మేడపైన కూరగాయల వనం..
ఆ ఉమ్మడి కుటుంబానికి వరం! తిరుపతి పట్టణంలోని ఆ ఉమ్మడి కుటుంబం సేంద్రియ ఇంటిపంటల సాగును నెత్తిన పెట్టుకుంది. తోడికోడళ్లు చేయీ చేయీ కలిపి తమ తీరిక సమయాన్ని వెచ్చించి చాలా ఏళ్లుగా ఇంటిపంటలు పండిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన తాజా కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని పండ్లను స్వయంకృషితో పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తిరుపతిలోని రైల్వే కాలనీలో మట్లూరు మునికృష్ణారెడ్డి కుటుంబం చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నది. 10 మంది ఉన్న చక్కని ఉమ్మడి కుటుంబం వారిది. కలిసి ఉంటే కలదు సుఖం అని చాటిచెబుతున్న ఆ కుటుంబం చాలా ఏళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడం విశేషం. సుమారు 15 ఏళ్ల క్రితం పెద్ద కోడలు మట్లూరు ఇందిరమ్మ మేడ మీద ఇంటిపంటల పెంపకానికి ముందుచూపుతో శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మకు తోడికోడలు భాగ్యమ్మ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు తమ మేడపైనే కుటుంబానికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలతోపాటు కొన్ని రకాల పండ్లను కూడా సాగు చేస్తున్నారు. అన్ని పనులూ తామే చూసుకుంటున్నారు. వంగ, మునగ, సొర, వంటి కాయగూరలు..కాకర, బీర వంటి తీగజాతి కూరగాయలు.. తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు.. దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, అరటి వంటి పండ్ల మొక్కలను వారు ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు.
దీని కోసం రూ. 30 వేలు ఖర్చు చేసి ఇంటిపైనే సిమెంట్ తొట్టెలు నిర్మించారు. 40కు పైగా ప్లాస్టిక్ కుండీలను ఉపయోగిస్తున్నారు. తీగజాతి పాదుల కోసం కర్రలతో ఒక వైపున పందిళ్లు వేయించారు. మొక్కలు పెంచేందుకు చివికిన ఆవు పేడ ఎరువు, ఎర్రమట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. ప్రతి నాలుగు నెలలకోసారి కుండీలు, తొట్టెల్లో నుంచి పావు వంతు మట్టి తీసి, కొత్త మట్టి మిశ్రమాన్ని నింపుతుంటారు. ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదల బాగుందంటున్నారు.
వేప పిండి, టీ డికాషన్, వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, కొద్దిపాటి ఆవుపేడను కలిపి కుళ్లబెట్టి మొక్కలకు ఎరువుగా అందిస్తున్నారు. 5 మి.లీ. వేపనూనెను లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసి పేనుబంకను, పిండినల్లిని నివారిస్తున్నారు. వంటనూనె రాసిన పసుపు పచ్చని అట్టలను వేలాడ గట్టి రసం పీల్చే పురుగుల బెడదను నివారిస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని మొక్కలపై పిచికారీ చేస్తున్నారు. ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసి మొక్కల మొదళ్ల వద్ద నీరు పడేలా వాటికి రంధ్రాలు ఏర్పాటు చేసి, నీటిని పొదుపుగా వాడుతున్నారు.
- పి. సుబ్రమణ్యం, తిరుపతి కల్చరల్
రోజుకో గంట కేటాయిస్తే చాలు..
పెరుగుతున్న ఖర్చుతో భవిష్యత్తులో ఇబ్బంది తప్పదన్న ముందుచూపుతోనే 15 ఏళ్ల క్రితమే ఆకుకూరలతో మేడపై ఇంటి పంటల సాగు ప్రారంభించాము. తోడికోడళ్లు ఇద్దరమూ రోజుకో గంట సమయం కేటాయిస్తున్నాం. సేంద్రియ పద్ధతుల్లో ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లను కుటుంబ సభ్యులకు తాజాగా అందించగలుగుతున్నాం. ఈ వ్యాపకం మా కుటుంబానికి ఆరోగ్యంతోపాటు ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తోంది.
- మట్లూరు ఇందిరమ్మ
(98496 80857), రైల్వే కాలనీ, తిరుపతి