ఇరవై రెండేళ్ల మందిసా మటేంజ్వా స్వస్థలం.. దక్షిణ ఆఫ్రికా, క్వాజూలూ–నటాల్ రాష్ట్రంలోని ఎంపాంగని అనే పట్టణం. రెండేళ్ల క్రితం.. యూనివర్సిటీ ఆఫ్ ద ఫ్రీ స్టేట్‌లో బీఎస్సీ పూర్తిచేసింది. అందులో అగ్రికల్చర్ కూడా ఒక సబ్జెక్ట్. డిగ్రీ అయ్యాక ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటున్న క్రమంలో మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ ఆఫర్ చేస్తున్న ‘హేండ్‌పిక్’ అర్బన్ అగ్రికల్చర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి తెలిసి జాయినైంది. డర్బన్ నగరంలో అర్బన్ అగ్రికల్చర్ శిక్షణ కేంద్రంలో ఇంటర్న్‌గా చేరింది. 12 నెలల ఆ శిక్షణ మందిసా జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. ప్రస్తుతం ఆమె డర్బన్ నగరంలోని కామతేంజ్వా అర్బన్ ఫామ్‌కి యజమాని కమ్ మేనేజర్. కాప్సికం, ఫ్రిల్లీ, బటర్ లెట్యూస్, బేబీ పాలకూర, తులసి, పచ్చిమిర్చి, పుదీనా, పార్ల్సీ, ఉల్లికాడలు వంటి కూరగాయలు, ఔషధ మొక్కల్ని సాగు చేసి నగరవాసులకు విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతోంది.
ఓ యువ గ్రాడ్యుయేట్ సుశిక్షితురాలైన అర్బన్ అగ్రిప్రెన్యూర్‌గా మారింది. సాధికారతకు పవర్ ఇది. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ గత మూడేళ్లలో మందిసా సహా 24 మంది గ్రాడ్యుయేట్లను ‘హాండ్‌పిక్’ ప్రోగ్రామ్‌లో భాగంగా స్వతంత్ర అర్బన్ ఫార్మర్స్‌గా మార్చింది. సుస్థిర సాగు పద్ధతులను నేర్పించటం ద్వారా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఔషధ మొక్కల్ని నగరాల్లో, నగర పరిసర ప్రాంతాల్లో స్థానికంగానే పండించుకొని తినటం అలవాటు చేయటమే మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ లక్ష్యం. ఆఫ్రికన్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గృహస్థులకు, నగరవాసులకు కూడా హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటల సాగును ఈ ఫౌండేషన్ నేర్పిస్తోంది. తక్కువ స్థలంలో, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించటం కోసం కొబ్బరి పొట్టు ఎరువులో ద్రవరూప ఎరువులను వాడే పద్ధతిని ఇది ప్రాచుర్యంలోకి తెస్తోంది.
ఒక్కో కుండీకి పంటను బట్టి 4–6 మొక్కలు చొప్పున, నిలువుగా ఒకదాని కింద మరొకటి 4 కుండీలు ఉండేలా హైడ్రోపోనిక్ వర్టికల్ టవర్లను ఉపయోగిస్తోంది. 16 నుంచి 24 మొక్కల్ని మనిషి నిలబడేంత చోటులోనే పండించటం ఈ టవర్ల ప్రత్యేకత. ఈ టవర్లకు ‘ఆఫ్రికన్ గ్రోయర్’ అని పేరు పెట్టారు. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ అనేక చోట్ల అర్బన్ అగ్రికల్చర్ శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తోంది. కేప్‌టౌన్ నగరంలోని లాంగా ప్రాంతంలో కొద్ది నెలల క్రితం ఒక సిటీ రూఫ్‌టాప్ ఫామ్ ప్రారంభమైంది. రీడిఫైన్ ప్రాపర్టీస్ అనే రిటైల్ వాణిజ్య సంస్థతో కలసి కెనిల్‌వర్త్ సెంటర్ పేరిట ఈ ఫామ్‌ను మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.
ఈ స్థలాన్ని ఉచితంగా రీడిఫైన్ ప్రాపర్టీస్ ఇచ్చింది. ఈ హైడ్రోపోనిక్ ఫామ్‌లో పండించే కూరగాయలు అమ్మగా వచ్చే ఆదాయం ఫౌండేషన్ కార్యకలాపాలకే వినియోగిస్తున్నారు. రీడిఫైన్ ప్రాపర్టీస్ చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్ అనెలిసా కెకె.. ‘యువత నిరుద్యోగ సమస్యకు అర్థవంతమైన, దీర్ఘకాలిక సుస్థిర పరిష్కారాన్ని వెతకాలని ప్రయత్నిస్తున్నాం. పనిలో పనిగా స్థానిక ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందుబాటులోకి తేవాలన్నది మా ఉద్దేశం. యువత ఉపాధికి, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఏ విధంగా తోడ్పాటునందించవచ్చో తెలియజెప్పడానికి రిటైల్ వాణిజ్య భవన సముదాయాల యజమానులు ఒక ఉదాహరణగా నిలవాలన్నదే మా ప్రయత్నం’ అంటున్నారు.
మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ అర్బన్ అగ్రికల్చర్ కృషికి పలు సంస్థలు తోడ్పాటునందిస్తున్నాయి. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ హేండ్‌పిక్ ప్రోగ్రామ్ నిర్వాహకుడు డేవిడ్ చర్చ్‌మన్ ‘రసాయనిక వ్యవసాయ పద్ధతులకు భిన్నమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులను స్థానికులకు అలవాటు చేయటం, స్థానికంగానే కూరగాయలు, ఔషధమొక్కల ఉత్పత్తిని పెంపొందించడటం లక్ష్యంగా పనిచేస్తున్నాం. మా వద్ద శిక్షణ పొందిన వారి సుసంపన్నమైన అనుభవాలను నగరాల్లో జరిగే వివిధ సభలు, సమవేశాల్లో వారితోనే చెప్పిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సంతృప్తికరమైన ఫలితాలే వస్తున్నాయి’ అంటూ వివరించారు.
– పంతంగి రాంబాబు
prambabu.35@gmail.com
Comments
Please login to add a commentAdd a comment