రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘ఎరువుల అధిక వినియోగంతో సిరులు కురిపించిన పంజాబ్, హర్యానా పంట భూములు క్రమంగా బంజరు భూములుగా మారాయి. ఈ నేపథ్యంలో రసాయన ఎరువుల ఉత్పత్తి, దిగుమతులు తగ్గించాలని నిర్ణయించాం. అదే సమయంలో ఇక్కడి ఎరువుల తయారీ పరిశ్రమను కాపాడతాం’ అని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు. ఫ్ట్యాప్సీ ఆధ్వర్యంలో మంగళవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖిలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.
‘ప్రస్తుతం దేశంలో 310 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 90 లక్షల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేసి రైతులకు ఉచితంగా అందించాలని నిర్ణయించాం. మీరూ అదే దిశగా పనిచేస్తే ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సుముఖంగా వుందని’ ఎరువుల పరిశ్రమల ప్రతినిధులకు స్పష్టం చేశారు.
‘గ్యాస్‌ను దేశానికి పైపులైను ద్వారా రప్పించి, రసాయన ఎరువులను ఉత్పత్తి చేసి సబ్సిడీలు ఇవ్వడం వ్యయ ప్రయాసలతో కూడుకుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ లభ్యత వున్న ఇరాన్ నుంచి ఎరువుల దిగుమతి కోసం త్వరలో ఒప్పందం కుదుర్చుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని’ మంత్రి వెల్లడించారు. తద్వారా ఎరువులపై 80 శాతం మేర సబ్సిడీ ఇచ్చేందుకు వీలవుతుందన్నారు.
ప్లాస్టిక్ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు
‘ప్లాస్టిక్ పరిశ్రమను దేశీయంగా ప్రోత్సహించేందుకు ముడి సరుకు దిగుమతులపై సుంకాన్ని 5 నుంచి 7 శాతానికి పెంచాం. ప్రస్తుతం దేశంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సంస్థలు 27 వుండగా, మూడేళ్లలో 40కి పెంచుతాం. మొత్తం 100 సంస్థలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్ పాలసీపైనా కసరత్తు చేస్తున్నాం’ అని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ ప్రకటించారు.
బల్క్‌డ్రగ్ తయారీ కోసం త్వరలో ప్రత్యేక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. పెన్‌గంగా, ప్రాణహిత ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి మెరుగవుతుందన్నారు. డిసెంబర్ ఐదున దేశంలోని ఎంపిక చేసిన 5 జిల్లాల్లో రైతులకు మట్టి నమూనా విశ్లేషణలకు సంబంధించిన కార్డులు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు.
రుణమాఫీ హామీ టీఆర్‌ఎస్‌దే: కిషన్‌రెడ్డి
రైతులకు లక్ష కోట్లు రుణమాఫీ చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్, ఇప్పుడు మోదీ ప్రభుత్వం సహాయం చేయడం లేదని చెప్తోందని బీజేపీ శాసనసభా పక్షం నేత కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఓ వైపు కొత్త పరిశ్రమలు వస్తుండగా, పాతవి ఎందుకు మూ త పడుతున్నాయో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఎరువులు, ప్లాస్టిక్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్ట్యాప్సీ అధ్యక్షుడు వెన్నం అనిల్‌రెడ్డి వివరించారు. సమావేశంలో ఫ్ట్యాప్సీ ఉపాధ్యక్షులు రవీంద్రమోడీ, గౌర శ్రీనివాస్ పాల్గొన్నారు.
చట్టసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు!
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన మహిళా మోర్చా సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలోనూ, పురోగతిలోనూ మహిళల పాత్ర చాలా కీలకమన్నారు. మహిళా సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనికి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
బేటీ బచావో-బేటీ పడావో పథకం ద్వారా బాల్య దశ నుంచి మహిళలకు బాసటగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా గంగారాం వివరించారు. తెలంగాణలోనే మహిళల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తరపున తగిన చర్యలను తీసుకుంటామన్నారు. మగవారితో సమానంగా మహిళా రైతులకు రుణాలను అందిస్తామని గంగారాం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాట్లాడారు.