పారిశ్రామిక కృషీవలుడు
మన దిగ్గజాలు
కొందరు మాత్రమే కొన్ని రకాల వ్యాపారాలను చేయగలరు. సంక్లిష్టతలకు, ఒడిదుడుకులకు నెలవైన వ్యవసాయ పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టాలంటే ఎంతో తెగువ ఉండాలి. అంతేకాదు, నేల మీద, నేలనే నమ్ముకుని ఆరుగాలం శ్రమించే రైతన్నల మీద ఎంతో మమకారం కూడా ఉండాలి. ఆహార పరిశ్రమ రంగంలో భారత ప్రతినిధిగా కొమ్ములు తిరిగిన అంతర్జాతీయ సంస్థలకు సవాలు విసిరినా, కేవలం రూ.7 వేల పెట్టుబడితో మొదలుపెట్టిన వ్యాపార సామ్రాజ్యాన్ని రూ.7 వేల కోట్లకు విస్తరించినా... అది భవర్‌లాల్ హీరాలాల్ జైన్‌కు మాత్రమే సాధ్యమైంది. భారత ఆహార పరిశ్రమ రంగంలో ఆయన సృష్టించిన చరిత్ర చిరస్మరణీయం.
నిత్యకృషీవలుడి నేపథ్యం
నిత్యకృషీవలుడైన భవర్‌లాల్ హీరాలాల్ జైన్ 1937 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా వాకోడ్ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు హీరాలాల్ సాగర్‌మల్ జైన్, గౌరీ హీరాలాల్ జైన్. వారిది వ్యవసాయ నేపథ్యం గల మార్వాడీ జైన కుటుంబం. వీరి పూర్వీకులు రాజస్థాన్ నుంచి మహారాష్ట్రకు వలస వచ్చారు. భారతదేశంలో మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీ పరిశ్రమకు ఆద్యుడు భవర్‌లాల్. ఆయన స్థాపించిన జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ (జేఐఎస్‌ఎల్) మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పరిశ్రమగా గుర్తింపు సాధించింది.
సివిల్స్‌ను త్యజించి... సాగును ప్రేమించి...
భవర్‌లాల్ 23 ఏళ్ల వయసులోనే బీకామ్, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలను పూర్తి చేశారు. లా కోర్సు పూర్తిచేసిన వెంటనే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లోనూ నెగ్గారు. అయితే, వ్యవసాయంపై గల ప్రేమతో ఆయన సివిల్స్ కొలువును తృణప్రాయంగా త్యజించారు. తొలుత వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నా, ఇంటికి పెద్ద కొడుకు కావడంతో కుటుంబ వ్యాపార బాధ్యతలను కూడా భుజాన వేసుకోక తప్పలేదు. వ్యాపారంలోకి ప్రవేశించిన తొలి రోజుల్లో ఆయన తోపుడు బండిపై వీధుల్లో కిరోసిన్‌ను అమ్మేవారు.
1972లో కేవలం రూ.7 వేల పెట్టుబడితో వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ట్రాక్టర్లు, పీవీసీ పైపులు, స్ప్రింక్లర్ సిస్టమ్స్ వంటి వ్యవసాయ పరికరాల పంపిణీ వ్యాపారం కొనసాగించడం వల్ల ఆయనకు వ్యవసాయ రంగంపై అవగాహన మరింత విస్తృతమైంది. వ్యవసాయ రంగానికి తన వంతుగా మరింతగా ఏదైనా చేయాలని ఆలోచించేవారు. నిరంతర అధ్యయనం సాగించేవారు.
అరటిపొడి కర్మగారంతో అరంగ్రేటం..
అప్పులో కూరుకుపోయిన అరటిపొడి కర్మాగారాన్ని 1978లో కొనుగోలు చేసి పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టారు. దానిని లాభాల బాట పట్టించారు. ఆ తర్వాత రెండేళ్లకే 350 టన్నుల వార్షిక సామర్థ్యం గల పీవీసీ పైపుల కర్మాగారాన్ని స్థాపించారు. దాని సామర్థ్యాన్ని 1997 నాటికి 35 వేల టన్నులకు పెంచారు. డ్రిప్ ఇరిగేషన్‌పై రైతుల్లో అవగాహన కల్పించేందుకు 1987-88లో ఏకంగా వెయ్యి ఎకరాల్లో ఒక ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపించారు.
దీనికోసం కాందేష్ ప్రాంతంలో జల్‌గావ్-పచోరా రోడ్డు మార్గంలో కొండలు, తుప్పలతో నిండిన బంజరు భూమిని కొనుగోలు చేసి, దానిని చదును చేసి వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దారు. తర్వాతి కాలంలో ఇక్కడ జైన్ అగ్రిపార్క్, జైన్ ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసి ఆహార పంటలలో కొత్త ప్రయోగాలకు ఊతమిచ్చారు. తెగుళ్లను తట్టుకుని, అధిక దిగుబడులను ఇచ్చే టిష్యూ కల్చర్ అరటి రకం గ్రాండ్ నైన్‌ను అందించిన ఘనత భవన్‌లాల్‌కే దక్కుతుంది. ఆయన స్థాపించిన జైఐఎస్‌ఎల్ ప్రస్తుతం సేంద్రియ ఎరువులు, సోలార్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరికరాలు వంటివి తయారు చేస్తోంది. పండ్లు కూరగాయల ప్రాసెసింగ్‌లో ఇది దేశంలోనే అతి పెద్ద కంపెనీ. అంతేకాదు, ఈ కంపెనీ ఉల్లి ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఆయన నెలకొల్పిన ఈ వ్యవసాయ క్షేత్ర ప్రాంతం ఇప్పుడు జైన్ హిల్స్, జైన్ వ్యాలీగా ప్రసిద్ధి పొందింది.
గాంధీ మార్గంలో...
మహాత్మాగాంధీపై అపార గౌరవం గల భవర్‌లాల్, గాంధీ సిద్ధాంతాలపై అధ్యయనం కోసం 2012లో గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. ఇందులోనే గాంధీజీకి చెందిన వస్తువులతో మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. భవర్‌లాల్ అండ్ కాంతాబాయ్ జైన్ మల్టీపర్పస్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, గ్రామీణాభివృద్ధి, విద్యా రంగాల్లో పలు సేవా కార్యక్రమాలకు ఊతమిచ్చారు. 2007లో ఆయన స్థాపించిన ‘అనుభూతి’ స్కూల్ ‘గ్రీన్ స్కూల్’ అవార్డు సాధించింది. ఇంగ్లిష్, మరాఠీ భాషలలో ఆయన రచించిన పలు పుస్తకాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
ఆధునిక నీటిపారుదల పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు గుర్తింపుగా భవర్‌లాల్‌కు 1997లో అమెరికా ఇరిగేషన్ అసోసియేషన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రాఫోరైడ్ మెమోరియల్ పురస్కారం దక్కింది. రైతుల ముంగిట్లోకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చేందుకు అహరహం శ్రమించిన ఈ నిత్యకృషీవలుడు 2016 ఫిబ్రవరి 25న కన్నుమూశారు.
- దండేల కృష్ణ