పరిగి: ఇసుక మాఫియా రోజురోజుకు విజృంభిస్తోంది. పంట పొలాలు, బీడు భూములు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అని తేడాలేకుండా యథేచ్ఛగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ నాయకులను, అధికార యంత్రాంగాన్ని ఇసుక మాఫియా శాసిస్తోంది.
వాగులు, నదుల నుంచి ఇసుక తీసుకు రావటానికి అడ్డంకులు ఎదురవుతుండటంతో స్థానికంగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసుకుని ఇసుక దందా కొనసాగిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఫిల్టర్లు ఏర్పాటు చేసి ఫిల్టర్ చేసిన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి నిల్వ చేస్తున్నారు. ఆ ఇసుకను లారీల ద్వారా రవాణా చేస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు.
చట్టాలన్నీ చుట్టాలే...
సహజ వనరుల దుర్వినియోగ నియంత్రణ చట్టం(వాల్టా), నాన్ అగ్రికల్చర్ ల్యాండ్(నాలా), ఫారెస్టు పరిరక్షణ చట్టాలన్నింటినీ ఇసుక మాఫియా చుట్టాలుగా మార్చుకుంటోంది. గండేడ్, కుల్కచర్ల మండలాల్లో వాగు ల్లో ఇసుకను తవ్వి రవాణా చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తుండగా, పరిగి, దోమ మండలాల్లో పొలాలు, బీడు భూములు అని తేడా లేకుండా మట్టిని తవ్వుతూ ఫిల్టర్లకు వినియోగిస్తూ నాలాకు తూట్లు పొడుస్తున్నారు. ఇసుక తయారీకి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. కుంటులు, చెరువుల్లోని నీటిని ఇసుక తయారీకి వినియోగిస్తున్నారు. అరుునా ఏ ఒక్క శాఖ అధికారులు కూడా ఇసుక మాఫియాను నియంత్రించలేకపోతున్నారు.
అటవీ భూముల్లోనూ ఇసుక ఫిల్టర్లు...
పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్, రూప్‌ఖాన్‌పేట్, రంగంపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న అటవీ భూములు ఇసుక ఫిల్టర్లకు అడ్డాలుగా మారాయి. వీరు అటవీ భూముల్లో సైతం తవ్వకాలు జరుపుతూ ఇసుకను కొల్లగొడుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూలేకుండా పోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానాలకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.
గండేడ్ మండల పరిధిలోని ధర్మాపూర్, శేఖపల్లి, గాధిర్యాల్, చిన్నవార్వాల్, పెద్దవార్వాల్, రంగారెడ్డిపల్లి, పగిడ్యాల్ ప్రాంతాల్లో ఇసుక నిల్వ ఉంది. దోమ మండల పరిధిలోని పలుగ్రామాల్లో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారులు, పోలీసులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి స్వల్పంగా జరిమానాలు విధించి మామూళ్లు తీసుకొని వదిలి పెట్టడంతో వ్యాపారులకు ఇసుక తరలింపు మంచి వ్యాపారంగా మారింది.
ఇసుక దందా ఆపేవారెవరు?
Published Mon, Oct 6 2014 11:59 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement