vegitables garden
-
మట్టిపై నమ్మకం.. మొక్కలపై మక్కువ!
ఒకటి కాదు పది కాదు.. ఏకంగా 35 ఏళ్ల మాట. పుట్టింటి నుంచి తెచ్చిన మాసుపత్రి, మరువం మొక్కలను, వాటితోపాటు తెచ్చిన మట్టిని, మట్టి కుండీని కూడా తన ఇంటిపైన కూరగాయలు, పండ్ల తోట పొత్తిళ్లలో ఉంచి అపురూపంగా చూసుకుంటున్నారు సీనియర్ మోస్ట్ సిటీ ఫార్మర్ నూర్జహాన్. ఆమెకు మట్టి మీద నమ్మకం ఉంది, మొక్కల మీద మక్కువ వుంది. ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి తరలి వచ్చి 35 ఏళ్లయినా అవి చెక్కుచెదరలేదు సరికదా.. వందల రెట్లు పెరిగాయి! వారి మేడపైన వందలాది పండ్లు, కూరగాయ మొక్కలై వర్థిల్లుతున్నాయి. నూర్జహాన్ గుండెల నిండుగా ఉన్న ప్రకృతిపై ప్రేమ.. వారి ఇంటిపై సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటగా విరిజిల్లుతూ కుటుంబానికి వరప్రసాదంగా మారింది. ఒంగోలులో పుట్టిన ఆమె ప్రకాశం జిల్లా కరవదికి చెందిన రహంతుల్లాతో వివాహం అయిన తర్వాత భాగ్యనగరానికి వచ్చి ఆసిఫ్‌నగర్‌లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. పోలీస్‌గా పనిచేసిన రహంతుల్లా ఇటీవలే హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరయ్యారు. అద్దె ఇళ్లలో ఉన్న 15 ఏళ్లు కొద్ది కుండీలకే పరిమితమైన నూర్జహాన్ ఇంటిపంటలు.. 20 ఏళ్ల క్రితం వెయ్యి చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకున్నాక రెండు మడులు వందల కుండీలుగావిస్తరించింది. ఇంటి పిట్టగోడలపైన, దారి పక్కన, మేడపైన.. ఎక్కడ చూస్తే అక్కడ ఇంటిపంటలు వందలాది చిన్నా పెద్దా కుండీల్లో ఫలప్రదంగా అలరారుతున్నాయి. పాత డబ్బాలు, సీసాలు, సేట్‌కేసులు.. పచ్చని మొక్కలకు ఆలంబనగా మారి కనిపిస్తాయి. ఇరుకు అనేది ఇంటిపంటల సాగుకు సమస్యే కాదని ఆమె నిరూపిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అని నూర్జహాన్ ఇంటిపంటలను చూస్తే ఇట్టే అర్థమవతుంది ఎవరికైనా. సేంద్రియ ఇంటిపంటల సాగులో అనుసరిస్తున్న పద్ధతులు ఆసక్తిగొలుపుతున్నాయి. ఒక మడిలో 4 కుండీలు.. పది మొక్కలు.. ఉద్యాన శాఖ ఇచ్చిన పెద్ద సిల్పాలిన్ రౌండ్ గ్రోబాగ్స్‌తోపాటు తాము నిర్మించుకున్న ఇటుకల సిమెంటు మడుల్లో కూడా ఇంటిపంటలను నూర్జహాన్ సాగు చేస్తున్నారు. మేడ పైన నాపరాళ్లు పరిచి వాటిపైన ఇటుకలతో మడి నిర్మించుకుంటే శ్లాబ్ లీక్ అవకాశం ఉండదు అంటారామె. రౌండ్ గ్రోబాగ్/ ఇటుకల మడిలో ఒకటికి పది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఉండేలా చూసుకోవడం విశేషం. రౌండ్ గ్రోబ్యాగ్/ ఇటుకల మడిలో మట్టి నింపిన తర్వాత.. ఆ మట్టి మీద 3 లేక 4 పండ్ల మొక్కల కుండీలను పెడతారు. ఆ కుండీల అడుగు భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. కుండీల్లో మొక్కల వేర్లు అడుగున ఉన్న రౌండ్ గ్రోబాగ్/ ఇటుకల మడిలోని మట్టి లోపలికి కూడా విస్తరిస్తాయి. అందువల్ల ఆ కుండీలను పెట్టిన దగ్గరి నుంచి కదిలించరు. మట్టి మార్చరు. ఆ కుండీల చుట్టూ గ్రోబాగ్ / ఇటుకల మడిలోని మట్టిలో కూరగాయ మొక్కలు, తీగ జాతి కూరగాయలు, ఆకుకూరలు వేస్తారు. కూరగాయ మొక్కల పంట అయిపోయిన తర్వాత ఆ మొక్కను తీసేసి.. అక్కడి మట్టి కూడా కొద్దిగా తీసి ఆ గుంతలో వంటింటి వ్యర్థాలు, ఆకులు అలములు వేసి కంపోస్టు తయారయ్యేలా చూస్తారు. అంతే. ప్రతి 15 రోజులకో, నెలకో కంపోస్టు ఎరువు వేయాల్సిన అవసరం లేదంటారు సీనియర్ మోస్ట్ సిటీ ఫార్మర్ నూర్జహాన్(98852 24081). ఫొటోలు: కె. రమేశ్‌బాబు, సీనియర్ ఫొటోగ్రాఫర్ -
మేడపైన కూరగాయల వనం..
ఆ ఉమ్మడి కుటుంబానికి వరం! తిరుపతి పట్టణంలోని ఆ ఉమ్మడి కుటుంబం సేంద్రియ ఇంటిపంటల సాగును నెత్తిన పెట్టుకుంది. తోడికోడళ్లు చేయీ చేయీ కలిపి తమ తీరిక సమయాన్ని వెచ్చించి చాలా ఏళ్లుగా ఇంటిపంటలు పండిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన తాజా కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని పండ్లను స్వయంకృషితో పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తిరుపతిలోని రైల్వే కాలనీలో మట్లూరు మునికృష్ణారెడ్డి కుటుంబం చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నది. 10 మంది ఉన్న చక్కని ఉమ్మడి కుటుంబం వారిది. కలిసి ఉంటే కలదు సుఖం అని చాటిచెబుతున్న ఆ కుటుంబం చాలా ఏళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడం విశేషం. సుమారు 15 ఏళ్ల క్రితం పెద్ద కోడలు మట్లూరు ఇందిరమ్మ మేడ మీద ఇంటిపంటల పెంపకానికి ముందుచూపుతో శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మకు తోడికోడలు భాగ్యమ్మ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు తమ మేడపైనే కుటుంబానికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలతోపాటు కొన్ని రకాల పండ్లను కూడా సాగు చేస్తున్నారు. అన్ని పనులూ తామే చూసుకుంటున్నారు. వంగ, మునగ, సొర, వంటి కాయగూరలు..కాకర, బీర వంటి తీగజాతి కూరగాయలు.. తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు.. దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, అరటి వంటి పండ్ల మొక్కలను వారు ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు. దీని కోసం రూ. 30 వేలు ఖర్చు చేసి ఇంటిపైనే సిమెంట్ తొట్టెలు నిర్మించారు. 40కు పైగా ప్లాస్టిక్ కుండీలను ఉపయోగిస్తున్నారు. తీగజాతి పాదుల కోసం కర్రలతో ఒక వైపున పందిళ్లు వేయించారు. మొక్కలు పెంచేందుకు చివికిన ఆవు పేడ ఎరువు, ఎర్రమట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. ప్రతి నాలుగు నెలలకోసారి కుండీలు, తొట్టెల్లో నుంచి పావు వంతు మట్టి తీసి, కొత్త మట్టి మిశ్రమాన్ని నింపుతుంటారు. ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదల బాగుందంటున్నారు. వేప పిండి, టీ డికాషన్, వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, కొద్దిపాటి ఆవుపేడను కలిపి కుళ్లబెట్టి మొక్కలకు ఎరువుగా అందిస్తున్నారు. 5 మి.లీ. వేపనూనెను లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసి పేనుబంకను, పిండినల్లిని నివారిస్తున్నారు. వంటనూనె రాసిన పసుపు పచ్చని అట్టలను వేలాడ గట్టి రసం పీల్చే పురుగుల బెడదను నివారిస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని మొక్కలపై పిచికారీ చేస్తున్నారు. ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసి మొక్కల మొదళ్ల వద్ద నీరు పడేలా వాటికి రంధ్రాలు ఏర్పాటు చేసి, నీటిని పొదుపుగా వాడుతున్నారు. - పి. సుబ్రమణ్యం, తిరుపతి కల్చరల్ రోజుకో గంట కేటాయిస్తే చాలు.. పెరుగుతున్న ఖర్చుతో భవిష్యత్తులో ఇబ్బంది తప్పదన్న ముందుచూపుతోనే 15 ఏళ్ల క్రితమే ఆకుకూరలతో మేడపై ఇంటి పంటల సాగు ప్రారంభించాము. తోడికోడళ్లు ఇద్దరమూ రోజుకో గంట సమయం కేటాయిస్తున్నాం. సేంద్రియ పద్ధతుల్లో ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లను కుటుంబ సభ్యులకు తాజాగా అందించగలుగుతున్నాం. ఈ వ్యాపకం మా కుటుంబానికి ఆరోగ్యంతోపాటు ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తోంది. - మట్లూరు ఇందిరమ్మ (98496 80857), రైల్వే కాలనీ, తిరుపతి