతోని కానిది గీ పిల్లతో ఏం అయితది..’ అని కొందరు గ్రామస్తులు ముఖం మీదే చెప్పినా సునీత అధైర్య పడలేదు. పట్టుదల పెంచుకుంది. స్కూటీపై ఇంటి నుంచి రోజూ పొలం వద్దకు వెళ్లి జీవామృతంతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో, గ్రామరైతులు సునీతను చూసి ఆశ్చర్యపడుతున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ముక్కెట్రావుపేట గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి కొప్పుల ధర్మయ్య, శాంతమ్మల ఏడుగురు సంతానంలో చివరి సంతానం సునీత(30). తోడబుట్టిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. హైద్రాబాద్‌లో ఎంబిఎ వరకు చదివారు. ఐపీఎస్ అధికారి కావాలన్నది ఆమె కల. కానీ, తల్లీదండ్రులు కాలం చేశారు. కుటుంబ పరిస్థితులు కలసి రాలేదు. ఆ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే ప్రైవేటు ఉద్యోగంలో చేరారు. వచ్చే జీతం ఖర్చులకు సరిపోయేవి. కానీ, ఏదో తెలియని వెలితి. హాస్టల్లో అంతా రసాయనిక అవశేషాలున్న ఆహారమే. దీనికి వాయుకాలుష్యం తోడుకావడంతో అనారోగ్యం పాలయ్యారు. మందులు వాడుతున్నా ఆరోగ్యం మరింత దిగజారింది. బంజరును మాగాణిగా మార్చి.. ఈ నేపథ్యంలో ఐదారేళ్ల క్రితం సునీత దసరా పండుగకు సొంతరు వెళ్లారు. పచ్చని పొలాలు, బంధుమిత్రుల అనుబంధాలు కాలుష్యం లేని గ్రామీణ వాతావరణం ఆమెను కట్టిపడేసాయి. ఆ విధంగా సొంత ఊరులోనే జీవనాన్ని సాగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. అక్కడుండి ఏమి చేయాలో పాలుపోలేదు. చేతిలో డబ్బు లేదు కానీ.. తండ్రి సంపాయించిన 3 ఎకరాల భూమి మాత్రం ఉంది. అది రాళ్లు, రప్పలతో నిరూపయోగంగా ఉన్న బంజరు భూమి. వ్యవసాయాన్నే వృత్తిగా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, వ్యవసాయంలో ఆమెకు ఓనమాలు తెలియదు. అయినా, సంకల్పంతో ముందడుగు వేశారు. సంప్రదాయ దుస్తులు వదిలేసి.. ప్యాంటు, షర్ట్ ధరించి భూమిలోకి కాలు పెట్టింది. గ్రామస్తుల ఎగతాళి మాటలు ఆమె పట్టుదల ముందు ఓడిపోయాయి. స్నేహితులు ఇచ్చిన తోడ్పాటుతో నిధులు సమకూర్చుకొని రూ 3.50 లక్షల ఖర్చుతో నిరూపయోగంగా ఉన్న భూమిని చదును చేయించి, మాగాణి పొలంగా ఉపయోగంలోకి తీసుకువచ్చారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ‘సాగుబడి’ కథనాల స్ఫూర్తితో.. ‘సాక్షి’లో ‘సాగుబడి’ కథనాల ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం గురించి సునీత తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేశారు. పాలేకర్ శిక్షణా శిబిరాలకు హాజరయ్యారు. పాలేకర్ పుస్తకాలు, ‘గడ్డిపరకతో విప్లవం’ వంటి పుస్తకాలు చదివి.. ప్రకృతికి వ్యవసాయానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని, రసాయనాలతో అనర్థాలను అర్థం చేసుకున్నారు. 2016 ఖరీఫ్ నుంచి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో మూడు ఎకరాల్లో వరి సాగు చేయడం ప్రారంభించారు. ఆవును సమకూర్చుకొని జీవామృతం, ఘనజీవామృతం స్వయంగా తయారు చేసుకొని వాడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్‌ను మోటారుతో తోడుకొని ఏటా రెండు పంటలూ సాగు చేస్తున్నారు. పొలం దున్నేటప్పుడు ఆవుల పేడను పొలమంతా చల్లటం, నాటు వేసే సమయంలో ఘనజీవామృతాన్ని అందించింది. తర్వాత, నాటు వేసి జీవామృతాన్ని ప్రతి 20 రోజులకొకసారి పొలానికి అందిస్తున్నారు. ఎకరానికి రూ. 2 లక్షల నికరాదాయం వచ్చే ఖరీఫ్ నుంచి పాలేకర్ ఐదంస్థుల సాగు చేపట్టి, క్రమంగా కొన్ని సంవత్సరాల్లో తన 3 ఎకరాలను జీవవైవిధ్యంతో కూడిన ఆహార అడవిగా మార్చుకోవాలని సునీత కృతనిశ్చయంతో ఉన్నారు. ఎకరానికి తొలి ఏడాది 28 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం బీపీటీ రకాన్ని మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 33 బస్తాల వరకు దిగుబడి రావచ్చని ఆశిస్తున్నారు. ఎకరానికి రెండు పంటలు కలిపి రూ. 2 లక్షల మేరకు నికరాదాయం వస్తున్నదన్నారు. సామాజిక సేవ ప్రజల ఆరోగ్యం రైతుల చేతుల్లోనే ఉందని నమ్మే సునీత.. రైతులు విపరీతంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయడం వల్ల సమాజం అనారోగ్యకరంగా మారే ప్రమాదం ఉందంటారు. పరిసర గ్రామాల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నానని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజంతో పాటు, అవినీతి లేని సమాజాన్ని నిర్మించడంలోనూ రైతులు తమదైన పాత్ర నిర్వహించాలన్నది ఆమె భావన. ఎవరికి అన్యాయం జరిగిందని తెలిసినా వారికి అండగా నిలుస్తున్నారు. స్వయానా తన అన్న ఆ గ్రామ సర్పంచ్‌గా అవినీతికి పాల్పడ్డాడంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, అతని చెక్ పవర్‌ను రద్దు చేయించటం సునీత చిత్తశుద్ధికి నిదర్శనం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్, ఫొటోలు: ఎలేటి శైలేందర్ రెడ్డి సులభ రుణాలు, మహిళలు నడపగలిగే ప్రత్యేక పవర్ టిల్లర్లు తయారుచేయాలి సమాజంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలన్నదే నా అభిమతం. అడ్డంకులను అధిగమించినప్పుడే జీవితంలో తృప్తి. మనం చేసే పని నీతి, నీజాయితిగా ఉండాలి. అవాంతరాలు రావచ్చు. పట్టుదలతో నిలదొక్కుకుంటే సమాజం ఆ తర్వాత గుర్తించి విలువనిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న మహిళా రైతులు తమ సాగు భూముల్లో తాము స్వయంగా నడుపుకోగలిగేలా అనువుగా ఉన్న పవర్ టిల్లర్లు, వీడర్లు అందుబాటులో లేవు. తక్కువ వైబ్రేషన్స్ ఉండేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు మహిళా రైతులకు అందించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళా రైతులకు భూమిని తనఖా పెట్టుకొని సులువుగా బ్యాంకు రుణాలు అందించేలా ప్రభుత్వం శ్రద్ధతీసుకోవాలి. మహిళా రైతులు పండించిన సేంద్రియ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వం స్టాళ్లు ఏర్పాటు చేయాలి లేదా ప్రత్యేక రుణాలను అందించాలి. – కొప్పుల సునీత(79890 45496), యువ మహిళా రైతు, ముక్కెట్రావుపేట, వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా keerthisk999@gmail.com ఆవులతో సునీత -
సిరిధాన్యాలను ఇప్పుడైనా విత్తుకోవచ్చు!
ఆరోగ్య సిరులను అందించే సిరిధాన్య పంటలను వర్షాకాలంలో నీటి వసతి లేని బంజరు భూముల్లోనూ సాగు చేయవచ్చని, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుంటే ఈ కాలంలో కూడా నిశ్చింతగా సాగు చేసుకోవచ్చని అటవీ వ్యవసాయ నిపుణుడు, స్వతంత్ర ఆహార – ఆరోగ్య నిపుణుడు డా. ఖాదర్ వలి(మైసూర్) తెలిపారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ధ్యానహిత హైస్కూల్లో జరిగిన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. కొర్రలు, సామలు, ఊదలు, అండుకొర్రలు, అరికలను అనుదినం ప్రధాన ఆహారంగా తింటూ కషాయాలు తాగుతూ వేలాది మంది సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటున్నారని.. ఈ దశలో రైతులు ఈ సిరిధాన్యాలను విరివిగా సాగు చేయటం అవసరమని ఆయన అన్నారు. అయితే, ఎప్పుడు విత్తుకున్నా.. కోత సమయంలో వర్షాలు లేకుండా ఉండేలా జాగ్రత్తపడాలన్నారు. పొలంలో స్ప్రింక్లర్లు ఉండి, కోత కోసిన పనలు వర్షానికి తడవకుండా దాచుకోవడానికి తగినంత పెద్ద గోదామును సమకూర్చుకోగలిగిన రైతులు ఏ కాలంలోనైనా సిరిధాన్యాలను సాగు చేయవచ్చన్నారు. అండుకొర్రలు 70–80 రోజుల పంటైతే అరికలు 6 నెలల పంట. ఫిబ్రవరిలోగానే అన్ని పంటలూ చేతికి వచ్చేలా, అందుకు తగిన పంటలను మాత్రమే వేసుకోవాలన్నారు. 5 ఎకరాలున్న రైతు ప్రతి ఎకరంలోని 75 సెంట్లలో ఒక రకం సిరిధాన్యం సాగు చేస్తూ.. మిగతా 25 సెంట్లలో పప్పుధాన్యాలు, నువ్వు, కుసుమ వంటి నూనెగింజ పంటలతోపాటు బంతి, ఆముదం మొక్కలను సాళ్లు సాళ్లుగా విత్తుకోవాలన్నారు. అప్పుడు ఆ 5 ఎకరాల్లో 5 రకాల సిరిధాన్యాలతోపాటు మధ్యలో ఇతర పంటలు వేసుకోవాలన్నారు. స్ప్రింక్లర్లతో వారానికో తడి చాలు.. వారానికోసారి 25–30 నిమిషాల పాటు సాయంత్ర వేళలో స్ప్రింక్లర్లతో నీటిని చల్లుకునే అవకాశం కల్పించుకోగలిగిన రైతులు ప్రస్తుత రబీ పంట కాలంలో కూడా సిరిధాన్యాలను నిశ్చింతగా సాగు చేసుకోవచ్చని డా. ఖాదర్ అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడనవసరం లేదన్నారు. పశ్చిమ కనుమల్లో నుంచి తెచ్చిన కోటానుకోట్ల జాతుల సూక్ష్మజీవ రాశితో కూడిన ‘అటవీ చైతన్య’ ద్రావణాన్ని సాయంత్ర వేళలో పంట భూమిపై పిచికారీ చేస్తే సిరిధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజలను ఒకే పొలంలో పక్కపక్కనే సాళ్లుగా విత్తుకొని సాగు చేసుకోవచ్చని తెలిపారు. బంజరు భూమినీ సారవంతం చేయొచ్చు రాళ్లతో నిండిన బంజరు భూమిపై అయినా వారానికోసారి సాయంత్ర వేళలో అటవీ చైతన్యాన్ని పిచికారీ చేస్తే 3 నెలల్లోనే ఆ భూమి సారవంతంగా పంటల సాగుకు అనుగుణంగా మారుతుందన్నారు. ఎండ తగలని సాయంత్ర సమయాల్లోనే అటవీ చైతన్య ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. ఇందులోని సూక్ష్మజీవ రాశి భూమి లోపలికి చొచ్చుకువెళ్లి భూమిని సారవంతం చేస్తాయన్నారు. తాను మైసూరు దగ్గరలో 8 ఎకరాల బంజరు భూమిని తీసుకొని ఈ పద్ధతుల్లో అనేక ఏళ్లుగా సిరిధాన్యాలు, ఇతర పంటలు పండిస్తున్నామని, ఎవరైనా సందర్శించవచ్చన్నారు. అటవీ చైతన్యం లీటరు తీసుకున్న రైతు 21 రోజులకోసారి తిరిగి తయారు చేసుకుంటూ జీవితాంతం వాడుకోవచ్చని, ఇతర రైతులకూ పంపిణీ చేయవచ్చన్నారు. పావు కేజీ సిరిధాన్యాల పిండి, 50 గ్రాముల బెల్లం/తాటి బెల్లంతో పాటు ఒక లీటరు అటవీ చైతన్య ద్రావణాన్ని 20 లీటర్ల నీటి కుండలో కలిపి.. వారం రోజులు పులియబెడితే.. అటవీ చైతన్యం తయారవుతుంది. పందులను పారదోలే సరిహద్దు పంటగా అరిక అరికల పంటను పొలం చుట్టూ 15 అడుగుల వెడల్పున సరిహద్దు పంటగా వేసుకుంటే.. అడవి పందుల నుంచే కాకుండా ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చని డా. ఖాదర్ తెలిపారు. అరిక ఆకుల నుంచి వెలువడే ప్రత్యేక వాసనలు జంతువులను పంట పొలాల దరి చేరకుండా చూస్తాయన్నారు. అందుబాటులో అటవీ చైతన్య ద్రావణం రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్ ఆవరణలో రైతులకు అటవీ చైతన్య ద్రావణాన్ని లీటరు చొప్పున డా. ఖాదర్ పంపిణీ చేశారు. అటవీ చైతన్యం కోసం షాబాద్ ధ్యానహితకు చెందిన దత్తా శంకర్(86398 96343)ను లేదా మైసూరుకు చెందిన అటవీ కృషి నిపుణుడు బాలన్ కృష్ణన్(97405 31358)ను సంప్రదించవచ్చు. రైతుకు అటవీ చైతన్య ద్రావణం సీసాను అందజేస్తున్న డా. ఖాదర్ వలి -
బంజరులో చెరువులు..బంగారు పంటలకు బాటలు!
ఒడిసిపట్టిన వాన నీటితో బంజరు భూముల్లో జలసిరి - బోర్లు వేయకుండానే 120 ఎకరాల్లో వర్షాధార సమీకృత వ్యవసాయం - 40 ఎకరాల్లో చెరువుల తవ్వకం..కురిసిన ప్రతి చినుకూ చెరువుల్లోనే.. - 50 ఆవులు, 400 గొర్రెల పెంపకం..వాటి విసర్జితాలతో చేపల పెంపకం - 80 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు వరంగల్ జిల్లాలోని ఆ ప్రాంతం కరువుకు నిలువెత్తు నిదర్శనం. కనుచూపు మేర కానరాని నీటి జాడ.. బీడు భూముల్లో రాతి గుట్టలు.. పశువుల మేతకు మాత్రమే పనికొచ్చే పడావు భూములు. చేయీ చేయీ కలిపి కలసికట్టుగా కదిలిన రైతుమిత్రులు కొందరు విజ్ఞతతో కదలి కరువును పారదోలారు. అవరోధాల మాటున దాగిన అపారమైన వ్యవసాయావకాశాలను ముందుచూపుతో దర్శించి, తమ కలలను నిజం చేసుకుంటున్నారు. తమ భూమిలో కొంత విస్తీర్ణంలో చెరువులు తవ్వి.. వాన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టి.. ఒక్క బోరు కూడా వేయకుండా కరువును జయించవచ్చని ఆచరణాత్మకంగా చూపిస్తున్నారు. సమష్టి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పశువులు, గొర్రెల విసర్జితాలతో చేపల పెంపకం.. ఆ చెరువుల నీటితో పంటలు సాగు చేస్తున్నారు. సమీకృత వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ రైతులను, శాస్త్రవేత్తలను సైతం ఔరా అనిపిస్తున్నారు. ఈ విలక్షణ వ్యవసాయ క్షేత్రాన్ని మల్లిఖార్జున గుప్తా నిర్వహిస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన ఆయన అనుభవాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. పొలాల మధ్య చెరువులు తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే బంజరు భూముల్లో బంగారు పంటలు పండించుకోవచ్చని రుజువుచేస్తున్నారు తోట మల్లిఖార్జున గుప్తా. జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పాడిపంటలు, సేంద్రియ వ్యవసాయం, చేపల పెంపకాన్ని ఏకకాలంలో చేపట్టి సమీకృత సహకార వ్యవసాయ పద్ధతికి నాంది పలికారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆయన స్వగ్రామం. 2010లో మిత్రులతో కలసి దుగ్గొండి మండలం గొల్లపల్లిలో 130 ఎకరాల బంజర భూమిని కొనుగోలు చేశారు. వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. చుక్క నీరు లేని చోట వ్యవసాయం ఎలా చేస్తావనే ప్రశ్నకు సమాధానంగా స్వయంకృషి ప్రేరణా కేంద్రం నెలకొల్పి కొత్త ఒరవడికి శ్రీకారం పలికారు. నిండుకుండలా చెరువులు.. మొత్తం 130 ఎకరాల్లోని 40 ఎకరాల్లో ఏడు చెరువులు తవ్వించారు. చెరువు లోతు 12 అడుగులు. ఎగువన వెయ్యెకరాల విస్తీర్ణంలో కురిసిన వర్షపు నీటిని నిలిపేందుకు తమ పొలంలో సిమెంటుతో ఆనకట్టను నిర్మించారు. ఆనకట్ట నుంచి భూమిలో వేసిన పైపుల ద్వారా దిగువన తవ్విన చెరువుల్లోకి నీరు వెళ్తుంది. వర్షపు నీటితో ఒకదాని వెంట మరొకటిగా చెరువులు నిండుతాయి. భూమిలో పైపులు వేసి ఈ చెరువులన్నింటినీ అనుసంధానించారు. ఇలా నిండిన చెరువుల్లోని నీటిని ఏడాదంతా ఇంజిన్లతో ఎత్తిపోస్తూ.. పొలంలోని మెరక ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి పంటలకు, తోటలకు నీరందిస్తారు. ఐదారేళ్లుగా వాన నీటి సంరక్షణ చేస్తుండడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగింది. వీరి పొలంలోనే కాకుండా పక్క రైతుల పొలాల్లోని బావులు, బోరుల్లో కూడా జలకళ ఉట్టిపడుతోంది. వ్యవసాయ క్షేత్రం అంతటా జలం ఉబికి వస్తోంది. బిందుసేద్యంలో మిశ్రమ పంటల సాగు.. ఈ సమష్టి సహకార వ్యవసాయ క్షేత్రంలోని అన్ని పంటలకు బిందుసేద్యం పద్ధతిలోనే నీరందిస్తున్నారు. దీనికోసం 80 ఎకరాల్లో బిందు సేద్యం పరికరాలు బిగించారు. ఇక్కడ మొదట్లో చెరుకు, పత్తి, మిర్చి, పసుపు, అరటి సాగు చేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంటలతో పాటు 40 ఎకరాల్లో సుబాబుల్, 10 ఎకరాల్లో సర్వీ చెట్లను పెంచుతున్నారు. అంతరపంటలుగా సోయా, కూరగాయలు పండిస్తున్నారు. గుప్తా వ్యవసాయ క్షేత్రంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంటలను కలిపి సాగు చేస్తున్నారు. సుబాబుల్ చెట్ల ఆకులు జీవాలకు మంచి మేతగా ఉపయోగపడుతున్నాయి. రాలిన చెట్ల ఆకులు, రెమ్మలతో భూమి సారవంతమవుతోంది. సుబాబుల్ అమ్మకం ద్వారా రెండున్నరేళ్లకు ఎకరాకు రూ. 50–60 వేల ఆదాయం లభిస్తోంది. ఇంకో రెండు కత్తిరింపుల తరువాత సుబాబుల్ పైరును తొలగించి సేంద్రియ కూరగాయ పంటలను సాగు చేస్తామని గుప్తా తెలిపారు. ఆవు పేడ, మూత్రం నేరుగా చెరువులోకి... గుప్తా పంటల సాగులో వైవిధ్యం పాటించటంతో పాటు పాడి, చేపల పెంపకం చేపట్టారు. తొలుత 25 ఒంగోలు జాతి ఆవులను కొన్నారు. వాటి సంఖ్య ప్రస్తుతం 50కి పెరిగింది. వీటికి మేత కోసం 15 ఎకరాల్లో మొక్కజొన్న పెంచుతున్నారు. పశువుల పాకలోని పేడ, మూత్రాలను పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగించుకునేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తున్నారు. పాకలోని ఆవుల పేడ, మూత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాలువ ద్వారా చెరువులో కలుస్తాయి. ఇలా పోషకాలు కలిగిన నీటిని ఇంజిన్లతో ఎత్తిపోతల ద్వారా పొలంలో మెరక ప్రాంతానికి తరలించి పంటలకు అందిస్తున్నారు. చెరువుల్లో డెడ్‌స్టోరేజీకి దిగువన ఉన్న నీటిని మాత్రం వినియోగించుకోకూడదన్న నియమం పెట్టుకున్నామని గుప్తా వివరించారు. ప్రతి 15 రోజులకోసారి పంటలకు అందిస్తారు. దీనివల్ల భూమి సహజపద్ధతుల్లోనే సారవంతమవుతోంది. దీంతో రసాయన ఎరువులు వాడే అవసరం తప్పింది. కొన్ని పశువులను రైతులకు అమ్మటం ద్వారా ఆదాయం పొందుతున్నారు. 400 నెల్లూరు జాతి గొర్రెలను పెంచుతున్నారు. 40 ఎకరాల్లోని ఏడు చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరక్టర్ జనార్థన్ సందర్శించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టడం ద్వారా సంవత్సరం పొడవునా చెరువుల్లో నీటిని నిల్వ ఉంచడంతో పాటు చేపల పెంపకం చేపడుతున్న గుప్తాను అభినందించారు. మరో మూడు నాలుగేళ్లలో దీన్ని పూర్తిస్థాయి సేంద్రియ క్షేత్రంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు గుప్తా ప్రణాళికలు రచిస్తున్నారు. భవిష్యత్తులో చేపల హేచరీ నెలకొల్పుతామన్నారు. రైతులతో పాటు ఆసక్తి గలవారు సందర్శించేలా అగ్రి టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గుప్తా కృషి చేస్తున్నారు. సమీకృత వ్యవసాయాన్ని వాననీటి సంరక్షణకు జోడించి చక్కని ఫలితాలు సాధిస్తున్న గుప్తా, ఆయన మిత్రులు ఆదర్శప్రాయులు. – తూమాటి భద్రారెడ్డి, సాక్షి, వరంగల్ రూరల్ జిల్లా మెట్ట పొలాల మధ్యలో నీటి సంరక్షణ చెరువులు తవ్వితే సాగునీటి కరువు తీరుతుంది! ప్రభుత్వాలు పూనుకొని మెట్ట పొలాల మధ్య పల్లపు ప్రాంతాల్లో అక్కడక్కడా చెరువులు తవ్విస్తే కొద్ది సంవత్సరాల్లోనే రైతులకు నీటి కరువు తీరిపోతుంది. భూగర్భంలో నీళ్లు దాచిపెట్టినట్టవుతుంది. చుట్టుపక్కల 3, 4 కి.మీ. వరకు భూగర్భ జలాలు పెరుగుతాయి. బోర్లు, బావుల్లో నీరు పెరుగుతుంది. మండలానికి ఐదుగురు రైతులనైనా సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలి. వ్యవసాయ పట్టభద్రులకు బ్యాంకులు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి. వ్యవసాయ అధికారులు వస్తే మేం అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలియజెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. – తోట మల్లికార్జున గుప్తా (96424 07999),సమీకృత వ్యవసాయ క్షేత్రం వ్యవస్థాపకుడు,గొల్లపల్లి, దుగ్గొండి మం., వరంగల్ రూరల్ జిల్లా -
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘ఎరువుల అధిక వినియోగంతో సిరులు కురిపించిన పంజాబ్, హర్యానా పంట భూములు క్రమంగా బంజరు భూములుగా మారాయి. ఈ నేపథ్యంలో రసాయన ఎరువుల ఉత్పత్తి, దిగుమతులు తగ్గించాలని నిర్ణయించాం. అదే సమయంలో ఇక్కడి ఎరువుల తయారీ పరిశ్రమను కాపాడతాం’ అని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు. ఫ్ట్యాప్సీ ఆధ్వర్యంలో మంగళవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖిలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ‘ప్రస్తుతం దేశంలో 310 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 90 లక్షల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేసి రైతులకు ఉచితంగా అందించాలని నిర్ణయించాం. మీరూ అదే దిశగా పనిచేస్తే ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సుముఖంగా వుందని’ ఎరువుల పరిశ్రమల ప్రతినిధులకు స్పష్టం చేశారు. ‘గ్యాస్‌ను దేశానికి పైపులైను ద్వారా రప్పించి, రసాయన ఎరువులను ఉత్పత్తి చేసి సబ్సిడీలు ఇవ్వడం వ్యయ ప్రయాసలతో కూడుకుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ లభ్యత వున్న ఇరాన్ నుంచి ఎరువుల దిగుమతి కోసం త్వరలో ఒప్పందం కుదుర్చుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని’ మంత్రి వెల్లడించారు. తద్వారా ఎరువులపై 80 శాతం మేర సబ్సిడీ ఇచ్చేందుకు వీలవుతుందన్నారు. ప్లాస్టిక్ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ‘ప్లాస్టిక్ పరిశ్రమను దేశీయంగా ప్రోత్సహించేందుకు ముడి సరుకు దిగుమతులపై సుంకాన్ని 5 నుంచి 7 శాతానికి పెంచాం. ప్రస్తుతం దేశంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సంస్థలు 27 వుండగా, మూడేళ్లలో 40కి పెంచుతాం. మొత్తం 100 సంస్థలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్ పాలసీపైనా కసరత్తు చేస్తున్నాం’ అని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ ప్రకటించారు. బల్క్‌డ్రగ్ తయారీ కోసం త్వరలో ప్రత్యేక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. పెన్‌గంగా, ప్రాణహిత ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి మెరుగవుతుందన్నారు. డిసెంబర్ ఐదున దేశంలోని ఎంపిక చేసిన 5 జిల్లాల్లో రైతులకు మట్టి నమూనా విశ్లేషణలకు సంబంధించిన కార్డులు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. రుణమాఫీ హామీ టీఆర్ఎస్దే: కిషన్‌రెడ్డి రైతులకు లక్ష కోట్లు రుణమాఫీ చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఇప్పుడు మోదీ ప్రభుత్వం సహాయం చేయడం లేదని చెప్తోందని బీజేపీ శాసనసభా పక్షం నేత కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఓ వైపు కొత్త పరిశ్రమలు వస్తుండగా, పాతవి ఎందుకు మూ త పడుతున్నాయో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఎరువులు, ప్లాస్టిక్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్ట్యాప్సీ అధ్యక్షుడు వెన్నం అనిల్‌రెడ్డి వివరించారు. సమావేశంలో ఫ్ట్యాప్సీ ఉపాధ్యక్షులు రవీంద్రమోడీ, గౌర శ్రీనివాస్ పాల్గొన్నారు. చట్టసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు! చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన మహిళా మోర్చా సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలోనూ, పురోగతిలోనూ మహిళల పాత్ర చాలా కీలకమన్నారు. మహిళా సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనికి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. బేటీ బచావో-బేటీ పడావో పథకం ద్వారా బాల్య దశ నుంచి మహిళలకు బాసటగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా గంగారాం వివరించారు. తెలంగాణలోనే మహిళల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తరపున తగిన చర్యలను తీసుకుంటామన్నారు. మగవారితో సమానంగా మహిళా రైతులకు రుణాలను అందిస్తామని గంగారాం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాట్లాడారు. -
ఇసుక దందా ఆపేవారెవరు?
పరిగి: ఇసుక మాఫియా రోజురోజుకు విజృంభిస్తోంది. పంట పొలాలు, బీడు భూములు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అని తేడాలేకుండా యథేచ్ఛగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ నాయకులను, అధికార యంత్రాంగాన్ని ఇసుక మాఫియా శాసిస్తోంది. వాగులు, నదుల నుంచి ఇసుక తీసుకు రావటానికి అడ్డంకులు ఎదురవుతుండటంతో స్థానికంగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసుకుని ఇసుక దందా కొనసాగిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఫిల్టర్లు ఏర్పాటు చేసి ఫిల్టర్ చేసిన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి నిల్వ చేస్తున్నారు. ఆ ఇసుకను లారీల ద్వారా రవాణా చేస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. చట్టాలన్నీ చుట్టాలే... సహజ వనరుల దుర్వినియోగ నియంత్రణ చట్టం(వాల్టా), నాన్ అగ్రికల్చర్ ల్యాండ్(నాలా), ఫారెస్టు పరిరక్షణ చట్టాలన్నింటినీ ఇసుక మాఫియా చుట్టాలుగా మార్చుకుంటోంది. గండేడ్, కుల్కచర్ల మండలాల్లో వాగు ల్లో ఇసుకను తవ్వి రవాణా చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తుండగా, పరిగి, దోమ మండలాల్లో పొలాలు, బీడు భూములు అని తేడా లేకుండా మట్టిని తవ్వుతూ ఫిల్టర్లకు వినియోగిస్తూ నాలాకు తూట్లు పొడుస్తున్నారు. ఇసుక తయారీకి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. కుంటులు, చెరువుల్లోని నీటిని ఇసుక తయారీకి వినియోగిస్తున్నారు. అరుునా ఏ ఒక్క శాఖ అధికారులు కూడా ఇసుక మాఫియాను నియంత్రించలేకపోతున్నారు. అటవీ భూముల్లోనూ ఇసుక ఫిల్టర్లు... పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్, రూప్‌ఖాన్‌పేట్, రంగంపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న అటవీ భూములు ఇసుక ఫిల్టర్లకు అడ్డాలుగా మారాయి. వీరు అటవీ భూముల్లో సైతం తవ్వకాలు జరుపుతూ ఇసుకను కొల్లగొడుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూలేకుండా పోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానాలకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. గండేడ్ మండల పరిధిలోని ధర్మాపూర్, శేఖపల్లి, గాధిర్యాల్, చిన్నవార్వాల్, పెద్దవార్వాల్, రంగారెడ్డిపల్లి, పగిడ్యాల్ ప్రాంతాల్లో ఇసుక నిల్వ ఉంది. దోమ మండల పరిధిలోని పలుగ్రామాల్లో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారులు, పోలీసులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి స్వల్పంగా జరిమానాలు విధించి మామూళ్లు తీసుకొని వదిలి పెట్టడంతో వ్యాపారులకు ఇసుక తరలింపు మంచి వ్యాపారంగా మారింది.