అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నమూనాను అమలుచేస్తూ ఆహార ధరలను తక్కువ స్థాయిలో ఉంచడమే ప్రస్తుత వ్యవసాయ దుస్థితికి కారణమని రైతులు గుర్తించలేకపోతున్నారు. అందుకే వారు ఇప్పటికీ వ్యవసాయంపై తమ ఆశలను చంపుకోలేకపోతున్నారు. డబ్బు, శ్రమశక్తి అధికంగా అవసరమయ్యే తరహా వ్యవసాయంలో మరింతగా ఆత్మహత్యలు పెరిగే ప్రమాదముంది. పైగా అప్పు పెరిగే కొద్దీ రైతు రుణభారంలో కూరుకుపోయే అవకాశం ఎక్కువ అవుతుంది. పంజాబ్‌లోని ఒక సన్నకారు రైతు జస్వంత్ సింగ్ మాటల్లో చెప్పాలంటే, ‘‘ఇది జీవితం కానేకాదు. జీవితకాలం పొడవునా అప్పుల ఊబిలోనే చిక్కుకుపోవడం నిజంగానే శాపం’’.
దేశంలో రైతులు బంగాళాదుంపలను గిట్టుబాటు ధరలు లేక వీధుల్లో రాశులుగా పోస్తుండటం.. తాము నిల్వచేసిన ఆలుదుంపలను వదిలించుకోవడం శీతలీకరణ కేంద్రాల యజ మానులకు కూడా కష్టమైపోతుండటం ఒక వైవు దృశ్యం కాగా, మరోవైపున ఈ దేశంలోనే కొన్ని పాపులర్ బ్రాండ్ కంపెనీలు 50 గ్రాముల బంగాళా దుంపల చిప్స్ ప్యాకెట్‌ని రూ.20లకు అమ్ముతూ లాభాలు గుంజుకుంటున్నారు. మరోమాటలో చెప్పాలంటే, ఒక కిలో బంగాళాదుంపలకు ధర బాగా పలుకుతున్న సీజన్లో కూడా రైతుకు కేజీకి 5 నుంచి 7 రూపాయలకు మించి రావటం లేదు. అదే బంగాళా దుంపలను ప్రాసెస్ చేసి చిప్స్‌గా మార్చితే కిలోకు రూ.400లు ధర పలుకుతోంది.
ధరల నిర్ణయంలో జిత్తులమారితనం
అదేవిధంగా టమాటా ఉదంతాన్ని పరిశీలిద్దాం. ఛత్తీస్‌గఢ్‌లో టమాటాల ధర సీజన్ మొత్తంమీద చాలావరకు రైతులకు కిలోకి 2 రూపాయలకు మించి ధర పలకటం లేదు. అదే టమాటా దేశ రాజధాని న్యూఢిల్లీలో, ముంబైలో, చండీగఢ్‌లోనూ కిలోకి 18 నుంచి 25 రూపాయల వరకు పలుకుతోంది. మరోవైపున ఆన్‌లైన్ స్టోర్ అమెజాన్ లేక ఫ్లిప్‌కార్ట్‌లలో టమాటా పేస్ట్ ధర ఎంత ఉందో శోధించి చూడండి. అక్కడ కిలో టమాటా పేస్ట్ రూ.399లకు అమ్ముతున్నారు.
పరిశ్రమ డేటా ప్రకారం కిలో టమాటా పేస్ట్ తయారీకి 5.6 కిలోల టమాటాలు అవసరమవుతాయి. టమాటా చట్నీ సైతం కిలో రూ.68లకు అమ్ముతున్నారు. ఆర్థిక శాస్త్రం నిజాన్ని బయటపెట్టకపోవచ్చు కానీ, ధరల నిర్ణయంలో ప్రాథమికంగా పన్నుతున్న జిత్తులమారితనం వల్లే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ధరలు చుక్కలంటుతున్నాయి. ఆహార విలువకు సంబంధించిన గొలుసు చక్రం ఎంత చెడ్డగా ఈ దేశంలో పనిచేస్తోందో, అమలవుతోందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు.
అంతర్జాతీయంగా కూడా ఆహార పదార్థాల విలువకు చెందిన చట్రం ఇదేరీతిలో క్రూరంగా కొనసాగుతోంది. ఈక్వెడార్‌లో పెంచుతున్న ఒక డాలర్ విలువైన అరటిపళ్లను సప్లయ్ చైన్ ద్వారా ఎలా పంపిణీ చేస్తున్నారో పరిశీలిస్తే మీరు షాక్‌కు గురికావడం తథ్యం. సూపర్‌మార్కెట్లు 40 శాతం లాభాలతో నడుస్తుండగా అరటిపళ్లను పండించే ప్రధాన రైతు మాత్రం ఈక్వెడార్‌లో చివరి రిటైల్ ధరలో 0.02 శాతం రాబడిని మాత్రమే పొందుతున్నాడు.
ఇక మార్కెట్లో అమ్ముతున్న డెయిరీ పాల విషయాని కొస్తే, ప్రతి డాలర్ విలువైన పాలకుగానూ అమెరికన్ రైతు 11 సెంట్లను మాత్రమే పొందుతున్నాడు. అమెరికాలో, ఇంగ్లండ్‌లో, యూరప్‌లో గత కొన్ని సంవత్సరాల కాలంలో వందలాది డెయిరీ ఫారంలు మూసివేతకు గురయ్యాయంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ వివరాలు సరిపోవు అనుకుంటే, రాబోయే నెలల్లో పాల ధరలు కూడా పతనం చెందవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం పరిస్థితి అత్యంత స్పష్టంగా ఒక సందేశాన్ని ఇస్తోంది. అదేమిటంటే, ‘భారీగా వ్యాపారం సాగించి లేదా మూసుకుని వెళ్లు’.
సూపర్ మార్కెట్ల నీడలో నయా దళారులు
ఇంగ్లండ్‌లో అన్ని రకాల ఆహార పదార్థాల అమ్మకాలపై రైతులకు 4.5 శాతం మాత్రమే వస్తోంది. చాలా దశాబ్దాలుగా ఆహారం, వ్యవసాయ రంగాలపై విశేషంగా కృషి చేస్తున్న ప్రొఫెసర్ టిమ్ లాంగ్ ఇటీవల జరిగిన ఒక సదస్సులో ఈ విషయం తెలిపారు. వంద సంవత్సరాల క్రితం అమ్ముడైన ఆహార ఉత్పత్తుల ధరలో ప్రతి డాలర్‌కు రైతుకు 70 సెంట్ల దాకా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడయ్యే ప్రతి డాలర్ విలువైన వ్యవసాయ సరుకులో రైతుకు దక్కే వాటా కేవలం 4 శాతానికి పడిపోయింది. రైతుల రక్తం తాగుతున్నారనే ఆరోపణలకు గురవుతున్న మధ్య దళారీ వర్గాన్ని తొలగించి సూపర్ మార్కెట్లు వ్యాపారాన్ని కైవసం చేసుకుంటున్న సమయంలో కూడా రైతు నికరాదాయం ఇంత దారుణంగా పతనం కావడం వ్యవసాయ రంగ నిపుణులకే దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
సూపర్‌మార్కెట్లు బాగా అభివృద్ధి చెందుతున్న కాలంలోనే రైతు ఆదాయం ఇంతగా క్షీణించి పోతోందన్నది వాస్తవం. అదే సమయంలో గుర్తుంచుకోవలసిన మరొక చేదువాస్తవం ఏమిటంటే సూపర్ మార్కెట్ల ఆవిర్భావ, వికాస క్రమంలోనూ వ్యవసాయంలో మధ్యదళారుల సంఖ్య తగ్గిపోవడానికి బదులుగా పెరుగుతోంది. గతానికీ, ప్రస్తుతానికీ వ్యత్యాసం ఏమిటంటే, క్వాలిటీ కంట్రోలర్, సర్టిఫై ఏజెంట్, ప్రాసెసర్, డిజైనర్ వంటి పనుల రూపంలో మధ్యదళారుల వ్యవస్థను పెంపొందించే భారీ గొడుగుగా మల్టీ బ్రాండ్ రిటైల్ వర్తకం కొనసాగడమే.
స్తంభించిన వ్యవసాయరంగ ఆదాయం
గత నాలుగు దశాబ్దాలుగా, ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాలలో పండిస్తున్న ఆహార పదార్ధాల ధరలు స్తబ్దతకు గురయ్యాయి. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు తర్వాత దాదాపు అన్ని రకాల ఆహార పదార్ధాలపై రైతులకు లభిస్తున్న ధర కాస్త ఎక్కువగా, లేదా తక్కువగా ఉంటూ స్తంభించిపోయింది. వాణిజ్య అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు –యుఎన్‌సిటిఎడి– అంచనా ప్రకారం, 1985–2005 మధ్య కాలంలో 20 సంవత్సరాల కాలానికి గాను ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత, రైతులకు దక్కిన వ్యవసాయ ధరల్లో పెద్దగా మార్పు లేదని తెలుస్తోంది. ఇక భారతదేశంలో 2011–2016 మధ్య అయిదేళ్ల కాలంలో రైతుల నిజ ఆదాయం కేవలం 0.44 శాతం మాత్రమే పెరిగినట్లు నీతి అయోగ్ అధ్యయనం తెలిపింది. మరోమాటలో చెప్పాలంటే వ్యవసాయ ఆదాయం స్తంభించిపోయింది.
అమెరికాలోనూ ఇది వాస్తవమే. మైక్ కలిక్రేట్ తన బ్లాగులో రాసిన కథనంలో ఇలా పేర్కొన్నారు. ‘‘1974 డిసెం బర్ 2న ఒక బుషెల్ (25.40 కిలోలకు సమానం) జొన్నల ధర 3.58 డాలర్లగా ఉండేది. 2018 జనవరిలో అదే బుషెల్ జొన్నల ధర 3.56 డాలర్లు పలికింది. అంటే ఈ 44 ఏళ్లలో ధర రెండు సెంట్లు తగ్గింది. 1974లో తొలిసారి జొన్న పంట వేసిన రైతు తాను రిటైర్ అయ్యేనాటికి కూడా అదే ధరలను స్వీకరిస్తున్నాడు. అదే సమయంలో విత్తనాలు, భూమి, వ్యవసాయ సామగ్రి, ఎరువులు, ఇంధన ధరలు అసాధారణంగా పెరుగుతూ వచ్చాయి’’.
చారిత్రకంగా వ్యవసాయ ధరలు స్వల్ప స్థాయిలో ఉంటూండటంతో, ఈ పరిస్థితి రైతులను అగమ్యగోచర స్థితిలోకి నెడుతోంది. అయినప్పటికీ మనుగడకోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని నేను ప్రశంసించకుండా ఉండలేను. వారు తమ కాడిని దింపదలుచుకోలేదు. కనుచూపుమేర కనిపించని ఆశాభావం మీద ఇప్పటికీ వారు ఆశాభావంతో బతుకుతున్నారు. గిట్టుబాటు ధరలకు, కాస్త అధిక ధరలకు తాము చేస్తున్న డిమాండును ప్రభుత్వం త్వరలో లేక తర్వాతైనా ఆమోదిస్తుందని, తమకు అచ్చే దిన్ తీసుకురాగల మార్కెట్ యంత్రాంగాన్ని ఏర్పర్చగలదని వారు విశ్వసిస్తున్నారు.
ఆహార ధరలను తక్కువ స్థాయిలో ఉంచేందుకు అంతర్జాతీ యంగా ఆర్థిక వ్యవస్థల నమూనాను అమలు చేస్తూం డటమే దేశంలో వ్యవసాయ దుస్థితి కొనసాగింపునకు కారణమనే విషయం గుర్తించని రైతులు ఆశలు చంపుకోకుండానే బతికేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలు చెల్లుబాటు అయ్యేందుకు దేశంలో రైతులను ఉద్దేశపూర్వకంగానే దారిద్య్రంలో ఉంచుతున్నారు. దీని ఫలితంగా గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం అత్యంత ఒత్తిడితో కూడుకున్న కార్యక్రమంగా మారిపోయింది. అందుకే వ్యవసాయదారుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడటానికి అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నూతన చట్టాలను తీసుకొచ్చారు.
రైతు జీవితమే ఓ శాపగ్రస్తం
భారతదేశంలోనూ వ్యవసాయరంగంలో తీవ్ర ఒత్తిడితో కూడిన వాతావరణం స్పష్టంగానే కనబడుతోంది. దేశంలోని నలు మూలలనుంచి ప్రతి రోజూ రైతుల ఆత్మహత్యలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మెట్ట భూముల్లో సాగు కంటే మాగాణి భూముల్లో సాగు చేస్తున్న రైతుల్లోనే ఆత్మహత్యల రేటు ఎక్కువ కావడం వాస్తవం. అంటే డబ్బు, శ్రమశక్తి అధికంగా అవసరమయ్యే రకం వ్యవసాయ రకంలో మరింతగా ఆత్మహత్యలు పెరిగే ప్రమాదముంది. అప్పు పెరిగే కొద్దీ రైతు రుణభారంలో కూరుకుపోయే అవకాశం ఎక్కువ అవుతుంది. పంజాబ్‌లోని ఒక సన్నకారు రైతు జస్వంత్ సింగ్ మాటల్లో చెప్పాలంటే, ‘‘ఇది జీవితం కానేకాదు. జీవితకాలం పొడవునా అప్పుల ఊబిలోనే చిక్కుకుపోవడం నిజంగానే శాపం’’.
వ్యాసకర్త: దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment