సంపూర్ణ జీవితం | Sakshi Editorial On Diet exercise sleep for Perfect life | Sakshi
Sakshi News home page

సంపూర్ణ జీవితం

Published Mon, Jun 24 2024 12:17 AM | Last Updated on Mon, Jun 24 2024 12:17 AM

Sakshi Editorial On Diet exercise sleep for Perfect life

భట్టి విక్రమార్క కథలో, విక్రమార్కుడి బుద్ధి కుశలతను మెచ్చి, వెయ్యేళ్లు పరిపాలించే సింహాసనాన్ని బహూకరిస్తాడు ఇంద్రుడు. అంటే వెయ్యేళ్ల ఆయువు. మరి నా సంగతేమిటని విక్రమార్కుడిని అడుగుతాడు సోదరుడు భట్టి. అన్నింటికీ వెన్నంటి ఉండే భట్టి సంగతి మరిచేపోయాడు విక్రమార్కుడు. దాంతో భట్టి ఆవేశంతో కాళికాదేవి తపస్సు చేసి, రెండు వేల ఏళ్లు బతికే వరం పొందుతాడు. మరి నా సంగతేమిటని అడుగుతాడు విక్రమార్కుడు. ఇద్దరు కలిసి కదా బతకాలి! అప్పుడు ఆలోచన చేస్తారు. 

సింహాసనం మీద వెయ్యేళ్లు కూర్చుని కదా పాలించమన్నది... అంటే అది ఆయువు పరిమితి కాదు, రాజ్యపాలన పరిమితి. అందుకే ఆరు నెలలు రాజ్య పాలన, ఆరు నెలలు అరణ్యవాస పథకం వేస్తారు. అలా భట్టి విక్రమార్కులు ఇద్దరూ రెండు వేల ఏళ్లు బతుకుతారు. ఒక్క భట్టి విక్రమార్కులేనా? రామాయణంలో దశరథుడు వేల ఏళ్లు బతికాడు. 

ఎందరో మునులు, రుషులు వేల ఏళ్లు తపస్సులోనే గడిపి ఎన్నో శక్తులు సాధించిన కథలున్నాయి. ఎప్పటికీ చనిపోని వరాలు పొందిన రాక్షసులు ఎందరో మన పురాణాల్లో ఉన్నారు. ఎప్పటికీ బతికివుండేలా దేవతలు అమృతాన్ని సేవించారు. చనిపోయినవాళ్లను అట్టే మళ్లీ పునర్జీవింపజేసే సంజీవని కథలు, గాయాలన్నీ మానిపోయి దృఢకాయులయ్యే లేపనాల గాథలు మనకున్నాయి. వేల ఏళ్లు బతకడం అంటే దాదాపుగా చావు లేకపోవడమనే! జీవితానికి అంతం పలికే చావు అనేదాన్ని తప్పించే అన్ని ప్రయత్నాలనూ మనిషి కనీసం కథల్లోనైనా, కలల్లోనైనా చేశాడనుకోవచ్చు.

ఎప్పటికైనా చచ్చిపోతామనే వాస్తవం మనిషిని కలవరపెడుతుంది. సమస్త మానవాళి గురించి కాకపోయినా, కనీసం తన అయినవారు తనకు కాకుండాపోతారన్న చింత ఉండటంతోపాటు తానూ ఒకరోజు ఈ భూమ్మీద శూన్యంగా మిగిలిపోతాడన్నది జీర్ణం చేసుకోలేని చేదుమాత్ర. అన్ని మతాలూ మరణానంతర జీవితాలను వాగ్దానం చేయడంలో అందుకే విజయం సాధించి ఉంటాయి. 

చచ్చాక ఏమీ లేదు అనుకోవడం కంటే, ఆ పైనెక్కడో మళ్లీ బతుకుతాం అనేది ఒక ఊరట. అదే సమయంలో చిట్టచివర చావు అనేది ఉంటుందని తెలియడం కొంతమందికి ఒక రిలీఫ్‌ కూడా. లేకపోతే ఎంతకాలం ఈ రోజువారీ సంకెళ్ల లాంటి వ్యవహారాలను లాక్కురావడం? అందుకే మన పెద్దలు మళ్లీ పుట్టుక లేని ముక్తిని కోరుకున్నారు కాబోలు.

సృష్టిలోని ప్రతి జీవికీ ఒక ఆయుఃప్రమాణాన్ని నిర్దేశించిన ప్రకృతి, మనిషికి 120 ఏళ్లు ఇచ్చింది. శతమానం భవతి అని పెద్దలు దీవిస్తుంటారుగానీ, దాన్ని నూరేళ్లు అనికాక, పూర్ణాయువుతో బతకమని దీవించడంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధంతరంగా మరణించడం ఆ ప్రకృతి వరాన్ని పాడుచేసుకోవడమే. అర్ధంతర మరణం ఆధునిక మానవుడికి సంభవించడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. 

మృత్యువును, రోగాలను మోసం చేసి దీర్ఘకాలం బతగ్గలమా? మన ఆయుఃప్రమాణం కంటే చాలా ఏళ్ల పాటు బతకడాన్ని నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు సాధ్యం చేయనున్నాయా? మనిషి శాశ్వతత్వాన్ని సాధించగలడా? మన ఫిజియాలజీని మార్పు చేయడం ద్వారా జీవితకాలాన్ని పొడిగించవచ్చా? ఇలాంటి ప్రశ్నలను నోబెల్‌ పురస్కారం అందుకున్న వెంకీ రామకృష్ణన్‌  తన ‘వై వి డై: ద న్యూ సైన్స్‌ ఆఫ్‌ ఏజింగ్‌ అండ్‌ ద క్వెస్ట్‌ ఫర్‌ ఇమ్మోర్టాలిటీ’ పుస్తకంలో చర్చించారు. 

మనిషి శరీరం కోటానుకోట్ల కణాల నిర్మితం. ప్రతి కణంలో ఉండే డీఎన్‌ ఏ ప్రతిరోజూ లక్ష మార్పులకు గురవుతుంది. డీఎన్‌ ఏను నాలుగక్షరాల వర్ణమాలలో రాసిన సుదీర్ఘమైన కోడ్‌ అనుకుంటే, నెమ్మదిగా దాని కార్యకలాపంలో అంతరాయం రావడమే ముదిమి రావడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 బయోటెక్‌ కంపెనీలు ముదిమి, జీవితకాల పొడిగింపు మీద పని చేస్తున్నాయి. 

‘యవ్వనంలో ఉన్నప్పుడు ధనికులం కావాలనుకుంటాం; ధనికులం అయ్యాక యవ్వనాన్ని కోరుకుంటాం. యవ్వనాన్ని కొనలేకపోయినా, కనీసం దానిమీద పరిశోధనలనైనా (ఏజింగ్‌ రీసెర్చ్‌) ధనికులు కొంటున్నా’రంటారు వెంకీ రామకృష్ణన్‌ . ఒకవేళ శాస్త్ర పరిశోధనలు ముదిమిని ఆపడంలో విజయం సాధించినా ఆ ఫలితాలు సంపన్నులకు తప్ప పేదవాళ్లకు తేలిగ్గా అందుబాటులోకి రావని చెబుతారు.

ఈ శాస్త్రాలు, పరిశోధనలతో నిమిత్తం లేకుండా; ధనిక, పేద అనే తేడా లేకుండా జీవితాన్నే ఒక సాధనగా మలుచుకున్న కొన్ని ప్రాంతాల్లో మనుషులు సంపూర్ణ ఆయువును అనుభవిస్తున్నారు. ఒకినావా (జపాన్‌ ), సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్‌), లోమ లిండా (కాలిఫోర్నియా, అమెరికా)... లాంటి ప్రదేశాల్లో ఎక్కువమంది వందేళ్లు బతకడమో, దీర్ఘకాలం బతకడమో కనబడుతుంది. 

ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో ‘బ్లూ జోన్స్‌’గా నిలుస్తున్నాయి. ‘లివ్‌ టు 100: సీక్రెట్స్‌ ఆఫ్‌ ద బ్లూ జోన్స్‌’ డాక్యుమెంటరీ ప్రయోక్త డాన్‌  బ్యూట్నర్‌... ఈ బ్లూ జోన్స్‌ అని నామకరణం చేయడమే కాకుండా, వాళ్ల దీర్ఘాయువు రహస్యాలను పరిశోధించారు. శారీరక కార్యకలాపాలు, తక్కువ ఒత్తిడి, స్థానికంగా దొరికే ఆహారాన్ని వినియోగించడం, బలమైన కుటుంబ, సామాజిక సంబంధాలు వీరిని ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాయని బ్యూట్నర్‌ చెబుతారు. 

రసాయనిక ఎరువులు వేయని పంటలు, 95 శాతం మొక్క ఆధారిత ఆహారం, ఎనభై శాతం మాత్రమే తిని కడుపులో కొంత ఖాళీ ఉంచుకోవడంతోపాటు, జీవితానికి ఒక ఉద్దేశం ఉంచుకోవడం వారిని ఉత్సాహవంతులుగా ఉంచే అదనపు విషయాలు. వెంకీ రామకృష్ణన్‌  అయినా, బ్లూ జోన్స్‌ శతాధికులైనా మనిషి ఆరోగ్యానికి కీలకమని చెప్పేవి మూడు: ఆహారం, వ్యాయామం, నిద్ర. ఇవైతే మన చేతిలోనే ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement