ఇక్కడ కనిపిస్తున్న మహిళలు ఒకప్పుడు వలస కూలీలు. వాళ్లు ఉన్న నేల ఒకప్పుడు బంజరు భూమి. కరోనా ప్రపంచాన్ని కుదిపేసిన దుర్దినాల్లో ఈ మహిళలు బంజరు నేలలో బంగారం పండించారు. ’ఇది కరోనా కాలంలో మేము సాధించిన విజయం’ అంటూ తాము పండించిన కూరగాయలను ఇలా రాసిపోసి చూపిస్తున్నారు.
ఇక వలస వెళ్లం
‘ఊరు పొమ్మంది కాడు రమ్మంది’ అనే నానుడిని మారుస్తూ ‘కరోనా పొమ్మంది... ఊరు రమ్మంది’ అనే కొత్త నానుడిని తెచ్చారీ మహిళలు. కరోనా వ్యాధి వలస కార్మికుల పని మీద ఉరుము ఉరిమింది. పిడుగులా వారి జీవితాల మీద విరుచుకు పడింది. కరోనా పొమ్మన్న కాలంలో ఊరు వాళ్లను కడుపులో దాచుకుంది. ఇప్పుడు ఈ మహిళలు కరోనా నెమ్మదించినా సరే ఇక మీదట పని కోసం పొట్ట పట్టుకుని వలస పోయేది లేదని, ఉన్న ఊర్లోనే ఇదే నేలలో సాగు చేస్తూ జీవితాలను పండించుకుంటామని చెబుతున్నారు. ఈ మహిళా విజయ కథనం మధ్యప్రదేశ్ రాష్ట్రం, చింద్వారా జిల్లా, మెండ్కి తాల్ గ్రామానిది.
కలి‘విడి’గా పని చేశారు
గత ఏడాది కోవిడ్ కరాళ నృత్యం చేసిన రోజుల్లో నగరంలో పనులు ఆగిపోయాయి. వలస కూలీలుగా వెళ్లిన ఈ మహిళలు నగరాన్ని వదిలి సొంత ఊరికి రావడం అయితే వచ్చేశారు. కానీ ఏం చేసుకుని బతుకు సాగించాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక మహిళకు చెందిన బంజరు నేలను చదును చేసి కూరగాయల మొక్కలు నాటారు. అందులోనూ నెలలోపే చేతికి వచ్చే మెంతి వంటి ఆకు కూరలతో మొదలు పెట్టారు. పాలకూర, ముల్లంగి, టొమాటో, వంగ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, అల్లం, కొత్తిమీర, పచ్చిమిరప, నిమ్మ, కీర వంటి కూరగాయలతోపాటు జామ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలనూ నాటారు.
నూట నలభై మంది గిరిజన మహిళలు పది బృందాలుగా విడిపోయి పంటల సాగు మొదలు పెట్టారు. ఆరువేల మొక్కలు నాటారు. ఆరోగ్యకరమైన పోటీతో పంట పండించి మూడు లక్షల ఆదాయాన్ని ఆనందంగా పంచుకున్నారు. ‘ఏడాదికి ఐదు లక్షల ఆదాయం తమ లక్ష్యమని, ఆరు నెలల్లోనే మూడు లక్షలు వచ్చాయి. కాబట్టి తమ లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం కలిగింద’ ని చెప్పింది సావిత్రి కుశ్రమ్. పంటలు పండించి ఊరుకోవడం లేదు.
కమ్యూనిటీ పోషణ్ వాటిక పేరుతో ఒక పోషకాహార వేదికను ఏర్పాటు చేశారు. గ్రామంలోని మహిళలకు, గర్భిణులకు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన పోషకాహారం గురించి వివరిస్తున్నారు. నగరాల్లో వలస కూలీలుగా ఉన్న రోజుల్లో సాయంత్రానికి చేతిలో డబ్బు పడేది, కానీ కడుపునిండా తినలేకపోయేవాళ్లమని, ఇప్పుడు మంచి భోజనం చేస్తున్నామని చెప్తున్నారు. కరోనా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పాఠం నేర్పించింది. ఈ మహిళలకు జీవితాన్ని బాగుపరుచుకునే మార్గాన్ని చూపించింది. ఈ పాఠం ఈ మహిళలకే కాదు, మరెందరికో మార్గదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment