రైతు ఆత్మహత్యలన్నీ ‘క్లైమేట్ ఛేంజ్ డెత్’లే! | All of Farmers' suicides are Climate Change Death | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలన్నీ ‘క్లైమేట్ ఛేంజ్ డెత్’లే!

Published Thu, Mar 19 2015 12:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతు ఆత్మహత్యలన్నీ ‘క్లైమేట్ ఛేంజ్ డెత్’లే! - Sakshi

రైతు ఆత్మహత్యలన్నీ ‘క్లైమేట్ ఛేంజ్ డెత్’లే!

విశ్వవరం మోహన్‌రెడ్డి.. పర్యావరణ, సేంద్రియ వ్యవసాయోద్యమకారుడు. నల్గొండ జిల్లా ఆత్మకూరులో 60 ఏళ్ల క్రితం మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు. వ్యవసాయ సంక్షోభ మూల కారణాలను కొత్తకోణంలో అర్థం చేసుకుంటూ.. సులువైన పరిష్కార మార్గాన్ని అనుభవపూర్వకంగా సూచిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలన్నీ  ‘క్లైమేట్ ఛేంజ్ డెత్’లేనని, ఇందుకు మూలం ‘హరిత విప్లవ భూతమే’నంటారాయన.

మెట్ట భూముల్లో లోతైన కందకాలు తవ్వి.. సేంద్రియ సేద్యం చేపడితే.. కరువు కాలంలోనూ రెండు సీజన్లలో ఆరుతడి పంటలకు ఢోకా ఉండదంటున్నారు.  పాలమూరు జిల్లాలో మెట్ట సేద్యానికి కాయకల్ప చికిత్స చేస్తున్న మోహన్‌రెడ్డి (87900 51059)తో ‘
సాక్షి’ ఇటీవల ముచ్చటించింది. ముఖ్యాంశాలు మీ కోసం..
 
- చేనుకు చినుకులే చాలు!
- ఇది ‘హరిత విప్లవ భూతం’ నిర్వాకమే
- లోతైన కందకాలతోనే మెట్ట పొలాలన్నిటికీ సాగు నీటి భద్రత

‘సాక్షి’తో పర్యావరణ, సేంద్రియ సేద్య  ఉద్యమకారుడు మోహన్‌రెడ్డి
 
రైతుల ఆత్మహత్యలకు హరిత విప్లవమే మూలకారణమా?
హరిత విప్లవం వల్ల రసాయనిక ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్లు, హైబ్రిడ్ విత్తనాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఉచిత విద్యుత్ ఇవ్వటంతో బోర్లు విస్తారంగా తవ్వి, ట్రాక్టర్ల దుక్కితో మెట్ట భూమిని అత్యధిక విస్తీర్ణంలో సాగులోకి తెచ్చారు. కొన్ని దశాబ్దాలపాటు మధ్యతరగతి రైతులు కళ్లు చెదిరే ఆదాయాలు కళ్లజూశారు. కానీ, 1995 నాటికి బోర్లు విఫలం కావటం, మెట్టపంటలు విఫలం కావడం ఎక్కువైంది. క్రమంగా వ్యవసాయ కుటుంబాలు తట్టుకోలేనంత అప్పుల్లో కూరుకుపోవటంతో రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి.

భారత్ వంటి ఉష్ణమండల దేశాలు నీటి కొరత నుంచి ఎప్పటికీ బయటపడలేవని, ఆహార భద్రత కోల్పోయి శీతల దేశాల నుంచి ఆహారం దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ప్రపంచబ్యాంక్ కన్సల్టెంట్ ఒకరు అప్పట్లోనే ప్రకటించారు. సామాజిక కార్యకర్తగా ఉన్న నాకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్.. అప్పటి నుంచి నీటి సమస్యపై సీరియస్‌గా అధ్యయనం చేస్తున్నాం. నిరంతర కరువులే వర్షాధార పంటలను, మెట్ట రైతును చావు దెబ్బతీస్తున్నాయని, రైతుల ఆత్మహత్యలన్నీ ‘క్లైమేట్ ఛేంజ్ డెత్‌లే’(తల్లకిందులైన వాతావరణం వల్ల జరుగుతున్న మరణాలే)నన్న నిర్థారణకొచ్చాం. అంతేకాదు, క్లైమెట్ ఛేంజ్‌కు మూలకారణం కొందరు చెబుతున్నట్లు వాయు కాలుష్యం కాదు.. హరిత విప్లవం తెచ్చిన రసాయనిక వ్యవసాయ పద్ధతులే! వీటి వల్లనే సుమారు 10 లక్షల మంది మెట్ట రైతులు ఆత్మహత్య చేసుకున్నారు..
 
నిరంతర కరువుల గురించి మీ అధ్యయనంలో తేలిందేమిటి?
హరిత విప్లవం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. వరదలొచ్చిన ఏడాదిలోనూ మెట్ట పంటలు ఎండిపోవటం ఇందుకే. ఉదాహరణకు మహబూబ్‌నగర్ జిల్లా వంగూరులో 2004-2014 మధ్యకాలంలో వర్షపాతం చూస్తే.. 6 ఏళ్లు పంటలు దాదాపు ఫెయిల్ అయ్యాయి(ఇందులో 3 ఏళ్లు పంటలు పూర్తిగా పోయాయి. చిత్రమేమిటంటే.. ఈ మూడేళ్లలోనూ అదనుదాటిన తర్వాత కుండపోత వానల వల్ల వరదలొచ్చాయి). మిగతా నాలుగేళ్లలో పంటలు బాగున్నాయి. అంతకుముందుకన్నా ఎక్కువ సార్లు కరువొచ్చినట్టు గమనించాం. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో సైతం హరిత విప్లవానికి ముందు నీటి కరువు లేదు. ఇప్పటిలా శాశ్వత కరువు లేదు. ప్రకృతిసిద్ధంగా చెట్టూచేమను కనిపెట్టుకొని ఉండే ‘జలదుర్గా’న్ని హరిత విప్లవం బదాబదలు చేయడమే వ్యవసాయ సంక్షోభానికి దారితీస్తోంది.
జలదుర్గం అంటే?
నీటికి ఉన్నది ద్రవ రూపం మాత్రమేననుకుంటాం. కానీ, వాస్తవానికి 7 రూపాలున్నాయి. వర్షం, భూగర్భ జలం, నేలలోని తేమ, ఉపరితల జలం(బావులు, చెరువులు, రిజర్వాయర్లలో కనిపించే నీరు). చెట్టూ చేమ(ఆ మాటకొస్తే పంటల) మనుగడకు ఈ ‘జలదుర్గం’ పటిష్టమైన పర్యావరణపరమైన పునాది. అంతేకాదు.. గాలిలో తేమ, మంచు, తక్కువ ఎత్తులో ఉండి వర్షం కురిపించే మబ్బులు.. ఇవన్నీ నీటి ప్రతిరూపాలే. నీరు స్థిరంగా ఒకే రూపంలో ఉండదు.

అనుదినం రూపాంతరం చెందుతూ ఉంటుంది. హరిత విప్లవం ప్రకృతిసిద్ధమైన ఈ జలదుర్గాన్ని అన్నివిధాలా బదాబదలు చేసింది. గతంలో మాదిరిగా ఇప్పుడు కార్తెల ప్రకారం వర్షాలు పడటం లేదు. వర్షాకాలంలోనూ ఎక్కువ రోజులు చినుకు జాడ ఉండటం లేదు. తర్వాతెప్పుడో కుండపోత వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి. వర్షాధార పంటలు చాలా సార్లు చేతికి రాకుండాపోతున్నాయి.
 
రసాయనిక సేద్యం మానేస్తే ఆత్మహత్యలు ఆగుతాయా?
మెట్ట పంటలకు నీటి కొరత తీరిస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. చెరువులకు పూడిక తీస్తే సరిపోతుందని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. కానీ, చెరువులు బాగుచేసి వాన నీటిని నిల్వచేస్తే వాటి వాలులో ఉన్న 25% మెట్ట పొలాలకే నీరందుతుంది. మిగతా 75% మెట్ట పొలాల మాటేమిటి? ప్రతి మెట్ట పొలానికీ నీటి కొరత తీర్చే పద్ధతిని మేం రూపొందించాం. ప్రతి పొలంలోనూ వాలుకు అడ్డంగా లోతైన (4 అడుగుల లోతు, 4 అడుగుల వెడల్పు) కందకాలు తవ్వాలి. కురిసిన ప్రతి చినుకూ పొలంలోనే ఇంకుతుంది. కురిసిన ప్రతి చినుకును చెరువుకు పారబెట్టడం కాదు.. ఆ పొలంలోనే ఇంకేలా కందకాలు తవ్వాలి. రసాయనిక ఎరువుల వల్ల నేల బండబారిపోయింది. మనుషులు కందకాలు తవ్వడం అసాధ్యం. యంత్రాలతో తప్ప తవ్వలేం.
 
అసలు వర్షమే తక్కువ కురిస్తే..?
రెండు దుక్కుల (50ఎంఎం) వాన పడితే చాలు. కందకాల ద్వారా    భూగర్భ జలం పెరుగుతుంది. జలదుర్గాన్ని తిరిగి నిర్మించడానికి చేయాల్సిన మొదటి పని ఇది. సాధారణంగా మహబూబ్‌నగర్‌లో 560ఎంఎం,        అనంతపురంలో 550ఎంఎం వర్షపాతం కురుస్తుంది. తక్కువ కురిసినా, ప్రతి చినుకునూ నేలకు తాపితే చాలు, మెట్ట పొలాలకు నీటికరువుండదు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికి 700 ఎకరాల్లో కందకాలు తవ్వించాం. రానున్న మూడేళ్లలో 18 వేల ఎకరాల్లో తవ్వించబోతున్నాం.

ఒక్క పెద్దవానతోనే 15 ఏళ్ల నాడు ఎండిపోయిన వ్యవసాయ బావుల్లోకి నీళ్లొచ్చాయి. బోర్ల కింద డ్రిప్ పెట్టుకుంటే రెండు ఆరుతడి పంటలకు నిశ్చింతగా నీరందుతున్నది. ఖరీఫ్‌లో ఆరుతడి వరి, రబీలో ఇతర పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వ సాయం లేకుండానే కందకాలు తవ్వుకోవడానికి రైతులు ముందుకొస్తున్నారు.
 
క్లైమెట్ ఛేంజ్‌ని అడ్డుకోవడం కందకాలతో సాధ్యమేనా?
ముమ్మాటికీ సాధ్యమే. కందకాలతో 100% వాననీటి సంరక్షణ చేయవచ్చు. భారీ వర్షాల ద్వారా 60% వర్షపాతం నమోదవుతోంది. ఇందులో మూడింట ఒక వంతు మాత్రమే ఇప్పుడు భూమిలోకి ఇంకుతోంది. వాలుకు అడ్డంగా లోతైన కందకాలు తవ్వితే వర్షం 100% భూమిలోకి ఇంకుతుంది. నీటి కరువు తీర్చడానికి ఈ నీరంతా ఇంకితే చాలు. కందకాల్లో 2 మీటర్ల పొడవైన మొక్కలు నాటుతున్నాం. చెట్టూచేమ పెరుగుతుంది.

రైతు ఇంటిదగ్గర గొర్రెలు, మేకలను కట్టేసి(దొడ్డిమేత పద్ధతిలో) మొలకగడ్డితో పెంచుతున్నాం. రసాయనిక ఎరువులకు బదులు వీటి ఎరువు వాడుతున్నాం. గేదెలు, ఆవులకన్నా చిన్న జీవాలే మెట్ట రైతుకు అధికాదాయాన్నిస్తాయి. ప్రభుత్వం ముందు ఇప్పుడు రెండే మార్గాలున్నాయి. పొలాల్లోనే ప్రతి చినుకునూ ఇంకింపజేసి, సేంద్రియ సేద్యంతో నీటి భద్రతను, ఆహార భద్రతను, ఆదాయ భద్రతను మెట్ట రైతులకు కల్పించడమా? లేక  క్లైమేట్ ఛేంజ్‌ను ఎదుర్కొనే పేరిట కంపెనీల దోపిడీకి అనువైన జన్యుమార్పిడి పంటలకు జై కొట్టడమా?
ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు
ఫొటో : ఎ. సతీష్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement