Dubai Rooftop Has Been Transformed Into This Incredible Vertical Farm, See More Details - Sakshi
Sakshi News home page

Dubai Vertical Farm: దుబాయ్‌ సిగలో 'రూఫ్‌టాప్‌ సేద్యం'

Published Sat, Jul 15 2023 10:41 AM | Last Updated on Sat, Jul 15 2023 4:39 PM

Dubai Rooftop Has Been Transformed Into Incredible Vertical Farm - Sakshi

ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని ఏడు నగరాల్లోకెల్లా అత్యధిక జనసాంద్రత గల నగరం దుబాయ్‌. అద్భుతమైన నిర్మాణ కౌశలానికి ఇది మారుపేరు. దుబాయ్‌ అంటే చప్పున గుర్తొచ్చేది బుర్జ్‌ ఖలీఫా (భమ్మీద అత్యంత ఎత్తయిన 830 మీటర్ల భవనం) వంటి ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన జీవనశైలే తప్ప.. వ్యవసాయం అసలు కాదు. అయితే, అది పాత సంగతి. ఇప్పుడు దుబాయ్‌ సిగలో ‘రూఫ్‌టాప్‌ సేద్యం’ తళుక్కుమంటోంది. పచ్చదనం, పర్యావరణ హితమైన జీవనం వైపు ఈ ప్రత్యేక ఉద్యమం దుబాయ్‌ పట్టణ వాతావరణాన్ని క్రమంగా పునర్నిర్మిస్తోంది. కాంక్రీటు అరణ్యానికి ఆకుపచ్చని సొబగులు అద్దుతోంది. ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలను భవనాల పైకప్పులపైనే నగరవాసులు పండించుకుంటున్నారు. అర్బన్‌ అగ్రికల్చర్‌ భావన అనేక ప్రయోజనాలను అందిస్తోంది.

ఆకుపచ్చని పంటలతో నిండిన సుస్థిరమైన జీవనాకాంక్షను నెరవేర్చటం, వీలైనంత వరకు ఆహార భద్రతకు తోడ్పడడంతో పాటు.. నగరపు రొద మధ్యలో మనోల్లాస వాతావరణాన్ని కల్పిస్తోంది. రఫ్‌టాప్‌ కిచెన్‌ గార్డెనింగ్‌ ఎంత పాపులర్‌ అయ్యిందంటే.. ఇంటిపైన ఆహారాన్ని పండించుకునే సదుపాయాన్ని కల్పించే భవన నిర్మాణ ప్రాజెక్టుల కోసమే వెతుకుతున్నారంటే ఆశ్చర్యం లేదు! తీవ్రమైన ఎడారి వాతావరణం కారణంగా యూఏఈ.. ఆహారం మొత్తాన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తామరతంపరగా విస్తరిస్తున్న మిద్దె తోటల వల్ల ఆహార దిగుమతి కొంతమేరకైనా తగ్గే అవకాశం కనపడుతోంది. ఈ ట్రెండ్‌ వెనుక.. పర్యావరణానికి మేలు చేసే పనులను ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సహిస్త విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. 2050 నాటికి సుస్థిర జీవనం విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా మారాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో యూఏఈ ముందడుగేస్తోంది. ఆహారాన్ని స్థానికంగా పండించుకోవటం, కాంక్రీటు భవనాల ద్వారా విడుదలయ్యే వేడిని తగ్గించుకోవడం వంటి పనులకు లభిస్తున్న ప్రభుత్వ తోడ్పాటుతో దుబాయ్‌ వాసుల్లో మిద్దె తోటలపై అవగాహన, ఆసక్తి నానాటికీ ఇనుమడిస్తోంది.

రఫ్‌టాప్‌ సేద్యం అంటే కేవలం పరిసరాలను పచ్చగా వర్చడం లేదా పంటలు పండించడం మాత్రమే కాదు. నలుగురూ కలసికట్టుగా పనిచేసే సంస్కృతికి నారు పొయ్యటం కూడా. నగరవాసులు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రకృతితో మమేకం కావడానికి మిద్దె తోటలు నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తున్నాయని దుబాయ్‌ వాసులు సంతోషపడుతున్నారు. ఎడారిలో సాధ్యమేనా? ఎడారి పరిస్థితులు ఉన్నప్పటికీ మిద్దెపైన ప్రత్యేక నిర్మాణాల ద్వారా కూరగాయలు, ఔషధ మొక్కలు సాగు చేసుకునేందుకు హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్‌ వంటి అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు దోహదం చేస్తున్నాయి. తులసి, కలబంద వంటి ఔషధ మొక్కలు.. పాలకూర, చార్డ్, లెట్యూస్‌ వంటి పంటలను సులభంగా పండిస్తున్నారు.

సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే ఈ పద్ధతులతో పోల్చితే అతి తక్కువ నీరే ఖర్చవుతోంది. నీటి కొరత పెద్ద సమస్యగా ఉన్న దుబాయ్‌ వంటి ప్రాంతంలో ఈ సాగు పద్ధతులు ఉపయోగకరం. నివాస భవనాలపై ప్రత్యేక శ్రద్ధతో రఫ్‌గార్డెన్లు నిర్మిస్తున్నందు వల్ల ‘అర్బన్‌ హీట్‌ ఐలాండ్‌ ఎఫెక్ట్‌’ను తగ్గించడంలో తోడ్పడుతోంది. శీతలీకరణ అవసరాలు తగ్గుతున్నాయని భవన నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. సొంత రఫ్‌టాప్‌ ఫామ్‌ను ఏర్పాటు చేసుకునే ఆసక్తి ఉన్నవారికి వర్గనిర్దేశం చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు సత్ఫలితాలనిస్తున్నాయి.

‘రియల్‌’ ఆకర్షణ...
నూతన సాంకేతిక ఆవిష్కరణలు, భవన నిర్మాణంలో జరుగుతున్న మార్పులు, ప్రభుత్వ మద్దతు, వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర జీవనశైలిపై పెరుగుతున్న సామాజిక అవగాహన.. దుబాయ్‌లో రఫ్‌టాప్‌ ఫార్మింగ్‌ విస్తరణకు దోహదపడుతున్నాయి. దీని వల్ల పట్టణ జీవవైవిధ్యం మెరుగుపడుతుంది. కాలుష్య కారకాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో గాలి నాణ్యత మెరుగవుతోంది. రఫ్‌టాప్‌ ఫార్మింగ్‌ సదుపాయాన్ని జోడించే రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు పర్యావరణ స్పృహతో ఉన్న కొనుగోలుదారులను, ఆరోగ్యకరమైన జీవనానికి విలువనిచ్చే అద్దెదారులను ఆకర్షిస్తున్నాయి.

ఈ ట్రెండ్‌ కేవలం రెసిడెన్షియల్‌ భవనాలకే పరిమితం కాలేదు. వాణిజ్య భవనాలపై కప్పులపై కూడా పంటల సాగు ఏర్పాట్లు నిర్మించటం సామాజిక బాధ్యతగా బిల్డర్లు భావిస్తున్నారు. ఇది సానుకల ప్రభావాన్ని కలిగిస్తోంది. స్మార్ట్‌ ఇరిగేషన్, సెన్సర్లు, డేటా అనలిటిక్స్‌ ద్వారా రఫ్‌టాప్‌ ఫార్మింగ్‌ మెరుగైన ఫలితాలను ఇవ్వడమే కాక, నేర్చుకునే వారికి ఆకర్షణీయంగా వరింది. విలాసాలను త్యాగం చేయకుండా నగరాలు ఆహార స్వావలంబన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎలా స్వీకరించవచ్చో చెప్పడానికి దుబాయ్‌లో పెరుగుతున్న మిద్దె తోటల ధోరణి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పొచ్చు.

(చదవండి: 14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement