నివాళి అర్పిస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తదితరులు
మల్లన్నా..ఓ రైతన్నా..ఆరుగాలమూ..ఎవుసమే అంటివి..స్వేదం చిందించి పైరును కాపాడితివి.ప్రకృతి పగబడితే పదిలం జేసుకుంటివి..భూ తల్లిని నమ్ముకునికుటుంబాన్ని సాకుతుంటివి..ధాన్యపు రాశుల పంట మురిపెం తీరకపాయే..కష్టార్జితం ఇంటికి చేరకపాయే..అలుపెరుగని కౌలు చాకిరీచి‘వరి’కి ఉసురు తీసుకునే..బతికున్నోళ్లకు ‘పుట్టెడు’ దుఃఖాన్ని మిగిల్చే.
నేలకొండపల్లి:స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నేలకొండపల్లికి చెందిన చెక్కల మల్లయ్య(55) అనే కౌలురైతు ధాన్యం ఆరబోస్తూ..గుండెపోటుతో సోమవారం హఠాన్మరణం చెందాడు. యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి తాను సాగు చేసిన కౌలు భూమిలోని వరిపంటను యంత్రంతో కోయించగా..వడ్లు కాస్త తేమగా ఉన్నాయని ఆరబోస్తుండగా..ఎండ తీవ్రతకు నీరసించి..ఒక్కసారిగా గుండెపోటుతో ఆ వడ్ల రాశిపైనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. తోటి రైతులు చూసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా..అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ రైతు..కొన్నేళ్లుగా భూములను కౌలుకు తీసుకుని..జీవనం సాగిస్తున్నాడు.
కాయకష్టం చేసి..పంటలను కాపాడుకుని..ఇంటిని నెట్టుకొస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు శ్రీను హమాలీగా..రెండో కొడుకు నాగరాజు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె వెంకటలక్ష్మి భర్త చనిపోగా..ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రి వద్దనే ఉంటోంది. అందరికీ అభయంగా ఉంటూ..ఇటు వ్యవసాయం, అటు వంట మాష్టారుగా పనులు చేస్తూ..మంచి వ్యక్తిగా పేరొందిన చెక్కల మల్లయ్య ఇలా మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతదేహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకురాలు బేబి స్వర్ణ కుమారి, సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు శీలం వెంకటలక్ష్మి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మైశా శంకర్, వార్డు సభ్యురాలు గడ్డం చంద్రకళ, దేవస్థానం చైర్మన్ బాజా నాగేశ్వరరావు, వంట మాష్టార్ల సంఘం నాయకులు చట్టు ధనమూర్తి, సాలయ్య, పెద్ధరాజు నర్సయ్య తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment